Begin typing your search above and press return to search.

బాహుబలి : చూడని సీన్స్‌ చూడబోతున్నారు..!

బాహుబలి ఫీవర్ మళ్లీ మొదలైంది. 2015లో బాహుబలి విడుదలై బిగ్గెస్ట్‌ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది.

By:  Ramesh Palla   |   27 Oct 2025 10:26 AM IST
బాహుబలి : చూడని సీన్స్‌ చూడబోతున్నారు..!
X

బాహుబలి ఫీవర్ మళ్లీ మొదలైంది. 2015లో బాహుబలి విడుదలై బిగ్గెస్ట్‌ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఆ తర్వాత వచ్చిన బాహుబలి 2 ఇండియన్‌ సినిమా రికార్డ్‌లను బ్రేక్ చేసింది. ఇప్పటి వరకు బాహుబలి 2 నమోదు చేసిన చాలా రికార్డ్‌లు అలాగే ఉన్నాయి. రాజమౌళి సైతం తన రికార్డ్‌లను తాను బ్రేక్‌ చేసుకోలేక పోయాడు. అలాంటి రికార్డ్‌లను క్రియేట్‌ చేసిన బాహుబలి గురించి ఇప్పటికీ చర్చ జరుగుతూనే ఉంది. విడుదలై ఇన్ని ఏళ్లు అయినా కూడా ఇండస్ట్రీలో బాహుబలి అనే చర్చ జరుగుతూనే ఉంది. అందుకే బాహుబలి : ది ఎపిక్ రిలీజ్ కి కొత్త సినిమా రిలీజ్ రేంజ్లో బజ్‌ క్రియేట్‌ అయింది. రెండు పార్ట్‌లను సింగిల్‌ పార్ట్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్న నేపథ్యంలో ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తింది. ఇటీవల విడుదలైన ట్రైలర్‌ సినిమాపై మరింతగా అంచనాలు క్రియేట్‌ చేసింది అనడంలో సందేహం లేదు.

బాహుబలి రెండు పార్ట్‌లు కలిపి..

ప్రభాస్, రాజమౌళి కాంబోలో దాదాపు అయిదు ఏళ్ల పాటు రూపొందిన బాహుబలి రెండు పార్ట్‌లను ఒకే పార్ట్‌గా బాహుబలి : ది ఎపిక్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు చాలా బ్యాక్‌గ్రౌండ్‌ వర్క్ జరిగిందని అంటున్నారు. రాజమౌళి స్వయంగా రంగంలోకి దిగి ఎడిటింగ్ వర్క్‌ చూసుకున్నాడని, సౌండ్‌ విషయంలోనూ కొత్తగా ఉండే విధంగా ప్లాన్ చేశారని అంటున్నారు. తాజాగా సినిమా గురించి మరో ఆసక్తికర అప్డేట్ వచ్చింది. సినిమా విడుదల నేపథ్యంలో సినిమాటోగ్రాఫర్‌ సెంథిల్ కుమార్‌ మీడియాతో మాట్లాడుతూ బాహుబలి : ది ఎపిక్‌ పై అంచనాలు రెట్టింపు అయ్యేలా చేశాడు. రెండు పార్ట్‌లను ఎడిట్ చేసి ఒక్క పార్ట్‌గా చేయడం మాత్రమే కాదని, గతంలో యాడ్‌ చేయలేక పోయిన కొన్ని సీన్స్‌ను, విజువల్స్‌ను ఈ సినిమాలో యాడ్‌ చేసినట్లుగా ఆయన చెప్పడంతో ఆ కొత్త సీన్స్‌ ఏమై ఉంటాయా అని అందరిలోనూ ఆసక్తి పెరిగింది.

బాహుబలి ది ఎపిక్‌ రిలీజ్‌కి రెడీ

బాహుబలి రెండు పార్ట్‌లను ఒక్క పార్ట్‌లో చూపించబోతున్నారు, ఇందులో కొత్త ఏం ఉండదు, ఇది అన్ని సినిమాల మాదిరిగా రీ రిలీజ్ అనుకుంటున్న వారికి తాజాగా సెంథిల్‌ చేసిన ప్రకటన ఉత్సాహాన్ని ఇస్తుంది, రాజమౌళి దర్శకత్వంలో వచ్చే ఒక్క కొత్త సీన్‌ అయినా పైసా వసూళ్‌ అనిపిస్తుంది. అందుకే ఆ సీన్స్ ను చూడ్డానికి అయినా థియేటర్లకు పరుగులు పెట్టాల్సిందే అని అభిమానులతో పాటు అన్ని వర్గాల వారు అంటున్నారు. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్‌ ప్రారంభం అయింది. రికార్డ్‌ స్థాయిలో సినిమాకు సంబంధించిన టికెట్ల బుకింగ్‌ కనిపిస్తుంది. ఇప్పటి వరకు ఏ సినిమా రీ రిలీజ్ లో నమోదు చేయని వసూళ్లను ఈ సినిమా రాబట్టే అవకాశాలు క్లీయర్‌గా కనిపిస్తున్నాయి. ప్రభాస్ ఫ్యాన్స్‌తో పాటు జక్కన్న ఫ్యాన్స్ సినిమా రూ.100 కోట్ల మార్కెట్‌ను చేరబోతుందనే విశ్వాసంను చాలా బలంగా వ్యక్తం చేస్తున్నారు.

ప్రభాస్ హీరోగా అనుష్క, తమన్నా హీరోయిన్స్‌గా...

ప్రభాస్‌ స్టామినాను ఆకాశమే హద్దు అన్నట్లుగా పెంచిన బాహుబలి సినిమా బాక్సాఫీస్ వద్ద షేక్‌ చేసే విధంగా మళ్లీ వసూళ్లు నమోదు చేయడం ఖాయం అనిపిస్తుంది. రాజమౌళి నుంచి సినిమా రాక చాలా కాలం అయింది, అంతే కాకుండా ప్రభాస్‌ అభిమానులు సైతం సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో రాబోతున్న బాహుబలి : ది ఎపిక్‌ సినిమా బిగ్గెస్ట్‌ బ్లాక్ బస్టర్‌ విజయాన్ని సొంతం చేసుకోవడం పెద్ద కష్టం ఏమీ కాదు అనిపిస్తుంది. కొత్త సీన్స్‌తో సరికొత్తగా బాహుబలిని చూడాలని ఆశ పడుతున్న ప్రేక్షకుల్లో ఫ్యామిలీ ప్రేక్షకులు ఎక్కువగా ఉన్నారు.

రానా విలన్‌గా నటించిన ఈ సినిమాలో అనుష్క, తమన్నాలు హీరోయిన్స్‌గా నటించిన విషయం తెల్సిందే. కీరవాణి అందించిన సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ ఎపిక్‌లో ఎన్ని పాటలు ఉంటాయి, ఏ పాటలను తొలగిస్తారు అనేది తెలియాల్సి ఉంది. 3 గంటల 45 నిమిషాల నిడివితో రాబోతున్న బాహుబలి ది ఎపిక్‌ సినిమా సరికొత్త రికార్డ్‌లను నమోదు చేసేనా అనేది తెలియాలంటే మరికొన్ని గంటలు వెయిట్‌ చేయాల్సిందే.