బాహుబలి రీ రిలీజ్.. అతను కోరుకున్నట్లు 500 కోట్లు వస్తాయా?
'బాహుబలి' రీ రిలీజ్ హడావుడి గత కొన్ని వారాలుగా సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
By: M Prashanth | 19 Oct 2025 3:00 AM IST'బాహుబలి' రీ రిలీజ్ హడావుడి గత కొన్ని వారాలుగా సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. రెండు భాగాలను కలిపి 'బాహుబలి: ది ఎపిక్'గా అక్టోబర్ 31న విడుదల చేయబోతున్నారనే వార్త ఈమద్యే బయటకు వచ్చింది. ఇప్పటికే ఓవర్సీస్‌లో అడ్వాన్స్ బుకింగ్స్ కూడా మొదలైపోయి, రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి.చూస్తుంటే రీ రిలీజ్ ట్రెండులో ఆల్ టైమ్ బెస్ట్ రికార్డ్ అని అనిపిస్తోంది.
ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురించి రోజుకో వార్త వస్తూనే ఉంది. ఈ హడావుడి మధ్యలో, ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ పాత ట్వీట్ తెగ చక్కర్లు కొడుతోంది. ఈ రీ రిలీజ్ అనే మొదటి కోరిక ఎవరిది? దీని వెనుక ఉన్న అసలు కథేంటి అనేదానికి ఈ ట్వీట్ ఒక సమాధానంలా నిలుస్తోంది. ప్రముఖ దర్శకుడు దేవా కట్టా షేర్ చేయడంతో ఈ విషయం ఇప్పుడు మరింత హాట్ టాపిక్‌గా మారింది.
అసలు మ్యాటర్ ఏంటంటే, 2017లోనే విక్రమ్ నారాయణరావు అనే ఓ నెటిజన్, దర్శకుడు రాజమౌళికి ఓ అభ్యర్థన పెట్టాడు. "రాజమౌళి గారు, బాహుబలి పార్ట్ 1, 2 కలిపి ఎడిట్ చేసి ఒకే సినిమాగా రిలీజ్ చేయండి. ఇది ప్రపంచ సినిమా చరిత్రలో ఓ అద్భుతం అవుతుంది" అంటూ ట్వీట్ చేశాడు. అంతేకాదు, "ఈ అద్భుతంతో మళ్లీ తక్కువలో తక్కువ 500 కోట్ల కలెక్షన్స్ రాబట్టవచ్చు" అని ఆ నెటిజన్ అప్పట్లోనే అంచనా వేశాడు.
ఆశ్చర్యకరంగా, ఏడేళ్ల తర్వాత ఇప్పుడు అదే జరగబోతోంది. ఆ పాత ట్వీట్‌ను రీ ట్వీట్ చేసిన దేవా కట్టా, "తథాస్తు! ఓ అభిమాని కోరిక ఈ అక్టోబర్ 31న నిజం కాబోతోంది" అని పోస్ట్ చేశారు. ఈ ఒక్క ట్వీట్‌తో 'బాహుబలి: ది ఎపిక్' వెనుక ఉన్న ఆసక్తికరమైన కథ బయటపడింది. అయితే నిజంగా మేకర్స్‌కు వచ్చిన సొంత ఆలోచననా లేదంటే ఇలా ఫ్యాన్స్ రిక్వెస్ట్ లను కూడా పరిగణనలోకి తీసుకున్నారా అనేది మేకర్స్ లో ఎవరో ఒకరు క్లారిటీ ఇస్తే గాని తెలియదు.
ఏదేమైనా ఓ అభిమాని ఎప్పుడో వేసిన ఒక ట్వీట్ కు ఇప్పుడు బాహుబలి ఎపిక్ సమాధానంగా నిలవనుంది. అలాగే ఆ నెటిజన్ అంచనా వేసినట్లే ఈ చిత్రం భారీ వసూళ్లు సాధిస్తుందేమోనని ఇప్పుడు అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. యూఎస్‌ఏలో ఇప్పటికే మొదలైన బుకింగ్స్ చూస్తుంటే ఆ నెటిజన్ జోస్యం నిజమయ్యేలాగే కనిపిస్తోంది. మొత్తం మీద, ఈ రీ రిలీజ్ వెనుక ఇంత కథ ఉందన్నమాట. మరి ఆ అభిమాని కోరుకున్నట్లే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి అద్భుతాలు సృష్టిస్తుందో తెలియాలంటే అక్టోబర్ 31 వరకు ఆగాల్సిందే.
