Begin typing your search above and press return to search.

బాహుబలి రీ రిలీజ్.. బుకింగ్స్ పరిస్థితి ఎలా ఉందంటే?

యూఎస్‌ఏలో ప్రభాస్‌కు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

By:  M Prashanth   |   17 Oct 2025 1:30 PM IST
బాహుబలి రీ రిలీజ్.. బుకింగ్స్ పరిస్థితి ఎలా ఉందంటే?
X

ఒక సినిమా బ్రాండ్ వాల్యూ ఏంటో తెలియాలంటే, అది రీ రిలీజ్‌లో ఎంత సందడి చేస్తుందో చూస్తే చాలు. 'బాహుబలి' విషయంలో ఇప్పుడు సరిగ్గా అదే జరుగుతోంది. 'బాహుబలి: ది ఎపిక్'గా సరికొత్త రూపంలో అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం, విడుదలకి రెండు వారాల ముందే ఓవర్సీస్‌లో, ముఖ్యంగా యూఎస్‌ఏలో అడ్వాన్స్ బుకింగ్స్‌తో రికార్డుల వేట మొదలుపెట్టింది. చూస్తుంటే, పదేళ్లయినా 'బాహుబలి' క్రేజ్ చెక్కు చెదరలేదని స్పష్టమవుతోంది.

యూఎస్‌ఏలో ప్రభాస్‌కు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన పాత సినిమాలు రీ రిలీజ్ అయినా మంచి వసూళ్లే వస్తాయి. అయితే, 'బాహుబలి: ది ఎపిక్' మాత్రం ఆ లెక్కలన్నింటినీ తిరగరాస్తోంది. ప్రీ సేల్స్‌లోనే ఈ చిత్రం ఏకంగా 61,000 డాలర్ల (సుమారు రూ.50 లక్షలకు పైగా) మార్క్‌ను దాటేసింది. ప్రభాస్ ఇతర రీ రిలీజ్ చిత్రాలైన 'బిల్లా' ($13,581), 'సలార్' ($7,904) ఫుల్ రన్ కలెక్షన్లను కేవలం అడ్వాన్స్ బుకింగ్స్‌తోనే అవలీలగా దాటేసింది.

ఇది 'బాహుబలి' బ్రాండ్‌కు, రాజమౌళి మేకింగ్‌కు ఉన్న పవర్‌ను చూపిస్తోంది. అయితే, ఈ రీ రిలీజ్‌పై ఇంత బజ్ క్రియేట్ అవ్వడానికి కేవలం పాత క్రేజ్ మాత్రమే కారణం కాదు. మేకర్స్ అనుసరిస్తున్న వ్యూహం కూడా దీనికి ఒక ముఖ్య కారణం. ఇది కేవలం పాత సినిమాలను మళ్లీ వేయడం కాదు. రెండు భాగాలను కలిపి, కొన్ని కొత్త సన్నివేశాలను జోడించి, 3 గంటల 44 నిమిషాల నిడివితో ఒక సరికొత్త సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌గా అందిస్తున్నారు.

ఈ 'కొత్త కంటెంట్' అనే అంశమే ప్రేక్షకులలో క్యూరియాసిటీని పెంచుతోంది. విజువల్స్ కూడా కొత్తగా కనిపించేలా అప్గ్రేడ్ చేశారని తెలుస్తోంది. ఇండియాలో కూడా బుక్ మై షో లాంటి ప్లాట్‌ఫామ్‌లలో ఈ సినిమాపై కనిపిస్తున్న ఆసక్తి కొత్త సినిమాల రేంజ్‌లో ఉంది. ఇది కచ్చితంగా మంచి ఓపెనింగ్స్‌కు దారి తీస్తుంది. అయితే, ఇక్కడే అసలు సవాల్ మొదలవుతుంది. దాదాపు నాలుగు గంటల నిడివి ఉన్న సినిమాను, ఇప్పటికే చాలాసార్లు చూసిన ఆడియన్స్ మళ్లీ థియేటర్‌లో పూర్తిస్థాయిలో ఆదరిస్తారా అనేది చూడాలి.

ఈ రీ రిలీజ్ విజయం కేవలం ఓపెనింగ్స్‌పై మాత్రమే కాకుండా, లాంగ్ రన్‌పై ఆధారపడి ఉంటుంది. ఆ కొత్తగా యాడ్ చేసిన సీన్స్ ప్రేక్షకుడికి ఎంతవరకు ఫ్రెష్ ఫీలింగ్‌ను ఇస్తాయనేదే కీలకం. ఒకవేళ ఆ కొత్తదనం ప్రేక్షకులను మెప్పిస్తే, రీ రిలీజ్‌లలో కూడా బాహుబలి సరికొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేయడం ఖాయం. యూఎస్‌ఏ ప్రీ సేల్స్ చూస్తుంటే ‘బాహుబలి: ది ఎపిక్’కు పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ఇక ఆ లెక్క ఎంతవరకు వెళుతుందో చూడాలి.