బాహుబలి-3పై క్లారిటీ.. ఎపిక్ వెర్షన్ లో బిగ్ సర్ప్రైజ్!
ఇప్పుడు ఆ రెండు సినిమాలు కలిపి ఒకే మూవీగా మరికొద్ది రోజుల్లో బాహుబలి: ది ఎపిక్ గా రీ రిలీజ్ కానుంది.
By: M Prashanth | 7 Oct 2025 6:27 PM ISTపాన్ ఇండియా సెన్సేషన్ బాహుబలి మూవీ గురించి అందరికీ తెలిసిందే. భారతీయ సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన ఆ బ్లాక్ బస్టర్ హిట్ సినిమా.. రిలీజ్ అయ్యి దాదాపు పదేళ్లు కంప్లీట్ అయింది. 2015లో బాహుబలి: ది బిగినింగ్ మూవీ రిలీజ్ కాగా.. 2017లో బాహుబలి: ది కంక్లూజన్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఇప్పుడు ఆ రెండు సినిమాలు కలిపి ఒకే మూవీగా మరికొద్ది రోజుల్లో బాహుబలి: ది ఎపిక్ గా రీ రిలీజ్ కానుంది. అక్టోబర్ 31వ తేదీన రిలీజ్ కానుండగా.. ఇప్పటికే మేకర్స్ విడుదల చేసిన టీజర్ మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. అయితే స్పెషల్ వెర్షన్ లో బాహుబలి-3పై అనౌన్స్మెంట్ ఉంటుందని గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది.
ఇప్పుడు దానిపై ఓ ఇంటర్వ్యూలో బాహుబలి ఫ్రాంచైజీ నిర్మాత శోభు యార్లగడ్డ క్లారిటీ ఇచ్చారు. ఎపిక్ వెర్షన్ లో బాహుబలి-3పై క్లారిటీ ఇస్తారంటూ వచ్చిన వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలిపారు. ఆ సినిమాకు సంబంధించి ఇంకా చాలా వర్క్ చేయాల్సి ఉందని చెప్పారు. దానికి చాలా సమయం పట్టే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు.
అదే సమయంలో బాహుబలి: ది ఎపిక్ లో బాహుబలి 3కి సంబంధించి ఎలాంటి ప్రస్తావన లేకపోయినా.. ఓ సర్ప్రైజ్ మాత్రం ఆశించవచ్చని తెలిపారు. దీంతో ఆ సర్ప్రైజ్ ఏంటనేది ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఏమయ్యి ఉంటుందోనని అటు సినీ ప్రియులు.. ఇటు ప్రభాస్ అభిమానులు మాత్రం తెగ డిస్కస్ చేసుకుంటున్నారు.
ఇక.. బాహుబలి సినిమాల రీ రిలీజ్ నుంచి ఎంత కలెక్షన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారని అడగ్గా.. తాము వసూళ్ల కోసం మూవీని మళ్లీ స్పెషల్ వెర్షన్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడం లేదని తెలిపారు శోభు. బాహుబలి రిలీజై పదేళ్లు పూర్తైన సందర్భంగా బాహుబలి: ది ఎపిక్ మూమెంట్ ను సెలబ్రేట్ చేసే దానిపైనే తమ దృష్టి అంతా ఉందని తెలిపారు.
బాహుబలి ఎపిక్ వెర్షన్ ద్వారా ఫ్యాన్స్, మూవీ లవర్స్ కు బెస్ట్ థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ అందించేందుకు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. ఆ మూవీ మేజిక్ ను అందరూ ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నామని చెప్పారు. అయితే బాహుబలి ఫ్రాంఛైజీలోని రెండు సినిమాలను ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్‌పై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మించారు. బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలు అందుకున్నారు.
