బాహుబలి: ది ఎపిక్ నుంచీ ఆ సాంగ్ కట్.. ఎంత పని చేశావ్ జక్కన్న!
రాజమౌళి మాట్లాడుతూ.." బాహుబలి: ది ఎపిక్ సినిమా రిలీజ్ విషయంలో అన్నిటికంటే కష్టమైన పని ఎడిటింగ్ మాత్రమే.
By: Madhu Reddy | 27 Aug 2025 4:33 PM ISTతెలుగు సినిమా ఖ్యాతిని ఎల్లలు దాటించి ఊహించని పాపులారిటీ సొంతం చేసుకున్న డైరెక్టర్ రాజమౌళి.. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్ గా పేరు సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా ఈ సినిమా సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడమే కాకుండా ఒక కొత్త ట్రెండ్ ను సృష్టించింది. సాధారణంగా అప్పటివరకు చాలామందికి పాన్ ఇండియా మూవీపై పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. కానీ రాజమౌళి తీసిన బాహుబలి సినిమా ఎప్పుడైతే పాన్ ఇండియా అంటూ అన్ని భాషలలో విడుదల అయి.. సక్సెస్ అందుకుందో.. ఇక అప్పటి నుంచి చిన్న హీరోలను మొదలుకొని.. పెద్ద హీరోల వరకు ప్రతి ఒక్కరు పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడానికి తెగ కష్టపడుతున్నారు.
బాహుబలి, బాహుబలి 2 చిత్రాలతో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న రాజమౌళి.. ఇప్పుడు మహేష్ బాబుతో ఎస్ఎస్ఎంబి 29 అనే వర్కింగ్ టైటిల్ తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా రాజమౌళికి పాన్ ఇండియా స్థాయి గుర్తింపు అందించిన చిత్రం బాహుబలి.. ఈ ఏడాదికి 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో బాహుబలి 1, 2 చిత్రాలను కలిపి 'బాహుబలి: ది ఎపిక్' పేరుతో ఒకే భాగంలో తీసుకురానుండడంతో అందరిలో ఆసక్తి నెలకొంది. దీనికి తోడు ముఖ్యంగా ఈ సినిమాలో ఏ సన్నివేశాలను కట్ చేస్తారు? అని అందరూ ఆసక్తికరంగా ఎదురు చూస్తూ ఉండగా.. తాజాగా ఒక హాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. రాజమౌళి ఈ సినిమాకు సంబంధించిన కొన్ని విషయాలను పంచుకున్నారు. ఈ విషయాలు విన్న అభిమానులు ఎంత పని చేశావు జక్కన్న అంటూ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.
రాజమౌళి మాట్లాడుతూ.." బాహుబలి: ది ఎపిక్ సినిమా రిలీజ్ విషయంలో అన్నిటికంటే కష్టమైన పని ఎడిటింగ్ మాత్రమే. రెండు కలిపి దాదాపు 5 గంటల 27 నిమిషాల రన్ టైం తో లాక్ చేసాము. ముఖ్యంగా వీటిని కట్ చేసి ఒక భాగంగా విడుదల చేయాలి కాబట్టి ఏ సన్నివేశాలు ఉంచాలి? వేటిని తీసేయాలి అనే విషయంపై ఎంతో తీవ్రంగా చర్చించుకున్నాము. ఈ సినిమాలోని ప్రతి సన్నివేశం, పాట విలువైనదే. దేనిని తీసేయాలో అర్థం కాలేదు. కానీ తప్పని పరిస్థితుల్లో తీసేయాలి కాబట్టి కట్ చేయక తప్పలేదు. అందుకే "కన్నా నిదురించరా" అనే పాటను కట్ చేసాము. దీంతో పాటు ప్రభాస్ - తమన్నా మధ్య వచ్చే రొమాంటిక్ సన్నివేశాలను కూడా కట్ చేయాల్సి వచ్చింది. బాహుబలి: ది ఎపిక్ తో ప్రేక్షకులకు ఒక కొత్త అనుభవాన్ని ఇవ్వాలని చూస్తున్నాము" అంటూ రాజమౌళి చెప్పుకొచ్చారు. ఏది ఏమైనా ఈ రెండు చిత్రాలలోని కీలక సన్నివేశాలను తొలగించడంతో అభిమానులు ఆ పాటే అందరికీ నచ్చింది అలాంటిది ఆ పాట తీసేయడమేంటి అని కామెంట్లు చేస్తున్నారు.
బాహుబలి రిలీజ్ విషయానికి వస్తే.. అక్టోబర్ 31వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కాబోతోంది. ఇకపోతే ఈ సినిమా నిడివి విషయంలో ఎన్నో వార్తలు వస్తున్నా చిత్ర బృందం మాత్రం అధికారికంగా స్పందించలేదు. అటు రాజమౌళికి తప్ప మరొకరికి ఈ సినిమా ఎన్ని గంటలు అనే విషయం తెలియదని రానా కూడా చెప్పుకొచ్చారు.మరి ఈ సినిమా ఎంత నిడివితో ప్రేక్షకుల ముందుకు వస్తుందో చూడాలి. ఇటీవల బాహుబలి: ది ఎపిక్ నుండి విడుదల చేసిన టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది అని చెప్పవచ్చు.
