Begin typing your search above and press return to search.

బాహుబలి యానిమేషన్ మూవీ.. అప్పుడే ఇంటర్నేషనల్ లెవెల్ లో..

భారతీయ సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పిన బాహుబలి ఫ్రాంచైజీ మరోసారి వార్తల్లో నిలిచింది.

By:  M Prashanth   |   15 April 2026 12:29 PM IST
బాహుబలి యానిమేషన్ మూవీ.. అప్పుడే ఇంటర్నేషనల్ లెవెల్ లో..
X

భారతీయ సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పిన బాహుబలి ఫ్రాంచైజీ మరోసారి వార్తల్లో నిలిచింది. దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఆ మూవీల తర్వాత, ఇప్పుడు అదే కథా ప్రపంచాన్ని యానిమేషన్ రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. బాహుబలి: ది ఎటర్నల్ వార్ పేరుతో రూపొందుతున్న ఆ యానిమేషన్ చిత్రం అప్పుడే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతూ సంచలనం సృష్టిస్తోంది.

వరల్డ్ ఫేమస్ యానిమేషన్ వేడుకల్లో ఒకటైన ఎన్నెసీ ఇంటర్నేషనల్ యానిమేషన్ ఫిల్మ్ ఫెస్టివల్ కు ఎంపిక కావడం విశేషం. యానిమేషన్ రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే ఆ ఫెస్టివల్‌ లో స్థానం దక్కడం భారతీయ యానిమేషన్ సినిమాలకు గర్వకారణంగా నిలుస్తోంది. ఇప్పటి వరకు హాలీవుడ్, యూరోప్ దేశాల సినిమాలే ఎక్కువగా ప్రాధాన్యం పొందిన ఆ వేదికపై, బాహుబలి యానిమేషన్ చిత్రం చోటు దక్కించుకోవడం విశేషం.

బాహుబలి సిరీస్‌ చిత్రాలు.. భారతీయ సినిమాకు కొత్త దిశ చూపించాయని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు. లైవ్ యాక్షన్ సినిమాల రూపంలో ఇప్పటికే భారీ విజయాలు సాధించిన ఆ కథ.. ఇప్పుడు యానిమేషన్ రూపంలో మరింత విస్తరించనుంది. బాహుబలి: ది ఎటర్నల్ వార్ ద్వారా మాహిష్మతి సామ్రాజ్యానికి చెందిన కొత్త కథలు, పాత్రలు, యుద్ధ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉండనున్నాయని టాక్ వినిపిస్తోంది.

ఆ యానిమేషన్ చిత్రానికి ప్రముఖ దర్శకుడు ఇషాన్ శుక్ల దర్శకత్వం వహిస్తున్నారు. ఆయన గతంలో రూపొందించిన యానిమేషన్ ప్రాజెక్టులు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన నేపథ్యంలో.. బాహుబలి యానిమేషన్ చిత్రంపై కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. హై టెక్నికల్ వాల్యూస్ తో ఆ సినిమాను తెరకెక్కించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు సమాచారం.

ఇక నిర్మాణ బాధ్యతలు ఆర్కా మీడియా వర్క్స్ సంస్థతో పాటు రాజమౌళి టీమ్ నిర్వహిస్తోంది. బాహుబలి సిరీస్‌ ను నిర్మించిన అదే సంస్థ.. యానిమేషన్ రూపంలో కూడా అదే స్థాయి క్వాలిటీని అందించేందుకు కృషి చేస్తోంది. భారీ బడ్జెట్, మోడ్రన్ టెక్నాలజీతో చిత్రాన్ని రూపొందిస్తున్నారు. మొత్తానికి ఫేమస్ ఫిల్మ్ ఫెస్టివల్ కు ఎంపికవ్వడంతో భారతీయ యానిమేషన్ రంగానికి అంతర్జాతీయ వేదికపై మరింత గుర్తింపు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇప్పటివరకు బాలీవుడ్, టాలీవుడ్ లైవ్ యాక్షన్ సినిమాలు మాత్రమే ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందగా, ఇప్పుడు యానిమేషన్ రంగం కూడా అదే దిశగా అడుగులు వేస్తోంది. మొత్తానికి బాహుబలి: ది ఎటర్నల్ వార్ కేవలం ఒక యానిమేషన్ సినిమా మాత్రమే కాదు, భారతీయ కథలు ప్రపంచానికి పరిచయం చేసే మరో గొప్ప ప్రయత్నంగా నిలుస్తోంది. మరి ఆ చిత్రం ఫెస్టివల్‌ లో ఎలా మెప్పిస్తుందో, ఎలాంటి అవార్డులు సాధిస్తుందో అన్నది ఆసక్తికరంగా మారింది.