బాహుబలి ఎపిక్ టెన్షన్ లో న్యూ ట్విస్ట్!
థియేటర్లలోనే కాకుండా, ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌లలోనూ పెద్ద స్థాయిలో వ్యూస్ అందుకుంది. ఇప్పుడు ఆ కథ మళ్లీ తెరపైకి వస్తోంది.
By: M Prashanth | 6 Oct 2025 4:03 PM ISTభారత సినీ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా “బాహుబలి”. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, అనుష్క, రానా, రమ్యకృష్ణన్ వంటి తారాగణం నటించిన ఈ పాన్ ఇండియా సినిమా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. థియేటర్లలోనే కాకుండా, ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌లలోనూ పెద్ద స్థాయిలో వ్యూస్ అందుకుంది. ఇప్పుడు ఆ కథ మళ్లీ తెరపైకి వస్తోంది.
“బాహుబలి: ది ఎపిక్” రూపంలో రెండు భాగాలను కలిపి చూపించనున్నారు. కానీ రిలీజ్ కంటే ముందే ఈ రీ రిలీజ్‌కి కొత్త టెన్షన్ వచ్చేసింది. ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌లో ఉన్న రెండు బాహుబలి భాగాలు ఒక్కసారిగా కనిపించకపోవడంతో ఫ్యాన్స్‌లో చర్చ మొదలైంది. ఎవరైనా సెర్చ్ చేస్తే “ఈ సినిమా ప్రస్తుతం మీ దేశంలో అందుబాటులో లేదు” అని మెసేజ్ వస్తోంది. దీంతో అభిమానులు గందరగోళానికి గురయ్యారు.
కొందరు ఇది పబ్లిసిటీ ట్రిక్ అయి ఉంటుందని అంటుండగా, మరికొందరు స్ట్రీమింగ్ హక్కుల గడువు ముగిసిందని అంచనా వేస్తున్నారు. కానీ ఇంతలో ఈ న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వడంతో “బాహుబలి ఎపిక్” పై దృష్టి మళ్లీ పెరిగింది. గత కొంతకాలంగా రీ రిలీజ్ సినిమాల బజ్ తగ్గిపోతోంది. ముందెప్పుడు రీ రిలీజ్ అన్నా థియేటర్లలో జనం తాకిడి ఉండేది. కానీ ఇప్పుడు అలా లేదు.
ఇటీవల రీ రిలీజ్ అయిన పలు సినిమాలు మొదటి రోజు తర్వాత లైమ్‌లైట్‌లో నుంచి అదృశ్యమయ్యాయి. అదే పరిస్థితి “బాహుబలి”కి కూడా ఉండవచ్చు. రీ రిలీజ్ అనౌన్స్ అయినప్పటికీ పెద్దగా హైప్ కనిపించలేదు. అటువంటి సమయంలో ఓటీటీ నుంచి సినిమా మాయమవ్వడంతో ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారింది. ఇది మేకర్స్ పబ్లిసిటీ ప్లాన్ అయి ఉంటుందేమో అని ఇండస్ట్రీ టాక్.
కొంతమంది ట్రేడ్ అనలిస్టులు చెబుతున్నట్టు, “ఓటీటీ నుంచి తాత్కాలికంగా సినిమా తీసేయడం ద్వారా థియేటర్ క్రేజ్ పెరగవచ్చని మేకర్స్ ఆలోచించి ఉండొచ్చు.” ఎందుకంటే నెట్‌ఫ్లిక్స్‌లో ఉన్నంతకాలం జనం తిరిగి థియేటర్‌లో చూసే ఆసక్తి తక్కువగా ఉంటుంది. ఇప్పుడు మాత్రం అందరూ “ఏమైనా కొత్తగా జత చేసిన సీన్స్ ఉన్నాయా?” అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
నిజంగా కొన్ని ఎడిట్ లో లేపేసిన సీన్స్ ఎపిక్ లో జత చేస్తే అది మంచి బజ్ క్రియేట్ చేసే అవకాశం ఉంది. అయితే అదే పాత కట్‌ను రెండు భాగాలను కలిపి విడుదల చేస్తే మాత్రం పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చు. ఫ్యాన్స్ ఇప్పటికే అన్ని సీన్స్ అనేకసార్లు చూశారు. కాబట్టి కొత్తగా ఏదైనా అప్‌డేట్ లేదా విజువల్ ఇంప్రూవ్‌మెంట్ చూపించాలి. రీ రిలీజ్ అంటే కేవలం మళ్లీ చూడడం కాదు, కొత్త అనుభూతి ఇవ్వడమే ప్రేక్షకుల అంచనా. అది అందించగలిగితేనే “బాహుబలి: ది ఎపిక్” మళ్లీ విజయవంతమవుతుంది. ఏది ఏమైనా, ఈ ఓటీటీ ట్విస్ట్ వల్ల సినిమా చుట్టూ మరోసారి చర్చ మొదలైంది. అక్టోబర్ 31న థియేటర్లలో గ్రాండ్ రీ రిలీజ్ గా బాహుబలి ఎపిక్ రాబోతోంది. మరి ఇండియన్ సినిమా రికార్డ్ లను తిరగరాసిన ఈ మూవీ రీ రిలీజ్ లో సెన్సేషన్ ఆవుతుందో లేదో చూడాలి.
