జక్కన్న పెట్టిన బార్.. అదే సమస్యా?
బాహుబలి పేరుతో ఏదైనా కొత్తగా వస్తుందంటే అంచనాలు కూడా అదే స్థాయిలో ఉంటాయి.
By: M Prashanth | 26 Aug 2026 10:00 PM ISTబాహుబలి పేరుతో ఏదైనా కొత్తగా వస్తుందంటే అంచనాలు కూడా అదే స్థాయిలో ఉంటాయి. మహిష్మతి, శివగామి, భారీ సెట్స్ అనే మాటలు వినగానే ప్రేక్షకుడికి ముందుగా రాజమౌళి తీసిన రెండు సినిమాలే గుర్తొస్తాయి. బాహుబలి, బిఫోర్ ది బిగినింగ్ సిరీస్ ఇన్నేళ్లుగా బయటకు రాకపోవడానికి కూడా ఈ అంచనాలే ఒక కారణంగా మారాయా అనిపిస్తోంది. ఎందుకంటే నెట్‌ఫ్లిక్స్ ఈ ప్రాజెక్ట్ విషయంలో ఒకసారి సర్దుకుపోయి రిలీజ్ చేసే ప్రయత్నం చేయలేదు.
2018లోనే శివగామి గతంతో ఈ సిరీస్‌ను ప్రకటించారు. దేవ కట్టా, ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో మృణాల్ ఠాకూర్‌తో షూటింగ్ కూడా జరిగింది. కానీ ఆ వెర్షన్ అనుకున్నట్లు రాకపోవడంతో కొత్తగా చేయాలని నిర్ణయించారు. 2020లో నెట్‌ఫ్లిక్స్ కూడా బాహుబలి ప్రపంచానికి తగ్గ స్థాయి, రూపం తీసుకురావాలనే ఉద్దేశంతో కథను మళ్లీ కొత్తగా చూస్తున్నామని అధికారికంగా తెలిపింది. అంటే బాహుబలి అనే పేరు పెట్టి ఏదో ఒక వెర్షన్ రిలీజ్ చేయాలనే తొందర అప్పుడే కనిపించలేదు.
ఆ తర్వాత మృణాల్ స్థానంలో వామికా గబ్బి వచ్చింది. దర్శకులు, క్రియేటివ్ టీమ్‌లో కూడా మార్పులు జరిగాయి. మరో వెర్షన్‌పై పని చేసినా అది కూడా చివరకు బయటకు రాలేదు. నటుడు బిజయ్ ఆనంద్ గతంలో మాట్లాడుతూ ప్రాజెక్ట్‌ను రెండుసార్లు షూట్ చేసినా నెట్‌ఫ్లిక్స్ రిలీజ్ చేయలేదని చెప్పాడు. వామికా కూడా తాను కత్తిసాము కోసం చాలాకాలం ట్రైనింగ్ తీసుకున్నానని, మధ్యలో దర్శకులు మారుతూనే ఉన్నారని చెప్పింది.
ఇక్కడే అసలు చిక్కు కనిపిస్తోంది. రాజమౌళి బాహుబలితో ఒక ప్రపంచాన్ని మాత్రమే సృష్టించలేదు. ఆ ప్రపంచం ఎలా కనిపించాలి, పాత్రలకు ఎంత బలం ఉండాలి, యుద్ధాలు ఎంత పెద్దగా ఉండాలి అనే ఒక స్థాయిని కూడా ఫిక్స్ చేశాడు. అదే పేరుతో సిరీస్ తీసుకొచ్చి విజువల్స్ లేదా కథనం చిన్నగా అనిపిస్తే మొదటి నుంచే తేడా కనిపిస్తుంది. బహుశా అందుకే నెట్‌ఫ్లిక్స్ కూడా ఒక వెర్షన్‌తో కాంప్రమైజ్ కాకుండా మళ్లీ మళ్లీ మార్చడానికి వెళ్లిందేమో.
అయితే ప్రతి బాహుబలి కథను రాజమౌళే డైరెక్ట్ చేయాలని కూడా చెప్పలేం. ఆయన సృష్టించిన ప్రపంచంలో కొత్త దర్శకులు కొత్త కథలు చెప్పే అవకాశం ఉండాలి. సమస్య ఏంటంటే.. రాజమౌళి పెట్టిన బార్‌ను అందుకోవాలనే ప్రయత్నంలోనే ఏళ్ల తరబడి ప్రాజెక్ట్ మారుతూ వస్తే చివరకు కథ కంటే మేకింగ్ పెద్ద సమస్య అవుతుంది. బాహుబలి పేరు ఒక ప్లస్ అయినా, అదే పేరు ఇక్కడ భారీ బాధ్యతగా కూడా మారింది.
అందుకే బాహుబలి, బిఫోర్ ది బిగినింగ్ కథలో రూ.కోట్ల ఖర్చు కంటే ఈ పాయింటే పెద్దది. నెట్‌ఫ్లిక్స్ ఏదో ఒకటి పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు పెట్టొచ్చు. కానీ బాహుబలి పేరుకు తగ్గట్లు లేదనే భావన వస్తే ఆ బ్రాండ్‌కే దెబ్బ పడుతుంది. అందుకే ఇంతకాలం కాంప్రమైజ్ కాకుండా ఆపేశారా అనిపిస్తోంది. అయితే జక్కన్న స్థాయిని అందుకోవాలనే ప్రయత్నంలో అతిగా ఆలోచించినా కష్టమే. అలాగని ఏదో ఒకటి తీసినా నష్టమే. చివరికి ఫైనల్ అవుట్ పుట్ సిద్ధం చేసి జక్కన్నతో గ్రీన్ సిగ్నల్ దగ్గర తీసుకుంటే బెటర్.
