బాహుబలి 3పై సస్పెన్స్ కంటిన్యూ.. రాజమౌళి ప్లాన్ ఏంటి?
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ ను ప్రపంచ స్థాయిలో నిలబెట్టిన 'బాహుబలి' ఫ్రాంచైజీకి మూడో భాగం ఉందంటూ గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.
By: Madhu Reddy | 24 Sept 2026 8:00 PM ISTఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ ను ప్రపంచ స్థాయిలో నిలబెట్టిన 'బాహుబలి' ఫ్రాంచైజీకి మూడో భాగం ఉందంటూ గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ప్రొడ్యూసర్ శోభు యార్లగడ్డను 'బాహుబలి 3' గురించి ఎప్పుడు అడిగినా "చూద్దాం" అని సమాధానం ఇస్తున్నారే తప్ప, అస్సలు నో అని చెప్పడం లేదు. దీంతో సినీ ప్రియుల్లో ఈ ప్రాజెక్ట్‌పై సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది. అసలు దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి మైండ్‌లో ఏం ప్లాన్ ఉందనే అంశంపై టాలీవుడ్‌లో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.ఆ వివరాలు చూద్దాం..
బాహుబలి 3 ప్రాజెక్ట్ సాధ్యమేనా? :
ప్రస్తుతం రాజమౌళి ప్రాజెక్ట్ 'వారణాసి' రిలీజ్ కావడానికే మరో ఏడెనిమిది నెలల సమయం పట్టేలా ఉంది. ఆ తర్వాత ఒకవేళ బాహుబలి 3 చేయాలనుకున్నా, దానికి సంబంధించిన పూర్తి స్థాయి స్క్రిప్ట్ సిద్ధం చేయడానికి జక్కన్నకు కనీసం రెండేళ్లకు పైగానే టైమ్ పడుతుంది. ఇక ఈ లెక్కన చూస్తే సమీప భవిష్యత్తులో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లడం కాస్త కష్టమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఫిజికల్ స్ట్రగుల్ తీసుకోగలరా? :
బాహుబలి ప్రపంచవ్యాప్తంగా అంత పెద్ద ఫినామినన్ అవ్వడానికి ప్రధాన కారణం అందులోని ఎమోషనల్ హై మరియు భారీ వార్ డ్రామా. అప్పట్లో ప్రబాస్, రానాలు ఆ పాత్రల కోసం పడిన కష్టం, శారీరక శ్రమ మాటల్లో చెప్పలేనిది. అయితే పదేళ్ల క్రితం నాటి ఫిజికల్ స్ట్రగుల్‌ను ఇప్పుడు లేదా మరో మూడేళ్ల తర్వాత ప్రభాస్, రానాలు మళ్లీ తీసుకోగలరా? అనే సందేహాలు అభిమానుల్లో వ్యక్తమవుతున్నాయి.
కాస్ట్ మారితే ప్రేక్షకులు ఒప్పుకుంటారా?:
ఒకవేళ ప్రభాస్, రానా కాకుండా వేరే హీరోలతో బాహుబలి 3 లేదా ఆ కథను ముందుకు తీసుకెళ్తే ప్రేక్షకులు ఆదరిస్తారా అనేది మరో పెద్ద ప్రశ్న. బాహుబలిగా ప్రభాస్, భల్లాలదేవుడిగా రానా ఇమేజ్ జనాల్లో బలంగా ముద్రపడిపోయింది. వారిని కాదని వేరే నటీనటులను ఆ పాత్రల్లో ఊహించుకోవడం అభిమానులకు చాలా కష్టమైన విషయమేనని చెప్పవచ్చు.
ఏదైనా కొత్త యూనివర్స్ ప్లాన్ చేస్తారా?:
ఒకవేళ సీక్వెల్ కాకుండా 'RRR' మూవీ తరహాలో ఇద్దరు పెద్ద హీరోలను ఒకే స్క్రీన్ పైకి తెచ్చి, బాహుబలి వరల్డ్ ఆధారంగా ఒక కొత్త యూనివర్స్ క్రియేట్ చేస్తారా అనే టాక్ కూడా వినిపిస్తోంది. ఇక కథలో సరికొత్త మ్యాజిక్ చేసి, పాత పాత్రలతో పాటు కొత్త పాత్రలను కలిపి రాజమౌళి ఒక భారీ మల్టీస్టారర్ సర్ ప్రైజ్ ఇచ్చిన ఆశ్చర్యపోనక్కర్లేదు.
ఇక 'వారణాసి' సినిమా థియేటర్లలోకి వచ్చి ముగిసే వరకు ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మోడ్ కొనసాగక తప్పదు. రాజమౌళి లేదా ఆర్కా మీడియా టీమ్ నుంచి ఏదైనా అధికారిక ప్రకటన వస్తేనే కానీ బాహుబలి 3 పై అసలు నిజాలు బయటకు రావు. అంతవరకు జక్కన్న ప్లాన్ ఏంటో వేచి చూడాల్సిందే...
