భాఘి 4: క్రూరత్వం రక్తపాతం మాకొద్దు బాబోయ్
టాలీవుడ్ బ్లాక్ బస్టర్ `వర్షం` చిత్రాన్ని `భాఘి` పేరుతో బాలీవుడ్ లో రీమేక్ చేసాడు టైగర్ ష్రాఫ్.
By: Sivaji Kontham | 11 Aug 2025 2:00 AM ISTటాలీవుడ్ బ్లాక్ బస్టర్ `వర్షం` చిత్రాన్ని `భాఘి` పేరుతో బాలీవుడ్ లో రీమేక్ చేసాడు టైగర్ ష్రాఫ్. అక్కడ ప్రభాస్ పాత్రలో టైగర్ ష్రాఫ్ నటించగా, గోపిచంద్ (విలనీ) పాత్రలో టాలీవుడ్ నటుడు సుధీర్ బాబు నటించారు. టైగర్ వర్సెస్ సుధీర్ బాబు విరోచిత పోరాటాలు థియేటర్లలో గగుర్పాటుకు గురి చేసాయి. విలన్ పాత్రలో సుధీర్ బాబు నటనకు మంచి పేరొచ్చింది. నిజానికి సుధీర్ బాబు హిందీ చిత్రసీమలో విలన్ గా పాపులరయ్యేందుకు ఛాన్స్ ఉన్నా టాలీవుడ్ లో హీరోగా వెలుగుతున్నందున అక్కడ అవకాశాల్ని వదులుకున్నాడు.
అదంతా అటుంచితే భాఘి ఫ్రాంఛైజీలో ఇప్పటికే విడుదలైన మూడు సినిమాల్లో మొదటి భాగం మాత్రమే టైగర్ కి సంతృప్తికరమైన ఫలితాన్ని ఇచ్చింది. భాఘి 2 అంతంత మాత్రంగానే ఆడింది. `భాఘి 3` కూడా బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచిందని కథనాలొచ్చాయి. అయినా ఇప్పుడు ఈ ఫ్రాంఛైజీలో నాలుగో సినిమాతో టైగర్ తిరిగి బరిలో దిగుతున్నాడు. తాజాగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్‌సి) బాఘి 4 టీజర్‌ను `ఎ` రేటింగ్‌తో క్లియర్ చేసింది. 1 నిమిషం 53 సెకన్ల టీజర్ ఆగస్టు 11న విడుదలకు సిద్ధంగా ఉందని మేకర్స్ వెల్లడించారు.
అయితే రాబోతున్న టీజర్ గురించే ఆందోళన నెలకొంది. ఈ సినిమాలో రక్తపాతం శ్రుతిమించబోతోందని ఇప్పటికే ప్రీపోస్టర్ చెబుతోంది. హిందీ చిత్రసీమలో మునుపెన్నడూ చూడని రక్తపాతం, భయానకమైన యాక్షన్ ని చూపించబోతున్నారు. ఇక హీరో పాత్రలో క్రూరత్వాన్ని కూడా ప్రదర్శించబోతున్నారని అర్థమవుతోంది. అయితే ఈ సినిమాని కన్నడ దర్శకుడు హర్ష ఒక సౌత్ ఫార్ములాటిక్ వెంచర్ గా రూపొందించాడని అంచనాలు వేస్తున్నారు. టైగర్ ష్రాఫ్ వర్సెస్ సంజయ్ దత్ పోరాటాలు క్రూరత్వంతో రక్తపాతాన్ని సృష్టిస్తాయని భావిస్తున్నారు. అయితే ఈ క్రూరమైన సినిమాలో డెబ్యూ నటి మిస్ యూనివర్స్ 2021 హర్నాజ్ సంధు అందచందాలు కనువిందు చేయడం థియేటర్లలో కొంతవరకూ రిలీఫ్. హౌస్‌ఫుల్ 5 తర్వాత ప్రతిభావంతులైన సోనమ్ బజ్వా ఈ సినిమాలో నటిస్తోంది. ఫ్రాంఛైజీలో నాలుగో సినిమా రక్తపాతంతో భయపెడుతుందని ఇంతకుముందు టైగర్ కూడా ధృవీకరించడంతో టీజర్ ముందు ఫ్యాన్స్ లో సందిగ్ధతలు నెలకొన్నాయి. కన్నడలో వచ్చిన మార్కో అదుపు తప్పిన రక్తపాతం, క్రూరత్వంతో తీవ్ర విమర్శలకు తెర తీసింది. ఇప్పుడు భాఘి 4 కూడా అదే తరహాలో ఉంటుందా? అంటూ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హీరో పాత్రలో ఎలివేషన్స్ కోసం క్రూరత్వం, రక్తపాతాన్ని ఉపయోగించుకోకూడదని కూడా అభిమానులు కోరుకుంటున్నారు. ఎలివేషన్స్ కాదు ఎమోషన్స్ ముఖ్యమని కూడా సూచిస్తున్నారు. రేపటి రోజున టీజర్ వచ్చేవరకూ వేచి చూడాల్సిందే.
