మేఘాలయలో టాలీవుడ్ క్రైమ్ కామెడీ
టాలీవుడ్‌లో రొటీన్ లొకేషన్లకు బ్రేక్ పడింది. కథ డిమాండ్ చేస్తే ఎంత దూరమైనా వెళ్తున్నారు మన మేకర్స్.
By: M Prashanth | 7 Nov 2025 10:45 PM ISTటాలీవుడ్‌లో రొటీన్ లొకేషన్లకు బ్రేక్ పడింది. కథ డిమాండ్ చేస్తే ఎంత దూరమైనా వెళ్తున్నారు మన మేకర్స్. ఇప్పుడు, చిత్రాలయం స్టూడియోస్ సరిగ్గా అదే చేస్తోంది. ప్రొడ్యూసర్ వేణు దోనేపూడి నిర్మిస్తున్న 'బా బా బ్లాక్ షీప్' అనే ట్రెండీ క్రైమ్ కామెడీ కోసం ఏకంగా నార్త్ ఈస్ట్ ఇండియాను చుట్టేస్తున్నారు. ఈ సినిమా కథ మొత్తం ఆరుగురు వ్యక్తుల చుట్టూ, కేవలం ఒక్క రోజులో జరుగుతుంది.
ఈ సినిమాకు అసలు హైలైట్ లొకేషనే. తెలుగు సినిమా చరిత్రలోనే తొలిసారిగా, ఒక సినిమాను పూర్తిగా మేఘాలయ బ్యాక్‌డ్రాప్‌లో షూట్ చేస్తున్నారు. కథ మొత్తం "గన్స్, గోల్డ్, హంట్" అనే థీమ్ చుట్టూ తిరుగుతుండటంతో, ఆ విజువల్ ఫీల్ కోసం మేకర్స్ ఈ లొకేషన్‌ను ఫిక్స్ చేశారు. అక్టోబర్‌లో మొదలైన షూటింగ్ ప్రస్తుతం మేఘాలయలో నాన్‌స్టాప్‌గా జరుగుతోంది.
షూటింగ్ చేస్తున్న లొకేషన్ తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ప్రపంచంలోనే అత్యధిక వర్షపాతం నమోదయ్యే సోహ్రా (చిరపుంజి)లో ఈ సినిమాను చిత్రీకరిస్తున్నారు. నిరంతరం వర్షం, పొగమంచు ఉండే ఈ ప్రాంతంలో, సరైన లైటింగ్ దొరకడమే కష్టం. ఇలాంటి ఛాలెంజింగ్ కండిషన్స్‌లో కూడా, బెస్ట్ విజువల్స్ ఇవ్వాలని టీమ్ మొత్తం కష్టపడుతోందని నిర్మాత తెలియజేశారు.
ఈ సినిమా ఎఫర్ట్‌కు మేఘాలయ ప్రభుత్వం నుంచి కూడా ఫుల్ సపోర్ట్ దొరికింది. ఇటీవల ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కన్రాడ్ కె సంగ్మా స్వయంగా 'బా బా బ్లాక్ షీప్' సెట్స్‌ను విజిట్ చేశారు. తమ రాష్ట్రాన్ని ఇంత అందంగా చూపిస్తున్నందుకు యూనిట్‌ను అభినందించి, పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
ఈ క్రేజీ క్రైమ్ కామెడీతో గుణి మాచికంటి అనే కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. టిన్ను ఆనంద్, 'అశోకవనంలో అర్జున కళ్యాణం' ఫేమ్ రాజా రవీంద్ర, ఉపేంద్ర లిమయే వంటి సీనియర్ యాక్టర్లతో పాటు, అక్షయ్ లఘుసాని, విష్ణు ఓయ్, విస్మయ, మాల్వి మల్హోత్రా వంటి యంగ్ బ్యాచ్ ఈ సినిమాలో కీ రోల్స్ చేస్తున్నారు.
'బా బా బ్లాక్ షీప్' ఒక రెగ్యులర్ సినిమా కాదని అర్థమవుతోంది. ఒక్క రోజులో జరిగే క్రైమ్ స్టోరీ, చిరపుంజి విజువల్స్ లో సరికొత్తగా హైలెట్ అయ్యే అవకాశం ఉంది. దానికి తోడు ప్రభుత్వ మద్దతు.. ఏదేమైనా ఈ కాంబినేషన్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. చిత్రాలయం స్టూడియోస్ ఈ డిఫరెంట్ అటెంప్ట్‌ను రికార్డ్ టైమ్‌లో పూర్తి చేసి, ఆడియన్స్‌కు ఒక కొత్త ఫీల్ ఇచ్చేలా ప్లాన్ చేస్తోంది.
