నందిని రెడ్డికి ఈసారి పుల్ బిజీ!
టాలీవుడ్ లో తనదైన ఫీల్ గుడ్ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న మహిళా దర్శకురాలు బి.వి. నందిని రెడ్డి కెరీర్ సరికొత్త మలుపు తిరిగనుంది.
By: Srikanth Kontham | 5 July 2026 4:00 AM ISTటాలీవుడ్ లో తనదైన ఫీల్ గుడ్ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న మహిళా దర్శకురాలు బి.వి. నందిని రెడ్డి కెరీర్ సరికొత్త మలుపు తిరిగనుంది. `అలా మొదలైంది` సినిమాతో టాలీవుడ్‌లోకి ఘనంగా అడుగుపెట్టి క్లాసిక్ హిట్‌ను ఖాతా లో వేసుకున్న నందిని ఆ తర్వాత వైవిధ్యమైన కథలతో ప్రేక్షకులను అలరించారు. అయితే చిత్రసీమలో విజయాలు ఎంత వేగంగా వస్తాయో? ఒడిదొడుకులు కూడా అంతే సహజంగా ఎదురవుతుంటాయి. గత కొంతకాలంగా ఆశించిన స్థాయిలో అవకాశాలు లేక సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తూ నందిని కాస్త విరామం తీసుకోవాల్సి వచ్చింది. కానీ పరిశ్రమలో ప్రతిభ ఎప్పుడూ వృథాగా పోదనే విషయాన్ని తాజా చిత్రంతో మరోసారి నిరూపించారు.
ఇటీవల నందిని రెడ్డి దర్శకత్వంలో రిలీజ్ అయిన `మా ఇంటి బంగారం` బాక్సాఫీస్ వద్ద ఘన ఎలాంటి విజయం సాధించిందో తెలిసిందే. విమర్శకుల ప్రశంసలకే పరిమితం కాకుండా కమర్షియల్‌గానూ సినిమా భారీ వసూళ్లను సాధించింది. ఒక ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను నేటి తరం ప్రేక్షకులకు నచ్చేలా.. వాణిజ్య హంగులతో ఎలా తెరకెక్కించవచ్చో? నందిని ఈ సినిమాతో మరోసారి రుజువు చేసారు. ఈ కమర్షియల్ సక్సెస్ నందినిలో క్రాఫ్ట్‌ను, సత్తాను పరిశ్రమకు మరోసారి గట్టిగా చాటిచెప్పింది.
ఈ విజయం తో నందిని రెడ్డి డైరెక్షన్ డైరీ ఫుల్ అయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. గతంలో ఆమెతో పనిచేయడానికి సంకోచించిన వారు సైతం ప్రాజెక్ట్స్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. కథాంశాల ఎంపికలోనూ, భావోద్వేగాలను పండించడంలోనూ నందినికి ఉన్న ప్రత్యేక శైలిని నిర్మాతలు నమ్ముతున్నారు. వరుస సక్సెస్‌లతో దూసుకుపోతున్న అగ్ర నిర్మాణ సంస్థలు సైతం ఆమెకు అడ్వాన్సులు ఇచ్చి లాక్ చేయడానికి లైన్ కడుతున్నట్లు ఫిలిం నగర్ టాక్. దీంతో రాబోయే రోజుల్లో నందిని బ్యాక్-టు-బ్యాక్ సినిమాలతో బిజీ కావడం ఖాయంగా చెప్పొచ్చు.
మరో ఆసక్తికర విషయం ఏంటంటే? ఈ సక్సెస్‌తో టాలీవుడ్ స్టార్ హీరోయిన్లు నందిని రెడ్డితో పనిచేసేందుకు ముందుకొచ్చే అవకాశం ఉంది. నందిని రెడ్డి తన చిత్రాలలో లేడీ క్యారెక్టర్లను బలంగా, గౌరవప్రదంగా తీర్చిది ద్దుతారనే పేరుంది. `ఓ బేబీ` వంటి చిత్రమే అందుకు నిదర్శనం. తాజాగా `మా ఇంటి బంగారం` విజయంతో లేడీ ఓరియంటెడ్ చిత్రాలకు ..మహిళా ప్రాధాన్యత ఉన్న కథలకు నందిని అయితేనే పూర్తి న్యాయం చేయగలరని స్టార్ హీరోయిన్లు భావిస్తున్నారు.
అలాగే యంగ్ హీరోలు సైతం నందిని రెడ్డి దర్శకత్వంలో నటించేందుకు ఉత్సాహం చూపిస్తున్నారుట. నేటి యువత మైండ్ సెట్‌కు తగినట్లుగా సరికొత్త లవ్ స్టోరీలను, యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్లను డీల్ చేయడంలో నందిని దిట్ట. యంగ్ హీరోలకు కెరీర్ పరంగా కమర్షియల్ ఇమేజ్ తెచ్చేందుకు ఆమె కథలు బాగా ఉపయోగపడతాయనే నమ్మకం పరిశ్రమలో ఏర్పడింది. స్టార్ ఇమేజ్ కోసం ప్రయత్నిస్తున్న పలువురు యువ హీరోలు తమకు సరిపోయే కథలను సిద్ధం చేయాల్సిందిగా కోరుతున్నట్లు తెలిసింది.
