Begin typing your search above and press return to search.

17 ఏళ్ల విరామం తర్వాత వెండితెరకు బ్లాక్ చిన్నారి!

10 ఏళ్ల వయసులోనే `బ్లాక్` సినిమాలో అద్భుతమైన నటన కనబరిచిన ఆయేషా కపూర్ 11 ఏళ్ల వయసులో ప్రతిష్టాత్మక ఫిల్మ్‌ఫేర్ అవార్డును అందుకుంది.

By:  Srikanth Kontham   |   21 Sept 2026 5:00 AM IST
17 ఏళ్ల విరామం తర్వాత వెండితెరకు బ్లాక్ చిన్నారి!
X

సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన సంచలన చిత్రం `బ్లాక్` (2005)లో చిన్ననాటి మిషెల్ పాత్రలో నటించి దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్న ఆయేషా కపూర్ గుర్తుందా? అమితాబ్ బచ్చన్, రాణి ముఖర్జీలతో కలిసి నటించిన చిన్నారి నటనతో విమర్శకుల ప్ర‌శంస‌లందుకుంది. అటుపై రెండు మూడు సినిమాలు చేసింది కానీ కొన‌సాగలేక‌పోయింది. ఈ నేప‌థ్యంలో 17 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత అయేషా మళ్లీ వెండితెరకు రీ-ఎంట్రీ ఇచ్చింది. ఇటీవల విడుదలైన `ఓమ్ కా హరి` చిత్రం ద్వారా బాలీవుడ్‌లో కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆయేషా ఈ సందర్భంగా తన సినీ ప్రయాణానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకుంది.

10 ఏళ్ల వయసులోనే `బ్లాక్` సినిమాలో అద్భుతమైన నటన కనబరిచిన ఆయేషా కపూర్ 11 ఏళ్ల వయసులో ప్రతిష్టాత్మక ఫిల్మ్‌ఫేర్ అవార్డును అందుకుంది. అటుపై 2009లో రిలీజ్ అయిన `సికందర్` చిత్రంలోనూ, ఇటీవల `స్వీట్ కారమ్ కాఫీ` అనే తమిళ వెబ్ సిరీస్‌లోనూ మెరిసింది. అయినా? బాలీవుడ్ వెండితెరపై కనిపించి చాలా ఏళ్లయింది. ఇన్ని సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ కెమెరా ముందుకు రావడం, తనకు ఇష్టమైన నటనా వృత్తిలోకి అడుగుపెట్టడం ఎంతో సంతోషాన్ని ఇస్తోందని ఆయేషా తెలిపింది.

`బ్లాక్` సినిమా విజయం తర్వాత తనపై వచ్చిన జ‌రిగిన‌ ప్రచారం, ఇండస్ట్రీ వర్గాల ఒత్తిడి తన నిర్ణయాలను ఎలా ప్రభావితం చేశాయో ఆయేషా వివరించింది. `బ్లాక్ తర్వాత నన్ను గ్రాండ్‌గా లాంచ్ చేయాలని చాలామంది అనుకున్నారు. కానీ అప్పటికి నేను చాలా చిన్నదాన్ని. లాంచ్ అంటే ఏమిటో కూడా నాకు సరిగ్గా అర్థం కాలేదు. చుట్టూ ఉన్న ప్రజల మాటలు, ఇండస్ట్రీ ప్రచారం అప్పట్లో నా నిర్ణయాలపై ప్రభావం చూపాయి. అయితే ఇప్పుడు ఆ ఒత్తిడులకు చోటు ఇవ్వకుండా నాకు నచ్చిన ప్రాజెక్ట్‌లను, ఇష్టమైన వ్యక్తులతో కలిసి పనిచేయడానికే ప్రాధాన్యత ఇస్తున్నాను` అని పేర్కొంది.

17 ఏళ్ల సుదీర్ఘ విరామం తనకు ఒక విధంగా మేలే చేసిందని ఆయేషా అభిప్రాయపడింది. `బ్లాక్` సినిమాలో చిన్నారిగా చూసిన ప్రేక్షకులు ఇప్పుడు త‌న‌ని పరిణతి చెందిన నటిగా చూడటానికి ఈ విరామం దోహదపడు తుందంది . నేటికీ ప్రజలు చిన్ననాటి పాత్రను గుర్తుంచుకోవడం ఆనందంగా ఉన్నా? ఆ చైల్డ్ ఆర్టిస్ట్ ఇమేజ్ నుండి బయటపడి నటిగా సరికొత్త గుర్తింపును సాధించడానికి ఈ రీ-ఎంట్రీ సరైన అవకాశంగా భావిస్తున్నట్లు స్పష్టం చేసింది. 17 ఏళ్ల తర్వాత కొత్త ఆలోచనలు, స్పష్టమైన లక్ష్యాలతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ఆయేషా కపూర్, తన నటనతో సెకండ్ ఇన్నింగ్స్‌లో ఎలాంటి విజయాలు అందుకుంటుందో చూడాలి.