బ్రహ్మాస్త్రలో హాలీవుడ్ ప్రభావమే మైనస్ అయిందా?
‘బ్రహ్మాస్త్ర 2’ ఆగిపోయిందన్న వార్తలను దర్శకుడు అయాన్ ముఖర్జీ ఖండించారు. సీక్వెల్ కచ్చితంగా ఉంటుందని, తొలి భాగంలో ఎదురైన లోపాలను సరిదిద్ది భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికతకు ప్రాధాన్యమిస్తూ తెరకెక్కిస్తామని తెలిపారు. తొలి భాగానికి హాలీవుడ్ చిత్రాల ప్రభావం ఎక్కువగా ఉందని, రెండో భాగంలో పాశ్చాత్య పోకడలు తగ్గిస్తామని స్పష్టం చేశారు.
By: Srikanth Kontham | 25 Nov 2026 2:02 PM ISTరణబీర్ కపూర్- అలియా భట్ జంటగా తెరకెక్కిన భారీ ఫాంటసీ చిత్రం `బ్రహ్మాస్త్ర: పార్ట్ 1 - శివ` సీక్వెల్ ఆగిపోయిందంటూ కొంతకాలంగా వినిపిస్తున్న ఊహాగానాలకు దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరదించారు. `బ్రహ్మాస్త్ర 2` ప్రాజెక్ట్ కచ్చితంగా ఉందని మరోసారి స్పష్టం చేసారు. మొదటి భాగంలో ఎదురైన మిశ్రమ స్పందనల నుంచి పాఠాలు నేర్చుకుని రెండో భాగాన్ని మరింత భారతీయత ఉట్టిపడేలా తీర్చిదిద్దాలని భావిస్తున్నట్లు తెలిపారు.
350 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మితమైన `బ్రహ్మాస్త్ర` ప్రపంచవ్యాప్తంగా 435 కోట్లకు పైగా వసూలు చేసినా? ఆశించిన స్థాయిలో ఏకపక్ష విజయాన్ని అందుకోలేకపోయింది.
దీనిపై నిజాయితీగా స్పందించిన అయాన్ మొదటి భాగం బాక్సాఫీస్ వద్ద కొంత ఒడిదుడుకులను ఎదుర్కొన్న మాట వాస్తవమేనని అంగీకరించారు. సినిమాలోని కొన్ని అంశాలను ప్రేక్షకులు బాగా ఇష్టపడ్డారని.. మరికొన్ని విషయాలు వారికి నచ్చలేదన్నారు. ప్రేక్షకులు ఎప్పుడూ సినిమాను ఓడించరని.. వారి అభిరుచిని గౌరవిస్తూ లోపాలను సరిదిద్దుకుని మరింత మెరుగైన సినిమా ఇవ్వడమే తమ బాధ్యత అన్నారు. మొదటి భాగం రాసేటప్పుడు తన ఆలోచనలపై `హ్యారీ పోటర్`, `ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్` వంటి హాలీవుడ్ చిత్రాల ప్రభావం ఎక్కువగా ఉండేదని ఆయాన్ వెల్లడించారు.
ఆ తర్వాత క్రమంగా భారతీయ ఆధ్యాత్మికత వైపు ప్రయాణం సాగడం వల్లే సినిమా టైటిల్‌ను `డ్రాగన్` నుంచి `బ్రహ్మాస్త్ర`గా మార్చామని గుర్తుచేసుకున్నారు. అందుకే `బ్రహ్మాస్త్ర 2`లో పాశ్చాత్య పోకడలను తగ్గించి పూర్తిగా మన నేల.. సంస్కృతి ప్రతిబింబించేలా ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్లు తెలిపారు. అప్పట్లో మూడు భాగాలను ఒకేసారి ఎందుకు చిత్రీకరించలేదన్న ప్రశ్నకు బధులిచ్చారు. తమ వద్ద అంత భారీ బడ్జెట్ లేదని అయాన్ స్పష్టం చేశారు. మొదటి భాగం ఫలితం చూసిన తర్వాతే రెండో అడుగు వేయగల పరిస్థితి అప్పట్లో ఉండేదన్నారు.
మొదటి భాగంలో రణబీర్, అలియాలతో పాటు మౌని రాయ్, అమితాబ్ బచ్చన్ కీలక పాత్రల్లో నటించగా, షారుఖ్ ఖాన్, నాగార్జున ప్రత్యేక పాత్రల్లో మెరిసిన సంగతి తెలిసిందే. మరి రెండవ భాగంలో కొత్త నటులు ఎవరెవరు యాడ్ అవుతారు? ప్రాజెక్ట్ ఎప్పుడు పట్టాలెక్కిస్తారు? టెక్నికల్ గా ఎలాంటి మార్పులుంటాయి? అన్నది చూడాలి.
