హిట్ మూవీ సీక్వెల్... అప్పుడే అసంతృప్తి!
అవరపన్ 2 సినిమాకు నితిన్ కక్కర్ దర్శకత్వం వహించబోతున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చింది. దర్శకుడి ఎంపిక విషయమై విమర్శలు వస్తున్నాయి.
By: Ramesh Palla | 10 Sept 2025 2:00 PM ISTఇమ్రాన్ హష్మీ హీరోగా శ్రియా సరన్ హీరోయిన్‌గా మృణాళిని శర్మ, అశుతోష్ రానా ముఖ్య పాత్రల్లో నటించిన 'అవరపన్' సినిమా 2007లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాన్ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత శాటిలైట్ ఛానల్స్‌లో టెలికాస్ట్ అయిన సమయంలో, ఓటీటీలో స్ట్రీమింగ్ అయిన సమయంలో ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఇప్పటికీ అవరపన్ సినిమా గురించి ప్రేక్షకులు మాట్లాడుకుంటూ ఉంటారు. దాదాపుగా 18 ఏళ్లు అయినా ఈ సినిమా గురించి మాట్లాడుకుంటున్న నేపథ్యంలో మేకర్స్ సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేశారు. ఇమ్రాన్ హష్మీ ప్రధాన పాత్రలో తాజాగా అవరపన్ 2 ను ప్రకటించడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
మోహిత్ సూరి దర్శకత్వంలో అవరపన్ మూవీ
అవరపన్ 2 సినిమాకు నితిన్ కక్కర్ దర్శకత్వం వహించబోతున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చింది. దర్శకుడి ఎంపిక విషయమై విమర్శలు వస్తున్నాయి. మొదటి పార్ట్ కి దర్శకత్వం వహించిన మోహిత్ సూరి ఈ సెకండ్ పార్ట్ కి దర్శకత్వం వహిస్తే బాగుంటుంది అనే అభిప్రాయంను చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. మోహిత్ సూరి దర్శకత్వంలో ఇటీవల వచ్చిన సయ్యారా సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. వందల కోట్ల వసూళ్లు రాబట్టిన సయ్యార సినిమాను రూపొందించిన దర్శకుడు మోహిత్ సూరి అవరపన్ 2 సినిమాకు దర్శకత్వం వహిస్తే మరింత బాగుంటుంది అనే అభిప్రాయంను బాలీవుడ్ ప్రేక్షకులు వ్యక్తం చేస్తున్నారు. కానీ మోహిత్ సూరి ప్రస్తుత పరిస్థితుల్లో అవరపన్ 2 కి దర్శకత్వం వహించే పరిస్థితి లేని కారణంగా నితిన్ కక్కర్‌కి ఆ బాధ్యతలు అప్పగించారని తెలుస్తోంది.
ఇమ్రాన్ హష్మీకి జోడీగా శ్రియా సరన్
2007లో వచ్చిన అవరపన్ సినిమాలో ఇమ్రాన్ హష్మీకి జోడీగా శ్రియా సరన్ హీరోయిన్‌గా నటించింది. ఆ సమయంలో శ్రియ టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లో మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్, ఆ సమయంలో మంచి పాత్రలకు ఆమె మోస్ట్ వాంటెడ్ అనడంలో సందేహం లేదు. సినిమాకు ఆమె ఎంపిక కచ్చితంగా ప్లస్ అయింది. అలాంటి హీరోయిన్ పాత్రను ఈ సినిమాలో దిశా పటానీతో చేయించడం వల్ల నష్టం తప్పదు అంటూ చాలా మంది వాదిస్తున్నారు. ప్రస్తుతం దిశా పటానీ క్రేజ్ విషయంలో చాలా మందికి అనుమానాలు ఉన్నాయి. ఆమె స్టార్‌డం సినిమాకు ఉపయోగపడటం పక్కన పెట్టి, ఆమె వల్ల సినిమాకు డ్యామేజీ జరుగుతుందేమో అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్న వారు చాలా మంది ఉన్నారు. అందుకే ఈ సీక్వెల్‌లో దిశా పటానీ ఎంపిక ను తప్పుబడుతున్నారు.
దిశా పటానీ హీరోయిన్‌గా అవరపన్ 2
విభిన్నమైన కథ, కథనంతో వచ్చిన అవరాపన్ సినిమా విషయంలో ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీ వర్గాల వారు అంతా చాలా నమ్మకంగా ఉన్నారు. ఇలాంటి సమయంలో కథ, కథనంతో పాటు హీరోయిన్ పాత్ర విషయంలోనూ చాలా జాగ్రత్త అవసరం. ఇమ్రాన్ హష్మీ కి జోడీగా దిశా పటానీ ఎంపిక ఎంత వరకు కరెక్ట్ అంటూ చాలా మంది ఇప్పటికే చిత్ర యూనిట్ సభ్యులను ప్రశ్నిస్తున్నారు. అధికారికంగా ఇప్పటి వరకు హీరోయిన్‌ను ప్రకటించలేదు. కనుక ముందు ముందు ఏమైనా మార్పులు ఉంటాయేమో అనే అభిప్రాయంను కొందరు వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఇప్పటికే ఈ సినిమా గురించి ప్రముఖంగా చర్చ జరుగుతోంది. హీరోయిన్, దర్శకుడు మార్పు అనేది సినిమాకు ప్లస్ కావాలే కానీ, ఈ సినిమాకు మాత్రం చాలా పెద్ద మైనస్ అంటూ ప్రేక్షకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
