Begin typing your search above and press return to search.

సినిమా తీసి నష్టపోయిన దానికంటే హీరో కుటుంబం పొడిచిన పోట్లకే!

టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దివంగత ప్రముఖ కమెడియన్ కం దర్శకుడు ఆరోజుల్లో సినిమాలతో ఎంతో ఆర్జించారు.

By:  Sivaji Kontham   |   24 Sept 2026 2:00 PM IST
సినిమా తీసి నష్టపోయిన దానికంటే హీరో కుటుంబం పొడిచిన పోట్లకే!
X

టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దివంగత ప్రముఖ కమెడియన్ కం దర్శకుడు ఆరోజుల్లో సినిమాలతో ఎంతో ఆర్జించారు. రోజుకు 2ల‌క్ష‌లు పైగా పారితోషికం ఆర్జించి బ్ర‌హ్మానందం, ధ‌ర్మ‌వ‌రం వంటి వారితో పోటీప‌డిన‌ మేటి క‌మెడియ‌న్ ఆయ‌న‌. అయితే దర్శకత్వం వైపు అడుగులు వేసి కొన్ని చిత్రాలను నిర్మించడంతో ఆయన జీవితం అనూహ్యమైన మలుపు తిరిగింది. కేవలం రెండు సినిమాలు ఆయన ఆర్థిక సామ్రాజ్యాన్ని కొంత దెబ్బతీశాయి.

ప్రముఖ యువహీరోతో స్వీయ‌ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం భారీ అంచనాల మధ్య విడుదలై తీవ్ర నష్టాలను మిగిల్చింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలవడంతో స‌ద‌రు కమెడియన్ కం ద‌ర్శ‌కుడు చాలా కోల్పోవాల్సి వచ్చింది. అయితే, డబ్బు పోయిన బాధ కంటే ఆ సినిమా ఫ్లాప్ అయిన తర్వాత సదరు హీరో కుటుంబం నుంచి వచ్చిన కొన్ని మాటలు, ప్రకటనలే తన తండ్రిని అత్యంత తీవ్రంగా కలచివేశాయని ఆయన కుమార్తె ఇటీవల ఒక ఇంటర్వ్యూలో భావోద్వేగంతో వెల్లడించారు.

తాను నమ్మిన కథపై పూర్తి విశ్వాసంతో ఎలాంటి రాజీ పడకుండా ముందుకు వెళ్లడం త తండ్రి నైజం అని చెప్పారు. కానీ ద‌ర్శ‌క‌నిర్మాత‌గా తెర‌కెక్కించిన రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడటంతో ఆయన సంపాధన ఆవిరైపోయింది. వరుస నష్టాలు, ఆర్థిక ఇబ్బందులు ఆయనను మానసికంగా పూర్తిగా కుంగదీశాయి. సరిగ్గా ఇదే క్లిష్ట సమయంలోనే ఆయనకు లివర్ సంబంధిత ఆరోగ్య సమస్యలు కూడా ప్రారంభం కావడం కుటుంబానికి పెద్ద షాకింగ్‌గా మారింది.

ఒకవైపు ఆర్థికంగా కోల్పోవడం.. మరోవైపు అత్యంత సన్నిహితుల నుంచి ఎదురైన చేదు అనుభవాలు, మాటలు స‌ద‌రు కమెడియన్ కం ద‌ర్శ‌కుడిని తీవ్ర వేదనకు గురిచేశాయి. సినిమాల్లో ఎంతో మందిని నవ్వించిన ఆయన తెరవెనుక ఇన్ని కష్టాలను ఒంటరిగా ఎదుర్కొన్నారనే విషయం ఇండస్ట్రీలో చాలా మందిని కంటతడి పెట్టించింది. సినీ పరిశ్రమలో విజయాలు, అపజయాలు ఎంత వేగంగా మారుతాయో చెప్పడానికి ఆ ప్ర‌ముఖ కమెడియన్ జీవిత ప్రయాణం ఒక విషాదకర ఉదాహరణగా నిలిచింది.

అయితే ఇండస్ట్రీలో ఇలాంటి ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొన్నా కానీ.. గాయ‌కుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారితో ఆయనకు ఉన్న బంధం ఎంతో ఊరటనిచ్చేది. ఇద్దరి మధ్య కేవలం వృత్తిపరమైన సంబంధమే కాకుండా కుటుంబ సభ్యుల వలె ఎంతో సన్నిహిత అనుబంధం ఉండేది. ఒకరినొకరు `అన్నయ్య` అని పిలుచుకుంటూ తమ కష్టసుఖాలను పంచుకునేవారు. ఇలా జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్న ప్రముఖ కమెడియన్ కం ద‌ర్శ‌కుడి జ్ఞాపకాలు నేటికీ ప్రేక్షకుల గుండెల్లో పదిలంగానే ఉన్నాయి. ఇంత‌కీ ఎవ‌రా క‌మెడియ‌న్ కం ద‌ర్శ‌కుడు? అంటే ఏవీఎస్. ఆయ‌న క‌మెడియ‌న్ గా ఏల్తున్న క్ర‌మంలోనే ద‌ర్శ‌క‌నిర్మాత‌గా అవ‌తారం ఎత్తి త‌రుణ్ తో అంకుల్ అనే సినిమా తీసారు. అది డిజాస్ట‌ర్ అయింది. ఆ త‌ర్వాతా ప‌రాజ‌యాలు ప‌ల‌క‌రించ‌డంతో ఆస్తులు క‌రిగిపోయాయి. ఇదే విష‌యాన్ని ఆయ‌న కుమార్తె శ్రీ‌మ‌తి శాంతి శ్రీ‌నివాస్ గారు ప‌లు ఇంట‌ర్వ్యూల‌లో వెల్ల‌డించగా అభిమానులు ఆవేద‌న‌కు గుర‌య్యారు.