Begin typing your search above and press return to search.

ప్లాస్టిక్ స‌ర్జ‌రీ-బొటాక్స్ పుకార్ల‌పై స్పందించిన న‌టి

ప్రముఖ నటి అవ్ నీత్ కౌర్ గత కొంతకాలంగా సోషల్ మీడియాలో తనపై వస్తున్న ప్లాస్టిక్ సర్జరీ - బొటాక్స్ పుకార్లపై ఎట్టకేలకు మౌనం వీడారు.

By:  Sivaji Kontham   |   16 April 2026 8:30 AM IST
ప్లాస్టిక్ స‌ర్జ‌రీ-బొటాక్స్ పుకార్ల‌పై స్పందించిన న‌టి
X

ప్రముఖ నటి అవ్ నీత్ కౌర్ గత కొంతకాలంగా సోషల్ మీడియాలో తనపై వస్తున్న ప్లాస్టిక్ సర్జరీ - బొటాక్స్ పుకార్లపై ఎట్టకేలకు మౌనం వీడారు. తన ముఖ కవళికల్లో మార్పులు వచ్చాయంటూ నెటిజన్లు చేస్తున్న కామెంట్లను ఆమె తీవ్రంగా ఖండించారు. తన ముఖ సౌందర్యం , ఫీచర్స్ అన్నీ తన తల్లి నుండి వచ్చిన సహజమైన పోలికలని.. అనవసరమైన కాస్మెటిక్ చికిత్సల జోలికి వెళ్లలేదని స్పష్టం చేశారు. సెలబ్రిటీల బాహ్య రూపంపై తప్పుడు ప్రచారాలు చేయడం సరికాదని ఈ సందర్భంగా అవ్‌నీత్ ఆవేదన వ్యక్తం చేశారు.

చిన్నప్పటి నుండే కెమెరా ముందు పెరుగుతున్న తనను చూస్తున్న ప్రేక్షకులకు.. వయసుతో పాటు వచ్చే సహజమైన మార్పుల గురించి అవగాహన ఉండాలని అవ్‌నీత్ పేర్కొన్నారు. కౌమార దశ నుండి యవ్వనంలోకి అడుగుపెట్టే క్రమంలో ముఖంలో వచ్చే మార్పులను సర్జరీగా పొరబడటం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు. దీనికి తోడు సరైన మేకప్ టెక్నిక్స్.. విభిన్నమైన కెమెరా యాంగిల్స్ .. లైటింగ్ వల్ల ముఖం కొన్నిసార్లు భిన్నంగా కనిపిస్తుందే తప్ప..అది ప్లాస్టిక్ సర్జరీ ఫలితం కాదని వివరణ ఇచ్చారు.

సోషల్ మీడియాలో వచ్చే నెగెటివ్ కామెంట్స్.. బాడీ షేమింగ్ తన ఆత్మవిశ్వాసాన్ని ఏమాత్రం దెబ్బతీయలేవని అవ్‌నీత్ ధీమా వ్యక్తం చేశారు. ట్రోలర్స్ చేసే వ్యాఖ్యలను పట్టించుకోకుండా తన వృత్తిపరమైన బాధ్యతలపైనే దృష్టి సారిస్తానని తెలిపారు. చర్మ సౌందర్యం కోసం తాను ఎప్పుడూ సహజమైన పద్ధతులనే అనుసరిస్తానని.. ఆరోగ్యకరమైన జీవనశైలి .. ఫిట్‌నెస్ ద్వారానే తాను అందంగా కనిపిస్తున్నానని ఈ యువ నటి స్పష్టం చేశారు. త‌న ముక్కు ముఖ‌మార్పిడి చికిత్స‌లు చేయించుకోలేద‌ని తెలిపారు. బాహ్య సౌందర్యం కంటే వ్యక్తిత్వం- ప్రతిభ ముఖ్యమని తన అభిమానులకు సందేశం ఇచ్చారు.

అవ్‌నీత్ కౌర్ సినీ కెరీర్ విషయానికి వస్తే... ఒక డ్యాన్సర్‌గా తన ప్రయాణాన్ని ప్రారంభించి అనతి కాలంలోనే టాప్ నటిగా ఎదిగారు. ``డాన్స్ ఇండియా డాన్స్ లిటిల్ మాస్టర్స్`` ద్వారా గుర్తింపు పొందిన ఈ బ్యూటీ ఆ తర్వాత `చంద్ర నందిని`, `అల్లాదీన్ - నామ్ తో సునా హోగా` వంటి సీరియల్స్ తో బుల్లితెర ప్రేక్షకులకు చేరువయ్యారు. రాణి ముఖర్జీ నటించిన `మర్దాని` చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అవ్‌నీత్ అటుపై నవాజుద్దీన్ సిద్ధిఖీ సరసన`టికూ వెడ్స్ షేరు` చిత్రంలో కథానాయికగా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు.

ప్రస్తుతం అవ్నీత్ కౌర్ ప‌లు చిత్రాల్లో న‌టిస్తున్నారు. కొన్ని వెబ్ సిరీస్‌ల చర్చలు కూడా తుది దశలో ఉన్నాయి. కేవలం నటనకే పరిమితం కాకుండా సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా కూడా లక్షలాది మంది ఫాలోవర్లను సంపాదించుకున్న అవ్ నీత్ తన తదుపరి చిత్రాలతో వెండితెరపై త‌న గ్రాఫ్ ని పెంచుకోనున్నారు.