రియాలిటీ షోలో రియల్ పెళ్లి!
బాలనటిగా దేశవ్యాప్తంగా పేరు సంపాదించిన ఈ ముద్దుగుమ్మ, ముంబైలో అంగరంగ వైభవంగా జరిగిన వేడుకలో తన ప్రియుడు మిలింద్ చంద్వానీతో ఏడు అడుగులు వేసింది.
By: M Prashanth | 1 Oct 2025 9:47 AM ISTహిందీ టెలివిజన్ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న చిన్నారి పెళ్లికూతురు సీరియల్ ఫేమ్ అవికా గోర్ ఇప్పుడు కొత్త జీవితాన్ని ప్రారంభించింది. బాలనటిగా దేశవ్యాప్తంగా పేరు సంపాదించిన ఈ ముద్దుగుమ్మ, ముంబైలో అంగరంగ వైభవంగా జరిగిన వేడుకలో తన ప్రియుడు మిలింద్ చంద్వానీతో ఏడు అడుగులు వేసింది. ఈ వేడుకకు సినీ, టెలివిజన్ ప్రముఖులు హాజరై కొత్త దంపతులను ఆశీర్వదించారు.
అవికా గోర్, మిలింద్ లవ్ స్టోరీ గత కొన్నేళ్లుగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. 2019లో ఇద్దరూ కలుసుకోవడం, 2020 నుంచి అధికారికంగా ప్రేమలో ఉన్నట్టు ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత తరచుగా తమ క్యూట్ ఫొటోలు, వీడియోలు పంచుకుంటూ అభిమానులకు తమ బంధం గురించి తెలియజేశారు. ఈ ఏడాది జూన్ లో ఘనంగా నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట, ఇప్పుడు పెళ్లితో తమ ప్రయాణాన్ని మరింత ముందుకు తీసుకెళ్లారు.
ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందంటే, వీరి వివాహం ఒక రియాలిటీ షో వేదికపైనే జరగడం. పతీ పత్నీ ఔర్ పంగా అనే షోలోనే అవికా మిలింద్ ముహూర్తం జరిగింది. ఇది ప్రేక్షకులకు మరింత సర్ప్రైజ్ అనే చెప్పాలి. బుల్లి తెర మీద రియాలిటీ షోలో చూసే ఎమోషన్ ఇప్పుడు నిజ జీవితంలో రియల్ పెళ్లిగా మారడం విశేషం. ఈ వేడుకలో హీనా ఖాన్, రాఖీ సావంత్, ఫరా ఖాన్, రుబీనా దిలైక్ వంటి అనేకమంది సెలబ్రిటీలు హాజరై జంటను అభినందించారు.
సోషల్ మీడియాలో ప్రస్తుతం అవికా పెళ్లి ఫొటోలు, డాన్స్ వీడియోలు వైరల్ అవుతున్నాయి. పెళ్లి అనంతరం వధూవరులు డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేసిన వీడియోలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. అభిమానులు, సహచర నటీనటులు, మిత్రులు ఈ కొత్త జంటకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
అవికా గోర్ బాలనటి నుంచి హీరోయిన్ గా మారిన ప్రయాణం ప్రత్యేకం. ఉయ్యాలా జంపాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ఆమె, లక్ష్మి రావే మా ఇంటికి, సినిమా చూపిస్తా మామ, రాజుగారి గది 3, థ్యాంక్యూ వంటి సినిమాల్లో నటించింది. పలు వెబ్ సిరీస్ లలో కూడా తనదైన గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం షణ్ముఖ అనే సినిమాలో నటిస్తున్న అవికా, నిర్మాతగా కూడా కొన్ని ప్రాజెక్ట్స్ లో భాగమవుతున్నారు. ఇక మిలింద్ విషయానికొస్తే, ఆయన సామాజిక కార్యకర్తగా, వ్యాపారవేత్తగా మంచి పేరు తెచ్చుకున్నారు.
