బ్యాంకాక్‌కు మకాం మార్చేసిన అవికా గోర్!
అవికాగోర్ అలియాస్ చిన్నారి పెళ్లికూతురుగా తెలుగింట ఫేమస్ అయిన అవిక సినిమాల స్పీడ్ తగ్గిన సంగతి తెలిసిందే.
By: Srikanth Kontham | 10 May 2026 6:00 AM ISTఅవికాగోర్ అలియాస్ చిన్నారి పెళ్లికూతురుగా తెలుగింట ఫేమస్ అయిన అవిక సినిమాల స్పీడ్ తగ్గిన సంగతి తెలిసిందే. అవకాశాలు రాకపోవడం సహా వివాహ బంధంలోకి అడుగు పెట్టడంతో అమ్మడు కెరీర్ ని సీరియస్ గా తీసుకోలేదు. ఇటీవలే ఓ తెలుగు సినిమాలో నటించింది గానీ ఆ సినిమా అనుకున్నంతగా రాణించలేదు.ఈ నేపథ్యంలో తాజాగా ఓ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అమ్మడు తన నివాసాన్ని భారతదేశం నుండి థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌కు మార్చేసింది. వ్యక్తిగత ఎదుగుదలతో పాటు అంతర్జాతీయ స్థాయిలో వస్తోన్న సరికొత్త అవకాశాలను అందిపుచ్చుకోవడానికే ఈ కీలక నిర్ణయం తీసుకుంది.
బ్యాంకాక్ నగరం తనకు ఎంతో ఇష్టమని అక్కడి జీవనశైలి తనను ఎంతగానో ఆకర్షించిందని అవికా వెల్లడించింది. అయితే నివాసం బ్యాంకాక్‌కు మారినంత మాత్రాన భారతీయ చిత్ర పరిశ్రమకు దూరం కావడం లేదని స్పష్టం చేసింది. ప్రస్తుతం అవిక చేతిలో కొన్ని బాలీవుడ్ ప్రాజెక్టులున్నాయి. షూటింగ్స్ ఉన్నప్పుడు ఇండియాకు రావడం, పని ముగిశాక మళ్ళీ బ్యాంకాక్ వెళ్లడం వంటి షటిల్ సర్వీస్ కొనసాగిస్తానని తెలిపింది. ప్రస్తుతం ఉన్న డిజిటల్ యుగంలో పని చేయడానికి భౌగోళిక సరిహద్దులు అడ్డంకి కాదని ఎక్కడి నుంచైనా కథా చర్చల్లో పాల్గొనవచ్చని అభిప్రాయపడింది.
అమ్మడు నటిగానే కాక నిర్మాతగా కూడా తన ముద్ర వేసింది. థాయ్‌లాండ్‌లో నివసించడం వల్ల అక్కడి చిత్ర పరిశ్రమతో పాటు, అంతర్జాతీయ నిర్మాణ సంస్థలతో సంబంధాలు ఏర్పరచుకోవడం సులభ మవుతుందని భావిస్తోంది. భవిష్యత్తులో భారతీయ ,థాయ్ సినిమాల మధ్య కొలాబరేషన్స్ తీసుకురావాలనే ఆలోచన ఉన్నట్లు తెలిపింది. అక్కడి మేకర్స్‌తో చర్చలు జరపడానికి కొత్త తరహా కంటెంట్‌ను రూపొందించడానికి బ్యాంకాక్ కేంద్రంగా ఉండటం కలిసొస్తుందని భావిస్తోంది. అలాగే బ్యాంకాక్‌లో ఉండటం వల్ల కొంత ప్రశాంతత , స్వేచ్ఛ లభిస్తుందని అంటోంది.
నిరంతరం కెమెరాల మధ్య గడిపే నటీనటులకు ఇలాంటి మార్పు మానసిక ఉల్లాసాన్ని ఇస్తుంది. కొత్త వాతావరణం, కొత్త సంస్కృతి తనలోని సృజనాత్మకతను మరింత పెంచుతాయి. అవిక నిర్ణయానికి కుటుంబ సభ్యులు సన్నిహితుల నుండి పూర్తి మద్దతు లభించినట్లు తెలిపింది. ఈ మార్పు కెరీర్‌లో ఓ కొత్త అధ్యాయమని, అంతర్జాతీయ వేదికలపై భారతీయ నటిగా రాణించాలనే తన కల నిజం కావడానికి ఇదొక గొప్ప అడుగుగా అభివర్ణించింది. థాయ్ భాషా చిత్రాల్లో నటించే అవకాశాలను కూడా అవిక పరిశీలిస్తుంది. భారతీయ సినిమాల్లో నటిస్తూనే ఆసియా మార్కెట్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలన్నది అమ్మడి ప్లాన్. అవికా గోర్ తీసుకున్న ఈ నిర్ణయం నేటి తరం నటీనటుల గ్లోబల్ ఆలోచనా దృక్పథానికి అద్దం పడుతోంది. ఒకే పరిశ్రమకు పరిమితం కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అవకాశాలను ఒడిసిపట్టుకోవడంలో అవికా అడ్వాన్స్ గా ఆలోచిస్తుంది.
