పేరుకే ఛాన్స్ అయితే అవసరం లేదు!
అవకాశాలు తగ్గిన క్రమంలోనే ఆ తరహా రోల్స్ వైపు చూసింది తప్ప నటిగా మాత్రం హద్దులు చెరిపింది లేదు.
By: Srikanth Kontham | 2 Aug 2026 2:33 PM ISTబాలీవుడ్ టెలివిజన్ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి అవికా గోర్. చిన్ననాటి నుంచి నటనపై మక్కువతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అమ్మడు గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా బలమైన అభినయం ఉన్న పాత్రలకే ప్రాధాన్యత ఇచ్చి ముందకు సాగారు. పాత్రల ఎంపికలో అవిక వ్యవహరిస్తున్న తీరు ఇండస్ట్రీలో ఎప్పుడూ చర్చనీయాంశంగానే ఉంటుంది. బుల్లి తెరైనా..పెద్ద తెరైనా తనదైన ముద్ర వేయడంలో అవిక స్పెషలిస్ట్ అని కెరీర్ ఆరంభంలోనూ ప్రూవ్ చేసింది. అయితే ఆరంభంలో గ్లామర్ పాత్రలకు దూరంగానే ఉంది.
అవకాశాలు తగ్గిన క్రమంలోనే ఆ తరహా రోల్స్ వైపు చూసింది తప్ప నటిగా మాత్రం హద్దులు చెరిపింది లేదు. ఈ నేపథ్యంలో తాజాగా పాత్రల ఎంపిక విషయంలో తానెలా వ్యవహరిస్తుందన్నది రివీల్ చేసారు. వచ్చిన ప్రతీ అవకాశాన్ని గుడ్డిగా అంగీకరించకుండా కథా బలమున్న చిత్రాలనే ఎంచుకోవడంలో ఎంతో పరిణతి కనబరుస్తున్నారు. తెరపై కనిపించడం కోసం కాకుండా నటిగా తనలోని సత్తా చాటేలా పాత్రలు ఉండాలని బలంగా కోరుకుంటున్నారు. సినిమాలో ఒక అలంకార వస్తువులా మిగిలిపోయే పాత్రలను తానెప్పుడు కోరుకోలేదని తేల్చి చెప్పారు.
దర్శక, నిర్మాతలు తన నుంచి బలమైన నటనను ఆశిస్తున్నారని, అందుకే స్క్రిప్ట్ ఎంపికలో అత్యంత జాగ్రత్తగా ఉంటానని వెల్లడించారు. అవికాగోర్ ఉంటే చాలు అనే పాత్రలు తనకవసరం లేదని కేవలం బలమైన పాత్రలు మాత్రమే పోషిస్తానని తేల్చి చెప్పారు. ఈ స్పష్టత అవిక గోర్ ను తోటి నటీమణుల కంటే ప్రత్యేకంగా నిలబెడుతోంది. అలాగే తిరిగి బుల్లితెరకు తిరిగి రీఎంట్రీ ఇచ్చేందుకు అవిక సిద్ధమవుతున్నారు. అత్యంత ప్రమాదకరమైన సవాలుతో కూడిన రియాలిటీ షో `ఖత్రాన్ కే ఖిలాడి సీజన్ 15` ద్వారా మళ్లీ ప్రేక్షకులను పలకరించనున్నారు. రోహిత్ శెట్టి హోస్ట్ చేస్తున్న ఈ షోలో పాల్గొనడం గురించి ఓపెన్ అయ్యారు.
గతంలో తాను చేసిన సీజన్ కంటే ఈసారి భయాలు చాలా తక్కువగా ఉన్నాయని.. సాహసోపేత స్టంట్స్ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. కేవలం రియాలిటీ షోలు, సినిమాలే కాకుండా విభిన్న ప్రాజెక్ట్‌లతో అవికా గోర్ కెరీర్‌ను మరింత వైవిధ్యభరితంగా మలుచుకుంటున్నారు. త్వరలోనే ఓ పంజాబీ మ్యూజిక్ వీడియోతో పాటు మరికొన్ని కొత్త వెబ్ ..టెలివిజన్ ప్రాజెక్ట్ లను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఏది ఏమైనా? ప్రయోగాత్మక పాత్రలు చేస్తూనే అవిక కెరీర్‌ను సుస్థిరం చేసుకోవడంలో చూపుతున్న శ్రద్ధ ప్రశంసనీయం. బాలీవుడ్ నుంచి ప్రాంతీయ చిత్రాల వరకు అన్ని రంగాలలోనూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవాలనే తపన అవికలో స్పష్టంగా కనిపిస్తోంది. కెరీర్ ఆరంభంలో ఎదురైన విజయాలను కొనసాగిస్తూ మరింత సవాళ్లతో కూడిన పాత్రలను అంగీకరించడం ద్వారా తన పరిధులను విస్తరిస్తున్నారు. నటిగా అవికా గోర్ ప్రయాణం భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆశీద్దాం.
