ట్రెండీ టాక్: MCU బ్రాండ్‌లా దేశీ బ్రాండ్ మార్మోగేదెప్పుడు?
భారతదేశంలో హాలీవుడ్ ఫ్రాంఛైజీ చిత్రాలకు.. ముఖ్యంగా మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ (MCU) సినిమాలకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
By: Sivaji Kontham | 21 Sept 2026 3:06 PM ISTభారతదేశంలో హాలీవుడ్ ఫ్రాంఛైజీ చిత్రాలకు.. ముఖ్యంగా మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ (MCU) సినిమాలకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకసారి కలెక్షన్ల సునామీ సృష్టించి వెళ్ళిపోయినా ఇప్పుడు రీ-రిలీజ్ పేరుతో ఇండియా నుంచి భారీ కలెక్షన్లను రాబడుతుండటం చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలగక మానదు. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వచ్చిన `అవెంజర్స్: ఎండ్‌గేమ్` సినిమా తన తొలి రిలీజ్‌లో దేశవ్యాప్తంగా సంచలన వసూళ్లను సాధించింది. ఇప్పుడు ఈ సినిమాను భారతదేశంలో మరోసారి రీ-రిలీజ్ చేస్తుండగా ఇక్కడ ఊహించని స్థాయిలో కలెక్షన్లతో సరికొత్త రికార్డులు నెలకొల్పడానికి సిద్ధమవుతుండటం విశేషం.
ఈ రీ-రిలీజ్ కోసం భారత్‌లోని మేజర్ నేషనల్ చైన్స్ థియేటర్లలో మొదటి రోజు కోసం వేలాది టికెట్లు అమ్ముడుపోయాయి. సినిమా విడుదలకు ఇంకా ఐదు రోజుల సమయం ఉండగానే ఈ సంఖ్య 50 వేల మార్కును దాటడం ఖాయంగా కనిపిస్తోంది. అలాగే వీకెండ్ బుకింగ్స్ కూడా అద్భుతంగా సాగుతున్నాయి. ఈ హుషారు చూస్తుంటే గత ఏడాది విడుదలైన `బాహుబలి- ది ఎపిక్` చిత్రం సాధించిన 9కోట్ల నెట్ రికార్డ్ బ్రేక్ అవ్వడం ఖాయమేనని ట్రేడ్ విశ్లేషిస్తోంది.
ఏలాంటి భారీ ప్రమోషన్లు లేకుండా కేవలం బ్రాండ్ క్రేజ్‌తోనే ప్రేక్షకులు ఈ స్థాయిలో థియేటర్లకు క్యూ కట్టడం భారత్‌లో మార్వెల్‌కు ఉన్న పాపులారిటీని చాటుతోంది. `స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే` భారత్‌లో రూ. 500 కోట్ల నెట్ మార్క్‌ను దాటి హాలీవుడ్ చిత్రాల కొత్త రికార్డును సృష్టించగా డిసెంబర్ 18న రాబోతున్న `అవెంజర్స్: డూమ్స్‌డే` సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది. ముఖ్యంగా క్రిస్మస్ సీజన్ పీక్‌లో డూమ్స్‌డే విడుదలైన వారం తర్వాతే షారుఖ్ ఖాన్ `కింగ్` అతడికి కూడా మార్వల్ సినిమా సెగ తప్పదని అంచనా.
అయితే మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ తరహాలో భారతదేశంలో ఉన్న గొప్ప ఫ్రాంఛైజీలు తమ సినిమాలను విదేశాలలో రిలీజ్ చేసి సరిగ్గా అదే స్థాయి దూకుడును ప్రదర్శించగలవా? అన్నదే ఇప్పుడు సినీ వర్గాల్లో ప్రధాన చర్చగా మారింది. ఇప్పటికే బాహుబలి, ఆర్.ఆర్.ఆర్ చిత్రాలతో రాజమౌళి గ్లోబల్ మార్కెట్‌లో ఇండియన్ సినిమా సత్తాను చాటి చెప్పి ఈ ఫీట్‌ను కొంతవరకు సాధించి చూపించారు. భవిష్యత్తులో రానున్న `వారాణాసి` లాంటి భారీ ప్రాజెక్ట్‌లు ప్రపంచవ్యాప్తంగా ఒక సరికొత్త ట్రెండ్‌ను సెట్ చేస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు.
అయితే హాలీవుడ్‌లో అవెంజర్స్, అవతార్ వంటి ఫ్రాంఛైజీ సినిమాలు ప్రపంచవ్యాప్తంగా సృష్టించే సంచలనాలతో సమానంగా మన దేశీ ఫ్రాంఛైజీలు గ్లోబల్ మార్కెట్‌ను పూర్తిగా శాసించడానికి ఇంకా ఎంత సమయం పడుతుంది? మన మేకర్స్ ఆ స్థాయికి చేరుకోవడానికి ఎలాంటి మార్కెటింగ్ వ్యూహాలను అనుసరించాల్సి ఉంటుంది అనేది వేచి చూడాలి.
