Begin typing your search above and press return to search.

మార్వ‌ల్ వ్యూహం: ఫ్లాపులొచ్చినా తెలివిగా బౌన్స్ బ్యాక్ అవ్వాల‌ని!

గ్లోబల్ బాక్సాఫీస్ చరిత్రను తిరగరాసి ఏడేళ్లు గడిచిన తర్వాత మార్వెల్ స్టూడియోస్ సంచలనాత్మక చిత్రం `అవెంజర్స్: ఎండ్‌గేమ్` మరోసారి వెండితెరపైకి రానుంది.

By:  Sivaji Kontham   |   12 Sept 2026 6:00 PM IST
మార్వ‌ల్ వ్యూహం: ఫ్లాపులొచ్చినా తెలివిగా బౌన్స్ బ్యాక్ అవ్వాల‌ని!
X

గ్లోబల్ బాక్సాఫీస్ చరిత్రను తిరగరాసి ఏడేళ్లు గడిచిన తర్వాత మార్వెల్ స్టూడియోస్ సంచలనాత్మక చిత్రం `అవెంజర్స్: ఎండ్‌గేమ్` మరోసారి వెండితెరపైకి రానుంది. `అవెంజర్స్: ఎండ్‌గేమ్- ఎంకోర్` పేరుతో సెప్టెంబర్ 25న ఈ సినిమాను థియేటర్లలో రీ-రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఐమ్యాక్స్ - ఇన్ఫినిటీ విజన్ స్క్రీన్‌ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ రీ-రిలీజ్ ప్రకటన.. సినీ ప్రియుల్లో ఒక్కసారిగా భారీ అంచనాలను పెంచేయ‌డ‌మే గాక‌.. అప్ప‌ట్లో సినిమా వీక్ష‌ణ మిస్స‌యిన వారికి పాత జ్ఞాపకాలను మళ్లీ తట్టిలేపింది.

2019లో ఈ సినిమా విడుదలైనప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. తొలి రోజు ప్రదర్శనల సమయంలో థియేటర్లలో కనిపించిన ఉత్సాహం.. పోర్టల్స్ ఓపెన్ అయ్యే సీన్లకు ప్రేక్షకుల కేకలు.. ముఖ్యంగా కెప్టెన్ అమెరికా మోజ‌ల్నిర్ `అవెంజర్స్... అసెంబుల్!` అని చెప్పిన మూవ్ మెంట్స్ అభిమానులకు ఎప్పటికీ మరువలేనివి. తొలిసారి థియేటర్ అనుభూతిని కోల్పోయిన యువతరానికి.. ఈ రీ-రిలీజ్ ద్వారా ఆ అద్భుతమైన అనుభూతిని పెద్ద తెరపై అనుభవించే సువర్ణావకాశం లభిస్తోందని నెటిజన్లు సోషల్ మీడియాలో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఈ రీ-రిలీజ్ ప్రకటన వెనుక ఉన్న వ్యాపార వ్యూహంపై సోషల్ మీడియాలో భిన్నమైన చర్చలు కూడా జరుగుతున్నాయి. రానున్న‌ సినిమాలలో రాబర్ట్ డౌనీ జూనియర్ `డాక్టర్ డూమ్` పాత్రలో విలన్‌గా నటిస్తుండటంతో మార్వెల్ తన గతం వైపే మళ్లీ అడుగులు వేస్తోందని అభిమానులు సరదాగా జోకులు పేల్చుకుంటున్నారు. మరోవైపు.. ఇటీవల కాలంలో బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించని మార్వెల్... పాత విజయాల ద్వారా మళ్లీ క్యాష్ చేసుకునేందుకు చేస్తున్న వ్యూహాత్మక పన్నాగమే ఇదంటూ కొందరు విమర్శకులు అభిప్రాయపడుతున్నారు.

ఇలాంటి విమర్శలు ఎన్ని ఉన్నా కానీ...`అవెంజర్స్: ఎండ్‌గేమ్` అనేది కేవలం ఒక సినిమా కాదు.. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని ఒకతాటిపైకి తెచ్చిన ఒక సాంస్కృతిక దృగ్విషయం. ఇన్ఫినిటీ సాగా అందించిన ఆ అనుభూతిని.. ప్రేక్షకులను ఒకే గదిలో కూర్చోబెట్టి నవ్వించి, ఏడిపించి, అరిపించిన ఆ మ్యాజిక్‌ను ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లు ఎప్పటికీ ఇవ్వలేవు. అందుకే ఈ రీ-రిలీజ్‌ను కేవలం ఒక సాధారణ రీ-రన్‌గా కాకుండా.. ఒక అపూర్వమైన సినిమా అనుభవంగా అభిమానులు భావిస్తున్నారు.

మొత్తానికి `అవెంజర్స్: ఎండ్‌గేమ్: ఎంకోర్` రూపంలో మరోసారి థియేటర్లు మార్వెల్ నామస్మరణతో మార్మోగడం ఖాయంగా కనిపిస్తోంది. అవెంజ‌ర్స్ భారీ యాక్ష‌న్ సీక్వెన్సులు, అడ్వెంచ‌ర్ సీన్స్ మ‌రోసారి థియేట‌ర్ల‌లో క‌ట్టిప‌డేయ‌డం ఖాయమేన‌ని ఫ్యాన్స్ భావిస్తున్నారు. సెప్టెంబర్ 25న టికెట్లు బుక్ చేసుకునేందుకు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఏడేళ్ల క్రితం సృష్టించిన చరిత్రను మళ్లీ రిపీట్ చేయడానికి సిద్ధమవుతున్న ఈ సినిమా... బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభావితం చూపుతుందో వేచి చూడాలి.