డిసెంబర్లో తెలుగు సినిమాలకు హాలీవుడ్ టెన్షన్!
డిసెంబర్ వచ్చిందంటే క్రిస్మస్ సెలవులను ఉపయోగించుకునేందుకు పెద్ద సినిమాలు పోటీపడుతుంటాయి.
By: M Prashanth | 4 Nov 2026 5:00 AM ISTడిసెంబర్ వచ్చిందంటే క్రిస్మస్ సెలవులను ఉపయోగించుకునేందుకు పెద్ద సినిమాలు పోటీపడుతుంటాయి. ఈసారి తెలుగు సినిమాలకు సొంత ఇండస్ట్రీ నుంచే కాకుండా హాలీవుడ్ నుంచి కూడా గట్టి పోటీ ఎదురుకానుంది. ముఖ్యంగా హైదరాబాద్ లాంటి నగరాల్లో మల్టీప్లెక్స్, ఐమ్యాక్స్ స్క్రీన్ల కోసం పెద్ద సినిమాల మధ్య పోటీ పెరిగే పరిస్థితి ఉంది. ఇందులో తెలుగు చిత్రాలకు ఎంతవరకు ప్రాధాన్యం దక్కుతుందనేది అసలు మ్యాటర్.
డిసెంబర్ 18న మార్వెల్ 'అవెంజర్స్: డూమ్స్‌డే', 'డ్యూన్: పార్ట్ 3' విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఈ రెండు సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా భారీ క్రేజ్ ఉంది. ముఖ్యంగా డ్యూన్ సినిమాను ఐమ్యాక్స్ ఫార్మాట్‌ను దృష్టిలో పెట్టుకుని తెరకెక్కించారు. అవెంజర్స్‌కు ఇండియాలోనూ మంచి మార్కెట్ ఉంది. దీంతో ప్రీమియం స్క్రీన్ల కోసం ఈ రెండు సినిమాల మధ్యే పోటీ ఉండబోతోంది.
మరోవైపు డిసెంబర్ 4న నాగచైతన్య 'వృషకర్మ', నితిన్ 'అలియాస్ రుక్మిణి', విశ్వక్ సేన్ 'లెగసీ' విడుదలకు షెడ్యూల్ అయ్యాయి. వీటిలో ఏ సినిమాకు మంచి టాక్ వచ్చినా రెండో వారంలో థియేటర్లను నిలబెట్టుకోవడం కీలకం. హాలీవుడ్ సినిమాలు వచ్చాక మల్టీప్లెక్స్‌లలో షోలు తగ్గే అవకాశం ఉంది. ముఖ్యంగా పెద్ద స్క్రీన్లలో ప్రదర్శనల సంఖ్యపై ప్రభావం పడొచ్చు.
ఇక క్రిస్మస్కు బాలకృష్ణ 'దాదా', నాగార్జున 'కింగ్ 100' సినిమాలు రాబోతున్నాయి. అదే సమయంలో షారుఖ్ ఖాన్ 'కింగ్', హాలీవుడ్ నుంచి 'జుమాంజీ' కూడా పోటీలో ఉన్నాయి. అంటే చివరి రెండు వారాల్లో ప్రేక్షకుల కోసం తెలుగు, హిందీ, ఇంగ్లిష్ సినిమాలు ఒకేసారి పోటీపడనున్నాయి. అయితే తెలుగు రాష్ట్రాల్లో సింగిల్ స్క్రీన్ల విషయంలో లోకల్ సినిమాలకు అడ్వాంటేజ్ ఉండొచ్చు.
ఇక్కడ మరో సమస్య టికెట్ ధరలు. ఐమ్యాక్స్, ప్రీమియం స్క్రీన్లలో టికెట్ రేట్లు ఎక్కువగా ఉంటాయి. దీంతో భారీ హాలీవుడ్ సినిమాలకు తక్కువ షోలతోనూ మంచి గ్రాస్ వచ్చే అవకాశం ఉంది. తెలుగు సినిమాలకు మంచి టాక్ వచ్చినా ప్రీమియం స్క్రీన్లు తగ్గితే ఆ మేరకు వసూళ్లపై ప్రభావం పడొచ్చు. అయితే డిసెంబర్ రిలీజ్ డేట్లలో మార్పులు జరిగితే ఈ పోటీ కూడా మారే అవకాశం ఉంది.
