'అవతార్' సీక్వెళ్లలా రొటీనిటీ సమస్య
అయితే ఆల్రెడీ హిట్టయిన ఫార్ములాను తిరిగి రీపీట్ చేస్తూ, కొనసాగింపు చిత్రాలతో సేఫ్ అవ్వాలనుకోవడం సరైనదేనా? అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
By: Sivaji Kontham | 30 Jan 2026 5:00 PM ISTఇటీవలి కాలంలో హాలీవుడ్ లో క్రేజీ ఫ్రాంఛైజీ `అవతార్` నుంచి వరుస సినిమాలొస్తున్నాయి. అయితే అవతార్ సినిమాకి ఉన్న క్రేజ్ అవతార్ 2, అవతార్ 3 చిత్రాలకు రాలేదు. అవతార్ 2 పై చాలా విమర్శలు వచ్చినా కానీ, వసూళ్ల పరంగా బెస్ట్ అనిపించింది. అయితే అవతార్ 3 విషయంలో విమర్శకులు పూర్తిగా పెదవి విరిచేసారు. కామెరూన్ కేవలం అవతార్ లను నమ్ముకుని రెగ్యులర్ టెంప్లేట్ ని అనుసరించాడని, కథ, స్క్రీన్ ప్లేలో కొత్తదనం లేదని విమర్శించారు. అవతార్ ఫ్రాంఛైజీలో తదుపరి సీక్వెళ్లను భరించలేమని కూడా కొందరు విమర్శించారు. ఒక దర్శకనిర్మాతగా జేమ్స్ కామెరూన్ దీనిపై చాలా ఆలోచిస్తున్నారు. నాలుగో భాగం అవతార్ 4, అవతార్ 5 చిత్రాలను మునుపటి భాగాల కంటే కొత్తగా ఎలా అందించాలన్నది ఇప్పుడు కామెరూన్ ముందున్న పెను సవాల్.
అయితే బడ్జెట్లు, కాన్వాస్ పరంగా అవతార్ తో పోలిక లేకపోయినా కానీ, సీక్వెల్ ఆలోచనల పరంగా ఇప్పుడు భారతదేశంలో దిగ్గజ నిర్మాణ సంస్థ టిసిరీస్ కూడా అలాంటి ఒక సమస్యను ఎదుర్కొంటోంది. ఈ సంస్థ నుంచి మునుముందు భారీ సీక్వెల్ సినిమాలు తెరకెక్కనున్నాయి. బార్డర్ 2 సక్సెస్ నేపథ్యంలో బార్డర్ 3, యానిమల్ సీక్వెల్ యానిమల్ పార్క్ (యానిమల్ 2), ధమాల్ 4, భూల్ భులైయా 4 వంటి ఫ్రాంఛైజీ చిత్రాలను టీ సిరీస్ నిర్మించనుంది.
అయితే ఆల్రెడీ హిట్టయిన ఫార్ములాను తిరిగి రీపీట్ చేస్తూ, కొనసాగింపు చిత్రాలతో సేఫ్ అవ్వాలనుకోవడం సరైనదేనా? అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అవతార్ 2, అవతార్ 3 విషయంలో కామెరూన్ కూడా ఇలాంటి సేఫ్ గేమ్ నే ఆడారు. పార్ట్ 2, పార్ట్ 3 చిత్రాలలో ఒకే తరహా ఎమోషన్స్ , థ్రిల్స్ ని రిపీట్ చేయడం విమర్శలకు తావిచ్చింది. అయితే దానినే టిసీరీస్ అనుకరిస్తే సక్సెస్ సాధిస్తుందా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. పోటాపోటీగా కంటెంట్ అందుబాటులోకి వస్తున్న ఈ డిజిటల్ యుగంలో పెద్ద తెరకు ఎప్పటికప్పుడు కొత్తదనం నిండిన కథలు కావాలి. కానీ అందుకు భిన్నంగా రొటీన్ గా ఉండే వాటిని అనుకరించడం సరైనది కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఇప్పటికే ఓటీటీలు ఎంతో వైవిధ్యమైన కథలతో ఒరిజినల్ కంటెంట్ ని అందిస్తుంటే, రేసులో క్రియేటివిటీ పరంగా పెద్ద తెర వెనకబడింది. ఒక వెబ్ సిరీస్ తో ఇంకో వెబ్ సిరీస్ కి సంబంధం లేకుండా నిత్య నూతన కథాంశాలను ఎంచుకుని ఓటీటీలు మ్యాజిక్ చేస్తుంటే, పెద్ద తెర కోసం ఎంచుకునే కథాంశాలు ఇంకెంత వైవిధ్యంగా ఉండాలో ఆలోచించాలి కదా? టీసిరీస్ లాంటి దిగ్గజ సంస్థ అలా ఎందుకు చేయడం లేదు? అని కూడా కొందరు ప్రశ్నిస్తున్నారు. తెలిసిన కథలు, తెలిసిన నటులను రిపీట్ చేస్తూ కేవలం బ్రాండ్ ని వాడుకుని సక్సెస్ సాధించాలనుకోవడం సరైనదేనా? అని కూడా ప్రశ్నిస్తున్నారు.
ఒరిజినల్ కథల్ని సృష్టించడంలో హిందీ ఫిలింమేకర్స్ దగ్గర దమ్ము కనిపించడం లేదు! అందుకే సౌత్ దర్శకులను నమ్ముకుంటున్నారని కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రొటీన్ కథాంశాలతో సీక్వెల్స్ చూడాలంటే జనాలకు విసుగొస్తుంది. దానికంటే ఏదైనా కొత్త కథతో ప్రయోగం చేస్తే అది ప్రేక్షకులను ఎక్కువగా ఎగ్జయిట్ చేసేందుకు ఆస్కారం ఉంటుందని కూడా విశ్లేషిస్తున్నారు.