Begin typing your search above and press return to search.

కామెరూన్‌లా ప్రకటించే ధైర్యం మన సీక్వెల్ డైరెక్ట‌ర్ల‌కు లేనే లేదా?

హాలీవుడ్‌లో జేమ్స్ కామెరూన్ `అవతార్` సిరీస్ విషయానికి వస్తే.. ఏకంగా పార్ట్ 4, పార్ట్ 5 వరకు ముందుగానే ప్రకటించి తన విజన్ ఏంటో స్పష్టంగా చాటుకున్నారు.

By:  Sivaji Kontham   |   6 Oct 2026 9:26 AM IST
కామెరూన్‌లా ప్రకటించే ధైర్యం మన సీక్వెల్ డైరెక్ట‌ర్ల‌కు లేనే లేదా?
X

హాలీవుడ్‌లో జేమ్స్ కామెరూన్ `అవతార్` సిరీస్ విషయానికి వస్తే.. ఏకంగా పార్ట్ 4, పార్ట్ 5 వరకు ముందుగానే ప్రకటించి తన విజన్ ఏంటో స్పష్టంగా చాటుకున్నారు. సీక్వెల్స్ లో రెండు, మూడు భాగాల‌పై కొన్ని విమర్శలు వచ్చినా.. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల ప్రవాహం తగ్గకపోవడంతో ఆయన అంత ధైర్యంగా ప్ర‌క‌టించ‌గ‌లిగారు. కానీ, భారతదేశంలో మ‌న ట్యాలెంటెడ్ ద‌ర్శ‌కుల‌ మాత్రం పరిస్థితి ఇందుకు పూర్తిగా భిన్నంగా ఉంది. మన దేశంలో అత్యంత క్రేజ్ సంపాదించుకున్న పలు భారీ ఫ్రాంఛైజీ సినిమాల మూడో భాగాల (పార్ట్‌-3) కథలన్నీ ఇప్పుడు తీవ్ర మీమాంశలో పడ్డాయి. కామెరూన్‌లా సీక్వెల్స్‌పై ముందే ఓపెన్‌గా ప్రకటించే ధైర్యం లేదా స్పష్టత మన దైవాలైన దర్శకుల్లో కొరవడిందనే చెప్పాలి.

ఈ జాబితాలో ముందుగా చెప్పుకోవాల్సింది `ధురంధర్ 3` గురించే. ఆదిత్య ధర్ తెరకెక్కించిన `ధురంధర్`, `ధురంధర్ 2` సక్సెస్ తర్వాత మూడో భాగం కూడా ఉంటుందనే ప్రచారం గట్టిగానే సాగింది. అయితే నాటి రాజకీయ పరిస్థితులకు నేటి పరిస్థితులకు చాలా వ్యత్యాసం ఉండటం.. అజిత్ దోవల్ వంటి కీలక నేతల కథలను ఇంకా ఏ మేర సిరీస్‌లుగా సాగదీస్తే ప్రేక్షకులు ఆదరిస్తారనే మీమాంశ దర్శకుడిలో ఉంది అనే ఊహాగానాలు సాగుతున్నాయి. ప్రస్తుతం ఆదిత్య ధర్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ `ఇమ్మోర్టల్ ఆఫ్ అశ్వత్థామ`పై దృష్టి పెట్టడంతో మూడో భాగంపై సస్పెన్స్ అలాగే ఉంది. ఇక సరిగ్గా ఇదే పరిస్థితి ఇండియన్ సినిమా రికార్డులను తిరగరాసిన `బాహుబలి 3` విషయంలోనూ కనిపిస్తోంది. ఈ సినిమా వస్తుందనే ప్రచారాలు జోరుగా సాగుతున్నా.. రాజమౌళి గానీ, విజయేంద్ర ప్రసాద్ గానీ దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

పాన్-ఇండియా స్థాయిలో సంచలనాలు సృష్టించిన `పుష్ప 3`.. `కేజీఎఫ్ 3` పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. సుకుమార్ ప్రస్తుతం వేరే ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉండటంతో `పుష్ప 3` ఉంటుందని అందరూ అంటున్నా.. అది ఎప్పుడు పట్టాలెక్కుతుందనేది క్లారిటీ లేదు. అలాగే `కేజీఎఫ్ 2` తర్వాత ప్రశాంత్ నీల్ తో కలిసి యష్ మూడో భాగం చేస్తారా లేదా అనే దానిపై కూడా రకరకాల ఊహాగానాలున్నాయి. ఒకవైపు యష్ ఇతర ప్రయోగాలతో బిజీగా ఉండగా.. మరోవైపు ప్రశాంత్ నీల్ కూడా కొత్త ప్రాజెక్ట్‌లపై ఫోకస్ పెట్టారు. దీంతో `కేజీఎఫ్ 3` గురించి కూడా కాలమే సమాధానం చెప్పాల్సి ఉంది.

ఇక `కాంతార` ఫ్రాంచైజీ విషయానికి వస్తే, `కాంతార: చాప్టర్ 1` అంటూ రిషబ్ శెట్టి ప్రీక్వెల్‌తో వచ్చి విజ‌యం సాధించిన తర్వాత `కాంతార 3` ఉంటుందా లేదా అనేదానిపై ఆయన ఇప్పటివరకు ఎలాంటి అధికారిక కన్ఫర్మేషన్ ఇవ్వలేదు. స్థానిక సంస్కృతులు, దైవిక అంశాలతో సాగే ఈ కథను ముందుకు తీసుకెళ్లడంలో ఉన్న సవాళ్లు రిషబ్ శెట్టిని ఆలోచనలో పడేశాయని చెప్పవచ్చు. హాలీవుడ్ మేకర్స్ మాదిరిగా భవిష్యత్ ప్రాజెక్ట్‌లన్నింటినీ ముందే డిక్లేర్ చేసే తెగింపు మన దర్శక-నిర్మాతలు ప్రదర్శించకపోవడానికి కారణం... బాక్సాఫీస్ వద్ద వచ్చే ఫలితాలపై ఉండే భయమే అని చెప్పాలి.

మొత్తానికి బాక్సాఫీస్ లెక్కలు.. ప్రేక్షకుల అంచనాలు.. మారిన సమీకరణాల మధ్య మన టాలెంటెడ్ డైరెక్టర్లంతా సీక్వెల్స్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఫ్రాంఛైజీల మూడో భాగాల కోసం వెండితెరపై మ్యాజిక్ చూడాలని అభిమానులు ఎంతగా పరితపిస్తున్నా.. మేకర్స్ మాత్రం గోప్యత పాటిస్తూ సస్పెన్స్ కొనసాగిస్తున్నారు. మరి ఈ మీమాంశ వీడి ఏ సినిమా మూడో భాగం ముందుగా పట్టాలెక్కుతుందనేది కాలమే తేల్చాలి.