అవతార్ 4 - అవతార్ 5 అవసరం లేదు!
తాజాగా ప్రఖ్యాత క్రిటిక్ కొలిడెర్ విశ్లేషణ ప్రకారం.. ఇకపై ఈ ఫ్రాంఛైజీలో కొత్త సినిమాలు అవసరం లేదు. ఇప్పటికే కథను ముగించేసాడు... అని అన్నాడు.
By: Sivaji Kontham | 23 Dec 2025 1:00 AM ISTలెజెండరీ దర్శకుడు జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన అవతార్ 3 (ఫైర్ అండ్ యాష్) ఇటీవల విడుదలై మిశ్రమ సమీక్షలను అందుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికీ క్రిటిక్స్ ఈ సినిమాని రకరకాల కోణాల్లో విశ్లేషిస్తూనే ఉన్నారు. అవతార్ 1, అవతార్ 2 తరహాలోనే అవతార్ 3 పైనా చాలామంది చాలా రకాలుగా విశ్లేషిస్తున్నారు. కొందరు నెగెటివ్ గా కొందరు పాజిటివ్ గా, చాలా మంది కామెరూన్ ప్రతిభ చూపించిన కొన్ని సీన్ల గురించి, అసాధారణ సాంకేతిక విషయాల గురించి విశ్లేషిస్తూనే ఉన్నారు.
తాజాగా ప్రఖ్యాత క్రిటిక్ కొలిడెర్ విశ్లేషణ ప్రకారం.. ఇకపై ఈ ఫ్రాంఛైజీలో కొత్త సినిమాలు అవసరం లేదు. ఇప్పటికే కథను ముగించేసాడు... అని అన్నాడు. ఇంకా అతడు విశ్లేషిస్తూ... కామెరాన్ ఆశయానికి ఫైర్ అండ్ యాష్ బలమైన నిదర్శనం... సినిమాటిక్ సరిహద్దులను దాటి కొత్త ప్రపంచాన్ని పరిచయం చేయడంలో, బ్లాక్‌బస్టర్ టెంప్లేట్‌ను తిరిగి ఆవిష్కరించడంలో లేదా ఇంత జాగ్రత్తగా కల్పిత ప్రపంచాన్ని నిర్మించడంలో ఏ దర్శకనిర్మాత కూడా కామెరూన్ అంత గొప్పవాడు కాడు. ది టెర్మినేటర్, ఏలియన్స్ ,టెర్మినేటర్ 2: జడ్జిమెంట్ డే , టైటానిక్ వరకు తన కెరీర్ అంతటా అతడు అదే చేశాడు. ప్రేక్షకులు ఏ కథ అయితే ఆకర్షించగలదని భావిస్తాడో దానిని అతడు పదే పదే విస్తరించాడు.
అవతార్‌తోను అతడు అదే చేసాడు. వలసవాదం, పర్యావరణ నిర్వహణ, కుటుంబ బంధాల గురించి ఒక విస్తృతమైన కథను చెప్పడానికి అవతార్ లను తయారు చేసాడు. అయితే కేవలం మూడు చిత్రాలతో ఇది సరిపోతుంది అన్నంతగా చూపించాడు. ప్రతిఘటన.. కుటుంబ ఉద్రిక్తత అన్నీ పూర్తిగా ఇప్పటికే చూపించాడు.
నిజానికి అతడు అవతార్ సిరీస్ కి ఎండ్ కార్డ్ వేసినట్టుగా అనిపిస్తోంది. అతడు అవతార్ 3తో ముగింపును ఇచ్చేసాడు. ఇక కొత్త కొనసాగింపు దీనికి అనవసరం అని విశ్లేషించారు. ఈ మూడో భాగం ముగింపులో దీర్ఘకాలికంగా తవ్వడానికి అవసరమయ్యే ప్రశ్న లేదా పరిష్కారం కాని భావోద్వేగ థ్రెడ్ ఏదీ కనిపించడం లేదు. అందువల్ల కామెరూన్ నుంచి ప్రజలు మరొక సీక్వెల్‌ను కోరుకోవడం లేదు... అని కొలిడెర్ విశ్లేషించారు.
పండోర ఇప్పుడు పూర్తిగా ఊహించిన ప్రపంచం. అది జీవించి ఉన్నట్లు స్పష్టంగా అనిపిస్తుంది. కానీ మూడు భాగాలలో చెప్పిన కథకు ఇప్పటికే దర్శకుడు ముగింపును ఇచ్చేసాడు. అవతార్ 4, అవతార్ 5 ఈ విశ్వాన్ని అంతగా విస్తరించవు.. గత రెండు భాగాల్లో విషయాలను భవిష్యత్ సినిమాలు రిపీట్ చేయలేవు. కామెరాన్ ఎప్పుడూ నిర్దేశించని ప్రపంచాలలోకి అడుగుపెడుతూనే ఉంటాడు. బహుశా ఇప్పుడు అతడు పండోరాను వదిలి వెళ్ళే సమయం ఆసన్నమైంది. కామెరూన్ విఫలమైనందున కాదు.. కానీ అతడు అవతార్‌ను ఇప్పటికే సాధ్యమైనంత లోతుగా చూపించేసాడు. ఇక చూపించడానికి ఏమీ లేనంతగా... అందుకే ఇక తదుపరి భాగాలు అవసరం లేదు! అని విశ్లేషించారు.