వరుసగా మూడో ఆస్కార్.. VFXలో ఎదురేలేదని నిరూపించిన అవతార్ ఫ్రాంఛైజీ
ఆస్కార్స్ 2026 వేదికపై జేమ్స్ కామెరూన్ విజువల్ వండర్ `అవతార్: ఫైర్ అండ్ యాష్` (అవతార్ 3) సాంకేతిక విభాగంలో సత్తా చాటింది.
By: Sivaji Kontham | 16 March 2026 7:00 PM ISTఆస్కార్స్ 2026 వేదికపై జేమ్స్ కామెరూన్ విజువల్ వండర్ `అవతార్: ఫైర్ అండ్ యాష్` (అవతార్ 3) సాంకేతిక విభాగంలో సత్తా చాటింది. ప్రతిష్టాత్మక అవార్డుల వేడుకల్లో ఈ చిత్రం `బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్` విభాగంలో ఆస్కార్ పురస్కారాన్ని కైవసం చేసుకుంది. పండోరా ప్రపంచాన్ని సరికొత్తగా మంటలు బూడిద నేపథ్యంతో భారీ విజువలైజేషన్ తో వెండితెరపై ఆవిష్కరించినందుకు గానూ అకాడమీ ఈ అవార్డుతో గౌరవించింది. అయితే గత భాగాలతో పోలిస్తే ఈసారి అవతార్ కేవలం ఒక్క విభాగంలోనే అవార్డు సాధించడం గమనార్హం.
అవతార్ సిరీస్ ప్రయాణాన్ని గమనిస్తే... వసూళ్లు తగ్గినట్టే అవార్డుల సంఖ్య కూడా క్రమక్రమంగా తగ్గుతూ వస్తోంది. 2009లో విడుదలైన మొదటి `అవతార్` చిత్రం విజువల్ ఎఫెక్ట్స్, ఆర్ట్ డైరెక్షన్, సినిమాటోగ్రఫీ వంటి విభాగాల్లో ఏకంగా మూడు ఆస్కార్లను గెలుచుకుని చరిత్ర సృష్టించింది. ఆ తర్వాత వచ్చిన `అవతార్: ది వే ఆఫ్ వాటర్`' (అవతార్ 2) కేవలం బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో మాత్రమే ఆస్కార్ గెలుచుకుంది. ఇప్పుడు మూడవ భాగం కూడా అదే బాటలో పయనిస్తూ ఒకే ఒక్క అవార్డుకు పరిమితం కావడం.. ఈ ఫ్రాంచైజీపై ఉన్న అంచనాలు తగ్గడమే గాక అకాడమీ గుర్తింపు కూడా తగ్గుముఖం పట్టిందా? అనే చర్చకు దారితీసింది.
వసూళ్ల పరంగా కూడా అవతార్ సిరీస్‌లో డౌన్ ఫాల్ కనిపిస్తోంది. మొదటి భాగం సృష్టించిన సంచలనం.. రెండో భాగం రాబట్టిన కలెక్షన్లతో పోలిస్తే.. మూడో భాగం బాక్సాఫీస్ వద్ద ఆ స్థాయిలో మ్యాజిక్ చేయలేకపోయిందనే చెప్పాలి. ఒకవైపు అవార్డులు.. మరోవైపు వసూళ్లు తగ్గుతూ ఉండటం జేమ్స్ కామెరూన్ అభిమానులను కొంత ఆందోళనకు గురిచేస్తోంది. అయితే విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో ఈ చిత్రానికి సాటిలేదని మరోసారి నిరూపితమైంది.
అవతార్, అవతార్ 2, అవతార్ 3 మూడు చిత్రాలకు వరుసగా విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో ఆస్కార్ పురస్కారాలు దక్కడం ఆసక్తికరం.
ఇక ఆస్కార్స్ 2026లో `సిన్నర్స్` చిత్రం అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ సినిమా `బెస్ట్ ఒరిజినల్ స్కోర్`, `బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే` విభాగాల్లో అవార్డులను గెలుచుకుని మెరుపులు మెరిపించింది. ర్యాన్ కూగ్లర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మైఖేల్ బి. జోర్డాన్ ప్రధాన పాత్రలో నటించారు. హాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ వార్నర్ బ్రదర్స్ నిర్మించిన ఈ చిత్రం.. అవతార్ వంటి భారీ చిత్రాల మధ్య తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది.
`అవతార్ 4` ఉందా లేదా?
`అవతార్ 3` ఆశించిన స్థాయిలో అవార్డులు గెలవకపోయినా ఫర్వాలేదు.. కానీ `అవతార్ 4` పై సందిగ్ధత లేకుండా కామెరూన్ స్పష్ఠమైన ప్రకటన ఇవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు. అయితే ఈ వార్తలతో సంబంధం లేకుండా జేమ్స్ కామెరూన్ ఇప్పటికే నాలుగో భాగం పనులను వేగవంతం చేశారని తెలుస్తోంది. తాజా అప్‌డేట్ ప్రకారం `అవతార్ 4` కు సంబంధించి కొంత భాగం షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. మూడో భాగం విడుదలైన తర్వాత వచ్చే గ్యాప్‌ను భర్తీ చేసేలా.. నాలుగో భాగం కోసం కామెరూన్ సరికొత్త టెక్నాలజీని వాడుతున్నట్లు సమాచారం.
అవతార్ ఫ్రాంచైజీలో మునుముందు రానున్న సినిమాలకు కథాంశం పరంగా మరింత లోతు ఉంటుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆస్కార్ వేదికపై పురస్కారాల సంఖ్య తగ్గినప్పటికీ సాంకేతికంగా సినిమాను మరో మెట్టు ఎక్కించే ప్రయత్నంలో ఆయన నిమగ్నమయ్యారు. `అవతార్ 4` షూటింగ్ అప్‌డేట్స్ ప్రకారం.. ఈ చిత్రం పండోరా ప్రపంచంలో ఒక సుదీర్ఘ కాల పరిమితి (అంటే చాలా ఏళ్ల క్రితం.. లేదా కొన్నేళ్ల పాటు అడ్వాన్స్ డ్గా కనిపించే అవతార్ ల లోకం)ని చూపించబోతోందని తెలుస్తోంది. ఇది ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించనుంది.
