చాలామందికి నచ్చనిది రాజమౌళికి ఎలా నచ్చింది?
ప్రపంచవ్యాప్తంగా ఉన్న `అవతార్` ఫ్యాన్స్ ఎంతో ఉత్కంఠగా వేచి చూస్తున్న ఈ క్షణం, `అవతార్: ఫైర్ అండ్ యాష్` విడుదలైంది.
By: Sivaji Kontham | 18 Dec 2025 1:00 AM ISTప్రపంచవ్యాప్తంగా ఉన్న `అవతార్` ఫ్యాన్స్ ఎంతో ఉత్కంఠగా వేచి చూస్తున్న ఈ క్షణం, `అవతార్: ఫైర్ అండ్ యాష్` విడుదలైంది. భారతదేశంలో ఈనెల 19 నుంచి అందుబాటులోకి వస్తున్న ఈ చిత్రం అమెరికా సహా ప్రపంచ దేశాలలో క్రిటిక్స్ కోసం కొన్ని షోస్ వేసారట. ప్రముఖ మీడియా సంస్థలు `అవతార్`ని సమీక్షించాయి. అయితే ఈ సమీక్షల్లో మెజారిటీ సంస్థలు తీవ్రంగా విమర్శించాయి.
ప్రఖ్యాత `రోటెన్ టమోటాస్` అన్ని అవతార్ లలో ఇదే చెత్త సినిమా అని కామెంట్ చేయగా, సుదీర్ఘ నిడివి ఉన్న ఈ సినిమాని భరించడం కష్టమని ది గార్డియన్, బీబీసీ లాంటి మీడియా సంస్థలు తమ రివ్యూల్లో తేల్చేసాయి. చాలా మంది విమర్శకులు ఈ మూడో భాగం నిడివి విసుగు తెప్పించిందని అన్నారు. రిపీటెడ్ సన్నివేశాలు చూస్తున్నట్టుగా ఉందని కూడా వ్యాఖ్యానించారు.
అయితే వీళ్లందరి రివ్యూల కంటే ప్రపంచం దృష్టిని ఆకర్షించిన మరో రివ్యూ ఎస్.ఎస్.రాజమౌళి నుంచి వచ్చింది. అవతార్ ఫైర్ అండ్ యాష్ చూసి థియేటర్ల నుంచి బయటకు వచ్చాక కూడా అది తనను వెంటాడుతోందని రాజమౌళి వ్యాఖ్యానించారు. కామెరూన్ తో వర్చువల్ వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడిన రాజమౌళి సమీక్ష ఇలా ఉంది. ``ఫైర్ అండ్ యాష్ చూడటం ఒక అద్భుతమైన అనుభూతి. ఆ సంక్లిష్టమైన సన్నివేశాలు, విజువల్స్, అద్భుత పాత్రలను సృష్టించినందుకు మీకు హ్యాట్సాఫ్. విండ్ ట్రేడర్స్, యాష్ పీపుల్ .. కొత్త పాత్రలను చూస్తున్నప్పుడు థియేటర్‌లో నేను ఒక చిన్నపిల్లవాడిలా ఉన్నాను. వరాంగ్ అద్భుతంగా ఉంది. నేను థియేటర్ నుండి తిరిగి వచ్చిన తర్వాత కూడా మీ సినిమా నా మనసులో నుండి పోలేదు. నన్ను నిజంగా ఆకట్టుకున్నది జేక్ నైతిక సందిగ్ధత! మొదటి అవతార్‌లో అది ఆకట్టుకుంది.. దాన్ని అతడు ఎప్పుడైనా అధిగమించగలడా? అని నేను అనుకున్నాను? కానీ ఇందులో అది చాలా బలంగా ఉందని నేను అనుకుంటున్నాను`` అని అన్నారు.
భారీ అంచనాల నడుమ `అవతార్ 3` భారతదేశంలో ఈ శుక్రవారం నాడు విడుదలవుతోంది. అయితే ఈ చిత్రం వీక్ సమీక్షల కారణంగా ఓపెనింగులు అంతంత మాత్రంగానే ఉన్నాయని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ధురందర్ బాక్సాఫీస్ వద్ద అప్రతిహతంగా దూసుకుపోతోంది. ఈ సమయంలో `అవతార్: ఫైర్ అండ్ యాష్` టికెట్ గేమ్‌లో రణవీర్ సింగ్ సినిమా వేగాన్ని తగ్గించగలదా లేదా అనేది చూడటానికి అందరూ ఆసక్తిగా ఉన్నారు.
అంతర్జాతీయ సమీక్షలు ఇప్పటికే నెగెటివ్ గా ఉన్నాయి. ఈ మూడో చిత్రానికి పేలవమైన స్పందన లభించింది. అవతార్: ఫైర్ అండ్ యాష్ గురించి భారతీయ విమర్శకులు ఏమి చెబుతారో వేచి చూడాలి. ప్రస్తుతానికి ఇది రాజమౌళి మనసు దోచింది. జేమ్స్ కామెరూన్ పై తన అభిమానాన్ని జక్కన్న అస్సలు దాచుకోలేకపోయారు. కామెరూన్ పై అభిమానంతో అవతార్ 3 కి పాజిటివ్ రివ్యూ ఇచ్చారా? నిజాయితీగా ఆయన మనసును అవతార్ 3 గెలుచుకుందా? అన్నది మరో 24 గంటల తర్వాత లోకల్ సమీక్షలతో తేలిపోతుంది.
