యానిమేషన్ రికార్డుల్ని అయినా కొట్టలేదు!
అవతార్ -ఫైర్ అండ్ యాష్ బాక్సాఫీస్ వద్ద ఆశించినంత దూకుడును కనబరచలేదు.
By: Sivaji Kontham | 22 Dec 2025 11:28 AM ISTజేమ్స్ కామెరూన్ `అవతార్` ఫ్రాంఛైజీలో మొదటి రెండు భాగాలు కలిపి 5 బిలియన్లు వసూలు చేయడం ఒక సంచలనం. తొలి రెండు చిత్రాలు ఒక్కొక్కటి 2 బిలియన్లు పైగా వసూలు చేసాయి. అయితే అవతార్ 3 విషయంలో అలాంటి మ్యాజిక్ జరగకపోవడం తీవ్రంగా నిరాశపరుస్తోంది. నిజానికి ప్రమోషన్స్ లో అవతార్ 1, అవతార్ 2 రెండిటిని కలిపితే ఎంత భారీ తనం ఉంటుందో అంతకుమించి భారీ విజువలైజేషన్ ప్రజల్ని అబ్బురపరుస్తుందని కామెరూన్ అన్నారు. కానీ `అవతార్ 3` చూశాక క్రిటిక్స్ పెదవి విరిచేసారు. కామెరూన్ చిత్రానికి ఊహించని విధంగా మిశ్రమ స్పందనలు వ్యక్తమయ్యాయి.
అవతార్ -ఫైర్ అండ్ యాష్ బాక్సాఫీస్ వద్ద ఆశించినంత దూకుడును కనబరచలేదు. ఈ సినిమా ముందస్తు హైప్ దృష్ట్యా భారీ ఓపెనింగులు సాధిస్తుందని భావించినా కానీ అది సాధ్యపడలేదు. కనీసం యానిమేషన్ సినిమా రికార్డును కూడా ఈ ఏడాది ఈ చిత్రం బ్రేక్ చేయలేకపోయిందని ట్రేడ్ విశ్లేషిస్తోంది. అవతార్: ఫైర్ అండ్ యాష్ మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 137 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. యానిమేషన్ చిత్రం జూటోపియా 2 డే1 అద్భుత వసూళ్లను సాధించగా, అవతార్ ఆ రికార్డును అధిగమించడంలో చతికిలబడింది. ఇటీవల విడుదలైన జూటోపియా 150 మిలియన్ డాలర్ల ఓపెనింగ్‌తో పోలిస్తే అవతార్ 3 ఏకంగా 15 మిలియన్ డాలర్ల వసూళ్లు తక్కువగా సాధించింది. ఇది నిజంగా ఆశ్చర్యకరమైన మలుపు. అవతార్ కి క్రేజ్ తగ్గిందని ఇది నిరూపిస్తోంది.
అవతార్3 ప్రీమియర్‌లు కలుపుకుని మొదటి రోజు అమెరికాలో 36 మిలియన్ డాలర్లు మాత్రమే వసూలు చేయడం అతిపెద్ద నిరాశ. ఒక రకంగా విదేశాలలోనే అవతార్- 3 ఉత్తమం అనిపించింది. అమెరికాయేతర దేశాల నుంచి ఇది 100 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. అవతార్ ఫ్రాంఛైజీలో పార్ట్ 2 ది వే ఆఫ్ వాటర్స్ లో సగం వసూళ్లను కూడా అవతార్ 3 సాధించలేకపోవడం నిరాశపరిచింది. అవతార్ 2 చిత్రం 2022లో విడుదలై 441 మిలియన్ డాలర్ల ఓపెనింగ్ ని సాధించింది.
అవతార్ 3 పై కామెరూన్ నమ్మకం నిజం కాలేదని తాజా గణాంకాలు చెబుతున్నాయి. ఈ సినిమాకి అమెరికన్ క్రిటక్స్ తీవ్రమైన నెగెటివిటీని నూరిపోయడం మైనస్ అయింది. భారతదేశంలో క్రిటిక్స్ విమర్శించినా కానీ, అవతార్ కి రెండు రోజుల్లో 45 కోట్లు వసూళ్లు కట్టబెట్టారు. ఇండియాలో 100 కోట్ల క్లబ్ లో అడుగుపెడుతుందని అంచనా వేస్తున్నారు. అయితే అవతార్ 1, అవతార్ 2 చిత్రాలకు ఉన్నంత క్రేజ్ ఇండియాలో కూడా లేదు.
