Begin typing your search above and press return to search.

అవ‌తార్ -3 ఓటీటీకి.. అవ‌తార్ 4 - అవ‌తార్ 5 రిలీజ్‌పై క్లారిటీ

అవతార్ ఫ్రాంఛైజీలో అవ‌తార్ 3 అత్యంత త‌క్కువ వ‌సూళ్లు సాధించిన సినిమాగా విమ‌ర్శ‌కుల నుంచి తీవ్ర విమ‌ర్శ‌ల్ని ఎదుర్కొంది.

By:  Sivaji Kontham   |   25 March 2026 9:11 AM IST
అవ‌తార్ -3 ఓటీటీకి.. అవ‌తార్ 4 - అవ‌తార్ 5 రిలీజ్‌పై క్లారిటీ
X

అవతార్ ఫ్రాంఛైజీలో అవ‌తార్ 3 అత్యంత త‌క్కువ వ‌సూళ్లు సాధించిన సినిమాగా విమ‌ర్శ‌కుల నుంచి తీవ్ర విమ‌ర్శ‌ల్ని ఎదుర్కొంది. అయినా అవ‌తార్ 4, అవ‌తార్ 5 చిత్రీక‌ర‌ణ‌లు ఆగ‌డం లేదు. జేమ్స్ కామెరూన్ త‌న ప్ర‌ణాళిక‌ల్లో తాను ఉన్నాడు. అవ‌తార్ 4 , అవ‌తార్ 5 చిత్రాల‌ను ఎప్పుడు విడుద‌ల చేయాలో ఇప్ప‌టికే అత‌డి నుంచి స్ప‌ష్ఠ‌త వ‌చ్చేసింది. అవ‌తార్ 3ని ఇప్పుడు ఓటీటీలోకి కూడా వ‌దుల్తున్నారు... పూర్తి వివ‌రాల్లోకి వెళితే.....

ప్రపంచ ప్రఖ్యాత దర్శకుడు జేమ్స్ కామెరాన్ విజువల్ వండర్ `అవతార్` సిరీస్ నుంచి వచ్చిన మూడవ భాగం `అవతార్: ఫైర్ అండ్ ఆష్`(అవ‌తార్ 3) ఇప్పుడు డిజిటల్ లో అందుబాటులోకి రానుంది. 31 మార్చి 2026 నుండి ఓటీటీ వేదిక‌పై ఇది సందడి చేయనుంది. తొలుత అమెజాన్ ప్రైమ్ వీడియో, ఆపిల్ టీవీ వంటి వేదికల్లో ప్రీమియం వీడియో ఆన్ డిమాండ్ పద్ధతిలో ఇది అందుబాటులోకి రానుంది. అంటే సినిమాను కొనుగోలు చేసి లేదా అద్దెకు తీసుకుని వీక్షించవచ్చు. ఇక భారతీయ ప్రేక్షకుల కోసం జియోహాట్‌స్టార్ ఈ హక్కులను సొంతం చేసుకోగా.. ఏప్రిల్ నుండి జూన్ మధ్య కాలంలో సాధారణ సబ్‌స్క్రైబర్లందరికీ ఇది అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

అవ‌తార్ 3 చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా 12400 కోట్లు అంటే సుమారు 1.48 బిలియన్ డాలర్లు వ‌సూలు చేసింది. ఫ్రాంఛైజీలో గత భాగాలతో పోలిస్తే ఇది తక్కువ వసూళ్లు సాధించిన చిత్రంగా విమర్శలను ఎదుర్కొన్నా.. జేమ్స్ కామెరాన్ ఖాతాలో వరుసగా నాలుగవ `బిలియన్ డాలర్` చిత్రంగా రికార్డు సృష్టించింది. భారత్‌లో కూడా ఈ సినిమా సుమారు 225 కోట్ల గ్రాస్ వసూళ్లతో క్లీన్ హిట్గా నిలిచింది. 400 మిలియన్ డాలర్ల భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 3 సినిమాల్లో ఒకటిగా నిలవడం విశేషం.

ఈ మూడవ భాగంలో పండోరా ప్రపంచంలోని సరికొత్త ముఖాన్ని కామెరాన్ ఆవిష్కరించారు. యాష్ ప్ర‌జ‌ల పేరుతో దూకుడు స్వభావం కలిగిన నావి తెగను పరిచయం చేస్తూ కథను అగ్నిపర్వత ప్రాంతాల నేపథ్యానికి మళ్లించారు. ఇది భావోద్వేగాల స‌మ్మేళ‌నంగా సాగే విజువ‌ల్ ట్రీట్. విజువల్ ఎఫెక్ట్స్ పరంగా ఎప్పటిలాగే తన మార్క్ చూపిస్తూ 98వ అకాడమీ అవార్డ్స్‌లో `బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్` విభాగంలో ఈ సినిమా ఆస్కార్ అవార్డును కూడా దక్కించుకుంది.

3 గంటల 15 నిమిషాల నిడివితో ప్రేక్షకులను మైమరపించిన ఈ చిత్రం ఓటీటీలో తెలుగు, హిందీ, తమిళ భాషల్లోనూ అందుబాటులో ఉంటుంది. ఓటీటీలో విడుదలయ్యే డిజిటల్ వెర్షన్ కొనుగోలు చేసే వారికి మేకర్స్ ఒక ప్రత్యేక బహుమతిని అందిస్తున్నారు. సినిమాతో పాటు సుమారు మూడు గంటల నిడివి గల అదనపు `బిహైండ్ ది సీన్స్` వీడియోలను బోనస్ కంటెంట్‌గా జోడించారు. ఇది సినిమా మేకింగ్‌ను ఇష్టపడే వారికి గొప్ప అనుభూతినిస్తుంది. అంతేకాకుండా 19 మే 2026న ఈ చిత్రం 4కే అల్ట్రా హెచ్‌డి, బ్లూ-రే, డీవీడీ రూపంలో ఫిజికల్ కాపీలుగా కూడా మార్కెట్లోకి రానుంది. తద్వారా ఈ విజువల్ వండర్‌ను అత్యున్నత నాణ్యతతో హోమ్ థియేటర్లలో ఆస్వాధించే అవకాశం లభిస్తుంది.

అవతార్ 3 వసూళ్లపై వస్తున్న విమర్శలను పక్కన పెట్టి జేమ్స్ కామెరాన్ తన తదుపరి ప్రాజెక్టులపై దృష్టి సారించారు. ఇప్పటికే అవతార్ 4, అవతార్ 5 చిత్రాల విడుదల తేదీలపై పూర్తి స్పష్టత వచ్చేసింది. ప్లాన్ ప్రకారం అవతార్ 4 డిసెంబర్ 2029లో , అవతార్ 5 డిసెంబర్ 2031లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నాయి. చిత్రీకరణలు ఏమాత్రం ఆగకుండా సాగుతుండటంతో పండోరా ప్రపంచంలోని మరిన్ని అద్భుతాలను మునుముందు ప్రేక్షకులు చూడబోతున్నారన్నమాట.