Begin typing your search above and press return to search.

అవ‌తార్ 4- అవ‌తార్ 5 బ‌డ్జెట్ త‌గ్గింపు.. షాక్‌లో కామెరూన్ ఫ్యాన్స్!

హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరూన్ సృష్టించిన విజువల్ వండర్ `అవతార్` సిరీస్ ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి సంచలనాలు సృష్టించిందో అందరికీ తెలిసిందే.

By:  Sivaji Kontham   |   18 May 2026 4:00 AM IST
అవ‌తార్ 4- అవ‌తార్ 5 బ‌డ్జెట్ త‌గ్గింపు.. షాక్‌లో కామెరూన్ ఫ్యాన్స్!
X

హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరూన్ సృష్టించిన విజువల్ వండర్ `అవతార్` సిరీస్ ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి సంచలనాలు సృష్టించిందో అందరికీ తెలిసిందే. గత ఏడాది (2025 డిసెంబర్‌లో) విడుదలైన ఈ ఫ్రాంచైజీ మూడో భాగం `అవతార్: ఫైర్ అండ్ యాష్` బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించడమే కాకుండా క్రూరమైన `మాంగ్‌క్వాన్` నావి తెగను పరిచయం చేసి ప్రేక్షకులను అలరించింది. అయితే అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తదుపరి భాగాలు `అవతార్ 4`, `అవతార్ 5` చిత్రాల విడుదల.. నిర్మాణానికి సంబంధించి కామెరూన్ తాజాగా తీసుకున్న యూటర్న్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది.

ది ఎంపైర్ ఫిల్మ్ పాడ్‌కాస్ట్‌లో జేమ్స్ కామెరూన్ మాట్లాడుతూ.. నాలుగో, ఐదో భాగాలను పట్టాలెక్కించడానికి తామింకా ఒక స్పష్టమైన మార్గాన్ని వెతకాల్సి ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతానికి తాను ఇతర ప్రాజెక్టుల స్క్రిప్ట్ వర్క్‌లో బిజీగా ఉన్నానని చెబుతూనే `అవతార్` లాంటి భారీ బడ్జెట్ సినిమాలను మరింత సమర్థవంతంగా.. తక్కువ ఖర్చుతో ఎలా తీయాలో కొత్త టెక్నాలజీపై పరిశోధనలు చేస్తున్నట్లు వెల్లడించారు. తక్కువ సమయంలో కేవలం మూడింట రెండు వంతుల బడ్జెట్‌తో ఈ చిత్రాలను పూర్తి చేయడమే నా లక్ష్యం. దీనికోసం మాకు కనీసం ఏడాది సమయం పడుతుంది! అని ఆయన వ్యాఖ్యానించడం చూస్తుంటే ప్రాజెక్ట్ మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది.

అయితే ఈ సుదీర్ఘ నిరీక్షణ సమయంలో జేమ్స్ కామెరూన్ కొన్ని కీలకమైన తప్పులు చేయకుండా జాగ్రత్తపడాలి. అందులో మొదటిది- విడుదల తేదీల వాయిదా. ఇప్పటికే `అవతార్ 4` డిసెంబర్ 2029 కి, `అవతార్ 5` డిసెంబర్ 2031 కి షెడ్యూల్ చేసారు. పార్ట్-1 నుంచి పార్ట్-2 కి 13 ఏళ్ల సుదీర్ఘ విరామం వచ్చింది. ఇప్పుడు బడ్జెట్ తగ్గింపు, టెక్నాలజీ రీసెర్చ్ పేరుతో ఈ తేదీలను మరింత ముందుకు జరిపితే ప్రేక్షకులలో ఈ ఫ్రాంచైజీపై ఉన్న ఆసక్తి - హైప్ కూడా పూర్తిగా తగ్గిపోయే ప్రమాదం ఉంది. సమయాన్ని ఆదా చేయాలనుకుంటూ ప్రాజెక్ట్‌ను లేట్ చేయడం కామెరూన్ చేయకూడని మొదటి తప్పు.

రెండవది బడ్జెట్ పరిమితుల కోసం క్వాలిటీతో రాజీ పడటం. అవతార్ సిరీస్ అంటేనే కళ్ళు చెదిరే విజువల్స్, అద్భుతమైన మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ. ఖర్చును మూడింట ఒక వంతు తగ్గించే ప్రయత్నంలో గ్రాఫిక్స్ నాణ్యత లేదా విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో ఎక్కడా రాజీ పడకూడదు. ఒకవేళ విజువల్స్ క్వాలిటీ తగ్గితే.. అవతార్ మార్కెట్ దెబ్బతింటుంది. అలాగే మూడవ తప్పు ``లాభాల కోసమే సినిమాను నిలిపివేయాలని ఆలోచించడం``. మూడో భాగం తర్వాత ఈ గ్రేట్ ఎపిక్ సాగా కొనసాగుతుందో లేదో లాభాలను బట్టి చూస్తామని.. ప్రెస్ మీట్ పెట్టి ఆపేస్తామని కామెరూన్ అనడం ఫ్యాన్స్ ని హర్ట్ చేస్తోంది. కేవలం బిజినెస్ లెక్కల కోసమే కథను అర్ధాంతరంగా ముగించే తప్పు ఆయన చేయకూడదు.

సామ్ వర్తింగ్టన్, జో సల్దానా, కేట్ విన్స్ లెట్ వంటి భారీ తారాగణంతో కూడిన ఈ విజువల్ సాగాను అనుకున్న సమయానికి అదే ఉత్కంఠభరితమైన కథనంతో అందించడమే ఇప్పుడు కామెరూన్ ముందున్న ప్రధాన సవాలు. ఈ ఫ్రాంచైజీ ఇప్పటివరకు దాదాపు 987 మిలియన్ డాలర్ల మార్కును తాకిన నేపథ్యంలో ఫ్యాన్స్ పల్స్ దెబ్బతినకుండా ఉండాలంటే సాంకేతిక ప్రయోగాల కంటే ముందే కథలోని ఎమోషన్‌ను కాపాడుకోవాల్సి ఉంటుంది. మరి జేమ్స్ కామెరూన్ ఈ తప్పులు దొర్లకుండా చూసుకుని `అవతార్` ముగింపు భాగాలను అనుకున్నట్లుగా వెండితెరపై ఆవిష్కరిస్తారో లేదో చూడాలి.