Begin typing your search above and press return to search.

ఐమ్యాక్స్ కాస్ట్‌లీ గురూ! హైద‌రాబాద్ త‌ట్టుకునేదెలా?

కామెరూన్ తెర‌కెక్కించిన `అవ‌తార్ - ఫైర్ అండ్ యాష్` ఈ శుక్ర‌వారం దేశ‌వ్యాప్తంగా విడుద‌లైన సంగ‌తి తెలిసిందే.

By:  Sivaji Kontham   |   20 Dec 2025 8:00 AM IST
ఐమ్యాక్స్ కాస్ట్‌లీ గురూ! హైద‌రాబాద్ త‌ట్టుకునేదెలా?
X

కామెరూన్ తెర‌కెక్కించిన `అవ‌తార్ - ఫైర్ అండ్ యాష్` ఈ శుక్ర‌వారం దేశ‌వ్యాప్తంగా విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. మిశ్ర‌మ స‌మీక్ష‌ల కార‌ణంగా ఓపెనింగులు అంతంత మాత్రంగానే ఉన్నాయి. అయితే అవ‌తార్ అభిమానులు మాత్రం ఈ సినిమాని ఎలాగైనా పెద్ద స్క్రీన్ పై చూడాల‌ని ఆరాట‌ప‌డుతున్నారు. నిజానికి `అవ‌తార్-3డి` చిత్రాన్ని హైద‌రాబాద్ ప్ర‌సాద్స్ ఐమ్యాక్స్ లోని లార్జ్ స్క్రీన్ లో వీక్షించిన ప్ర‌జ‌లు దానిని అంత తేలిగ్గా మ‌ర్చిపోలేరు. ఆ సినిమా మ‌హదాద్భుతం..విజువ‌ల్ వండ‌ర్. పండోరా గ్ర‌హాన్ని 3డిలో వీక్షించిన అనుభ‌వాన్ని ఇప్ప‌టికీ ప్రేక్ష‌కులు అంత తేలిగ్గా మ‌ర్చిపోలేరు. ఆ త‌ర్వాత అదే ఐమ్యాక్స్ లార్జ్ స్క్రీన్ లో సినిమాల‌ను వీక్షించ‌డానికి ఆడియెన్ పోటీప‌డ్డారు.

అయితే ప్ర‌సాద్స్ య‌జ‌మానులు ఐమ్యాక్స్ లార్జ్ స్క్రీన్ మెయింటెనెన్స్ ని భారంగా భావించడంతో దానిని తొల‌గించార‌ని క‌థ‌నాలొచ్చాయి. లైసెన్సింగ్ స‌హా దానికోసం స్క్రీన్ ఏర్పాటు, మెయింటెనెన్స్ వ‌గైరా వ‌గైరా భారీ ఖ‌ర్చుతో కూడుకున్న‌వి కావ‌డంతో ప్ర‌సాద్స్ నుంచి ఐమ్యాక్స్ ని తొల‌గించార‌ని క‌థ‌నాలొచ్చాయి. కానీ అవ‌తార్ 3 రిలీజ్ సంద‌ర్భంగా తిరిగి హైద‌రాబాద్ కి ఐమ్యాక్స్ వ‌చ్చేది ఎప్ప‌టికి? అన్న చ‌ర్చా సాగుతోంది. హైద‌రాబాద్ న‌గ‌రంలో ఏషియ‌న్ సినిమాస్ తో క‌లిసి మ‌హేష్‌, అల్లు అర్జున్ లాంటి స్టార్లు మ‌ల్టీప్లెక్సుల‌ను నిర్మించారు. భ‌విష్య‌త్ లో మ‌రిన్ని మ‌ల్టీప్లెక్సుల‌ను కూడా ప్రారంభించ‌బోతున్నారు. అందుకే హైద‌రాబాద్ లో ఐమ్యాక్స్ ని తిరిగి రీలాంచ్ చేస్తార‌ని తెలుగు ఆడియెన్ ఎంతో ఉత్కంఠ‌గా వేచి చూస్తున్నారు.

అయితే హైద‌రాబాద్ లో ఐమ్యాక్స్ ని ప్రారంభిస్తే, దాని టికెట్ ధ‌ర‌లు చుక్క‌ల్ని అంటుతాయన్న చ‌ర్చా సాగుతోంది. థియేట‌ర్ నిర్వ‌హ‌ణా భారాన్ని మోయాలంటే, ఆ మేర‌కు ప్రేక్ష‌కుల‌పై టికెట్ భారాన్ని మోపాల్సి ఉంటుంద‌ని కూడా విశ్లేషిస్తున్నారు. నిజానికి బెంగ‌ళూరులో ని ఓ ఐమ్యాక్స్ స్క్రీన్ పై అవ‌తార్ 3 సినిమా చూడ‌టానికి ఏకంగా టికెట్ కు 1750 ధ‌ర‌ను పెట్టారంటే అర్థం చేసుకోవ‌చ్చు. అయితే అవ‌తార్ రిలీజైన మొద‌టివారంలో ఈ ధ‌ర‌ల పెరుగుద‌ల వ‌ర్తిస్తుంది. వారం త‌ర్వాత తిరిగి ధ‌ర‌లు త‌గ్గే వీలుంది. ఇప్పుడు మ‌హేష్‌- రాజ‌మౌళి వార‌ణాసి వ‌చ్చేప్ప‌టికి హైద‌రాబాద్ లో తిరిగి ఐమ్యాక్స్ స్క్రీన్ ని ప్రారంభించ‌దలిస్తే, ఆ సినిమా టికెట్ ధ‌ర‌లు కూడా చుక్క‌ల్ని తాక‌డం ఖాయ‌మ‌ని అంచ‌నా వేస్తున్నారు. అలాగే ఐమ్యాక్స్ ప్రారంభ‌మైతే, ఆ థియేట‌ర్ కి అవ‌స‌ర‌మ‌య్యే కంటెంట్ ని అధికంగా ఉత్ప‌త్తి చేయ‌డం కూడా అవ‌స‌రం. టాలీవుడ్ ఇటీవ‌ల కొత్త ద‌శ‌లో ప్ర‌వేశించింది... హాలీవుడ్ కి ధీటుగా సినిమాల‌ను తీయ‌ల‌నే క‌సి ఇక్క‌డ క‌నిపిస్తోంది. దీనివ‌ల్ల భ‌విష్యత్ లో ఐమ్యాక్స్ ల ఎదుగుద‌ల‌కు అవ‌స‌ర‌మ‌య్యే ప‌రిస్థితులు ఉంటాయ‌ని అంచ‌నా వేస్తున్నారు.

బెంగళూరులో ఐదు ఐమాక్స్ స్క్రీన్లు ఉండ‌గా, చెన్నై, దిల్లీ, ముంబై, పూణే లాంటి చోట్లా విరివిగి ఐమ్యాక్స్ స్క్రీన్లు ఉన్నాయి. క‌నీసం హైద‌రాబాద్ వాసులు అవ‌తార్ 3 ని ఐమ్యాక్స్ లో వీక్షించేందుకు అవ‌కాశం లేక‌పోయినా మ‌హేష్ -రాజ‌మౌళి కాంబినేష‌న్ క్రేజీ మూవీ `వారణాసి 3` రిలీజ్ స‌మ‌యానికి అయినా ఆ కోరిక నెర‌వేరుతుంద‌ని వేచి చూస్తున్నారు.