Begin typing your search above and press return to search.

'అవ‌తార్ 3'పై క్రిటిక్స్ ఏమ‌న్నారు?

జేమ్స్ కామెరూన్ తెర‌కెక్కించిన అవ‌తార్ ఫ్రాంఛైజీ సంచ‌ల‌నాల గురించి తెలిసిందే. మొద‌టి రెండు సినిమాలు సంయుక్తంగా 5 బిలియ‌న్ డాల‌ర్లు వ‌సూలు చేసాయి.

By:  Sivaji Kontham   |   17 Dec 2025 7:26 PM IST
అవ‌తార్ 3పై క్రిటిక్స్ ఏమ‌న్నారు?
X

జేమ్స్ కామెరూన్ తెర‌కెక్కించిన అవ‌తార్ ఫ్రాంఛైజీ సంచ‌ల‌నాల గురించి తెలిసిందే. మొద‌టి రెండు సినిమాలు సంయుక్తంగా 5 బిలియ‌న్ డాల‌ర్లు వ‌సూలు చేసాయి. అయితే ఈ సిరీస్ లో రెండో భాగం ఆశించిన స్థాయికి చేరుకోలేదు. దీంతో ఇప్పుడు పార్ట్ 3 పైనా అంచ‌నాలు అంతంత‌మాత్రంగానే ఉండ‌టంతో దాని ప్ర‌భావం ఓపెనింగుల‌పై ప‌డింది. అయితే అవతార్ ఫ్రాంఛైజీలో మూడో చిత్రం మ‌రింత భారీ యాక్ష‌న్ తో ర‌క్తి క‌ట్టిస్తుంద‌ని, మొద‌టి రెండు అవ‌తార్ ల‌ను క‌లిపినా స‌రిపోనంత భారీత‌నంతో ఉంటుంద‌ని కామెరూన్ వ్యాఖ్యానించ‌డంతో దీనిని అభిమానులు థియేట‌ర్ల‌లో వీక్షించాల‌ని ఆస‌క్తిని క‌న‌బ‌రిచారు.

ఎట్టకేల‌కు అవ‌తార్ `ఫైర్ అండ్ యాష్` థియేట‌ర్ల‌లోకి విడుద‌లైంది. ఇప్ప‌టికే మొదటి సమీక్షలు నెట్ లోకి వ‌చ్చాయి. అయితే అవతార్ 3 పై మిశ్ర‌మ స‌మీక్ష‌లు వ‌చ్చాయి. వీటిలో మెజారిటీ భాగం రివ్యూలు నెగెటివ్ ఫీడ్ బ్యాక్ ని ఇవ్వ‌గా, రేర్‌గా కొంద‌రు పాజిటివ్ రేటింగులు కూడా ఇచ్చారు. ఈ చిత్రానికి రోటెన్ టొమాటోస్ 70శాతం స్కోర్ తో స‌రిపుచ్చింది. రోటెన్ ట‌మోటాస్ నుంచి ఈ ఫ్రాంఛైజీలో లీస్ట్ రేటింగ్ ఇది. దీనిని `హంక్ ఆఫ్ నాన్సెన్స్` లేదా `చెత్త` అని కూడా కొంద‌రు స‌మీక్ష‌కులు కామెంట్ చేసారు. అవతార్ 1 కి రోటెన్ టమోటాస్ 81 శాతం రేటింగును ఇవ్వ‌గా, అవతార్ 2కి 76 శాతం రేటింగును ఇచ్చింది. ఇప్పుడు పార్ట్ 2 కి 70శాతం రేటింగ్ ను మాత్ర‌మే ఇచ్చింది.

ప్ర‌తిష్ఠాత్మ‌క `ది గార్డియన్` ఈ చిత్రానికి 2/5 రేటింగ్ ఇచ్చింది. మూడు గంటల అర్ధంలేని ప్ర‌య‌త్నమ‌ని `ది గార్డియ‌న్` విమ‌ర్శించింది. ఈ మూడో భాగంలో అవ‌తార్ నావి ప్ర‌జ‌లు నిప్పును ఎదుక్కోగా, త‌దుప‌రి రెండు సినిమాలు భూమి లేదా గాలిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. కానీ అవ‌తార్ 3 కి వ‌చ్చిన పూర్ రేటింగ్స్ చూసాక కామెరూన్ నాలుగో భాగం ఐదో భాగం తెర‌కెక్కిస్తారా లేదా? అనే సందేహాల్ని వ్య‌క్తం చేసారు.

BBC అవతార్ 3ని ఫ్రాంచైజీలో ఇప్పటివరకు వచ్చిన వాటిలోకెల్లా అత్యంత సుదీర్ఘ‌మైన చెత్త చిత్రం అని అభివర్ణించింది. 197 నిమిషాల గ్రాఫిక్స్, గజిబిజి సంభాషణలు, అంత‌గా ఆక‌ట్టుకోని కథనం అంటూ విమ‌ర్శించింది.

దీనికి బీబీసీ మ‌రీ దారుణంగా 1/5 రేటింగ్ ను ఇచ్చింది. ఇది ఒక పాత ఆర్కేడ్ గేమ్ లాగా అవాస్తవికంగా ఉంది.. లీనమై చూడ‌టం క‌ష్టంగా ఉంది అని పేర్కొంది. ఇప్ప‌టికే చూసేసిన సినిమాల్లాగా ఉంద‌ని ఇండీ వైర్ విమ‌ర్శించింది. అవ‌తార్ వే ఆఫ్ వాట‌ర్స్ ఫ‌ర్వాలేద‌నిపించినా కానీ మూడో భాగం నిరాశ‌ప‌రిచింద‌ని విమ‌ర్శించింది. ప్ర‌ఖ్యాత `ది టెలిగ్రాఫ్` కూడా అవతార్ 3కి 1/5 రేటింగ్ ఇచ్చి ``ఒక చేపల తొట్టెలో 300 మిలియన్ల పౌండ్ల‌ మెరుపును పోసినట్లుగా ఉంది`` అని విమ‌ర్శించింది. అవ‌తార్ మొద‌టి రెండు సినిమాలు 5 బిలియ‌న్ల డాల‌ర్లు వ‌సూలు చేసినా, మూడో భాగం ఆశించిన రేంజుకు చేరుకోదు. ఇంకా ఎంత‌కాలం భ‌రించ‌గ‌లం? అని కూడా కొంద‌రు విమ‌ర్శించారు.

అయితే అన్ని స‌మీక్ష‌లు ఒకేలా లేవు. కొంద‌రికి ఈ సినిమా న‌చ్చింది. ప్ర‌ఖ్యాత `డెడ్‌లైన్` స‌మీక్ష‌లో దీనిని `యుగాల పాటు నిలిచిపోయే వార్ ఇతిహాసం` అని ప్ర‌శంసించింది. ఒక అద్భుత‌మైన దృశ్య వైభవాన్ని ఎలా సృష్టించాలో కామెరూన్‌కు తెలిసినంత‌గా మరెవరికి తెలుసు? ఈ అవతార్ తన ప్రపంచాలను ఇంత ఉన్నత స్థాయికి నిర్మించింది. మొదటి రెండు చిత్రాలను కలిపినా కూడా మూడో చిత్రంలో ఉన్నంత భీక‌ర పోరును, ఆ రేంజును స‌రిపోల‌లేవు... అని డెడ్ లైన్ త‌న స‌మీక్ష‌లో ప్ర‌శంసించింది.

డెన్ ఆఫ్ గీక్ త‌న స‌మీక్ష‌లో `పైపై మెరుగులతో కూడిన ప్రదర్శన అయినా మీ డబ్బుకు తగిన విలువను ఇస్తుంది`` అని వ‌ర్ణించింది. మాన‌వ జాతి విధ్వంసాలకు వ్యతిరేకంగా నీలి గ్రహాంతరవాసులు మరోసారి తిరుగుబాటు చేయ‌డంపై తీసినా, `అవతార్: ఫైర్ అండ్ యాష్` కథనంలోని కొన్ని ఇబ్బందులు ఉన్నా కానీ, ఈ మూడవ భాగం ఒక సౌందర్యాత్మక విజయం. అదే సమయంలో హాలీవుడ్ బ్లాక్‌బస్టర్ యంత్రం నుండి వెలువడే మరెన్నో చిత్రాల‌కు విమ‌ర్శ‌నాత్మ‌క స్ఫూర్తిగా నిలుస్తుంద‌ని ప్ర‌శంసించింది.