Begin typing your search above and press return to search.

రిస్క్ అనుకున్న కథలే ట్రెండ్ అవుతాయా?

సినిమా కథల్లో ప్రేమకు ఎన్నో రూపాలు కనిపిస్తుంటాయి. అయితే ఏజ్ గ్యాప్ ను ప్రేమకథలో ప్రధాన సంఘర్షణగా చూపించే ప్రయత్నాలు మాత్రం చాలా అరుదుగా కనిపిస్తాయి.

By:  Sravani Lakshmi Srungarapu   |   21 July 2026 3:24 PM IST
రిస్క్ అనుకున్న కథలే ట్రెండ్ అవుతాయా?
X

సినిమా కథల్లో ప్రేమకు ఎన్నో రూపాలు కనిపిస్తుంటాయి. అయితే ఏజ్ గ్యాప్ ను ప్రేమకథలో ప్రధాన సంఘర్షణగా చూపించే ప్రయత్నాలు మాత్రం చాలా అరుదుగా కనిపిస్తాయి. ముఖ్యంగా సోషల్ మీడియా యుగంలో ఇలాంటి కథలు తెరకెక్కించడం డైరెక్ట‌ర్ల‌కు పెద్ద సవాల్‌గా మారింది. ట్రైలర్ లేదా టీజర్ రిలీజైన కొన్ని గంటల్లోనే పాత్రల మధ్య వయసు తేడాపై మీమ్స్, ట్రోల్స్, ముందస్తు తీర్పులు రావడం ఇప్పుడు సాధారణ విషయంగా మారింది. అలాంటి పరిస్థితుల్లో ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానున్న రెండు సినిమాలు ఒక ఆసక్తికరమైన పరీక్షను ఎదుర్కోబోతున్నాయి.

సూర్య విశ్వ‌నాథ్ అండ్ సన్స్ మ‌రియు న‌య‌న‌తార హాయ్ సినిమాల ప్రమోష‌న్స్ ను గమనిస్తే, డైరెక్ట‌ర్లు ఏజ్ గ్యాప్ ను కేవలం షాక్ వాల్యూకు ఉపయోగించకుండా, కథలో భాగమైన ఎమోష‌న‌ల్ సంఘర్షణగా చూపించే ప్రయత్నం చేసినట్లు కనిపిస్తోంది. అదే అంశం ప్రేక్షకులను థియేటర్ల వరకు తీసుకెళ్తుందా, లేక సోషల్ మీడియా అభిప్రాయాలే సినిమాల ఫ్యూచ‌ర్‌ను ప్రభావితం చేస్తాయా అన్నది ఇప్పుడు ఆసక్తికర చర్చగా మారింది.

గతంలో కూడా సాంప్రదాయానికి భిన్నమైన ప్రేమకథలు ఆడియ‌న్స్ ముందుకు వచ్చిన సందర్భాలున్నాయి. వాటిలో కొన్ని కాలానికి ముందే వచ్చిన ఆలోచనలుగా నిలిచిపోగా, మరికొన్ని రిలీజ్ టైమ్ లో పెద్దగా ఆదరణ పొందలేదు. కానీ గత కొన్నేళ్లలో ప్రేక్షకుల అభిరుచిలో గణనీయమైన మార్పు కనిపిస్తోంది. క్యారెక్ట‌ర్లు నేచుర‌ల్‌గా, ఎమోష‌న్స్ నిజాయితీగా అనిపిస్తే కథ ఎంత భిన్నంగా ఉన్నా అంగీకరించే ధోరణి పెరిగింది.

ఇప్పుడీ రెండు సినిమాల విజయాపజయాలు కూడా అదే అంశానికి ఒక సూచికగా మారే అవకాశముంది. ఒకవేళ ఆడియ‌న్స్ ఈ కథలను ఆదరిస్తే, ఏజ్ గ్యాప్ ఉన్న ల‌వ్ స్టోరీల‌ను డైరెక్ట‌ర్లు మరింత ధైర్యంగా తెరపైకి తీసుకురావచ్చు. ఇప్పటి వరకు రిస్క్‌గా భావించిన సంబంధాల నేపథ్యాలు కూడా ప్రధాన కథలుగా మారే అవకాశం ఉంది. దీంతో రొటీన్ ప్రేమకథలకు భిన్నమైన కొత్త కథనాలు తెలుగు, తమిళ చిత్రసీమల్లో పెరిగే పరిస్థితి ఏర్పడవచ్చు.

అయితే ఈ మార్పు కేవలం కాన్సెప్ట్‌పై ఆధారపడదు. పాత్రల రూపకల్పన, ఆడియ‌న్స్ ను ఎంగేజ్ చేసే స్క్రీన్ ప్లే వంటి అంశాలే చివరికి ఫలితాన్ని డిసైడ్ చేస్తాయి. సోషల్ మీడియాలో వచ్చే తొలి రెస్పాన్స్ లు ఎంత ప్రభావం చూపినా, చివరికి థియేటర్‌లో ఆడియ‌న్స్ కథతో కనెక్ట్ అయితేనే స‌క్సెస్ సాధ్యమవుతుంది. ఈ నేప‌థ్యంలో ఆగస్టు 14 తర్వాత వచ్చే బాక్సాఫీస్ రిజ‌ల్ట్ రెండు సినిమాలకే కాదు, ఫ్యూచ‌ర్‌లో ఇలాంటి రిలేషన్‌షిప్ డ్రామాలకు కూడా ఒక కొత్త దిశను చూపించే అవకాశాన్ని కలిగి ఉన్నాయి.