Begin typing your search above and press return to search.

ఓటీటీ యుగంలో కూడా రీమేక్ లు అవసరమా? ఇప్పటికైనా మార్పు వస్తుందా?

సినిమా రంగంలో ఒకప్పుడు రీమేక్ కథలు కాసుల వర్షం కురిపించేవి. కానీ నేడు ట్రెండ్ మారింది.

By:  Madhu Reddy   |   2 Feb 2026 6:00 PM IST
ఓటీటీ యుగంలో కూడా రీమేక్ లు అవసరమా? ఇప్పటికైనా మార్పు వస్తుందా?
X

సినిమా రంగంలో ఒకప్పుడు రీమేక్ కథలు కాసుల వర్షం కురిపించేవి. కానీ నేడు ట్రెండ్ మారింది. నిజానికి కరోనా తర్వాత రీమేక్ సినిమాలను ఆడియన్స్ పెద్దగా పట్టించుకోవటం లేదు. మొబైల్స్ లో ఓటీటీలకు అలవాటు పడిన జనాలు.. ఫ్రెష్ ఒరిజినల్ కంటెంట్ పైన మనసు పారేసుకుంటున్నారు. ఇక ఈ విషయాన్ని నిజం అనేలా తరుణ్ భాస్కర్ మూవీ ఆశించిన స్థాయి లో సక్సెస్ అవ్వలేకపోయింది. తాజాగా మలయాళ హిట్ మూవీ 'జయ జయ జయ జయహే' కు రీమేక్‌గా వచ్చిన 'ఓం శాంతి శాంతి శాంతిః'' చిత్రం ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో పూర్తిగా విఫలమైంది. దీంతో రీమేక్స్ కు ఫుల్ స్టాప్ పెట్టే సమయం ఆసన్నం అయింది అన్నట్టు చర్చలు జరుగుతున్నాయి.

అక్కడ హిట్, ఇక్కడ ఫ్లాప్ :

మలయాళంలో సంచలన విజయం సాధించిన 'జయ జయ జయ జయహే' మూవీలో అద్భుతమైన కథను తెలుగులోకి 'ఓం శాంతి శాంతి శాంతిః'' పేరుతో తెచ్చారు. అయితే, ఈ చిత్రం ప్రేక్షకులలో ఎలాంటి కనీస ఆసక్తిని కూడా కలిగించలేకపోయింది. ఇందులో నటించిన తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా, బ్రహ్మాజీ తమ పాత్రల పరిధి మేరకు ప్రయత్నించినప్పటికీ, ఒరిజినల్ వెర్షన్‌తో పోలికలు రావడం వారి నటనను పక్కదారి పట్టించింది. కథలో ఉండాల్సిన సహజత్వం లోపించడం, బలహీనమైన కథనం వల్ల ప్రేక్షకులు థియేటర్లలో ఈ సినిమాను చూడాలనే కోరికను కూడా ప్రదర్శించలేదు.

రీమేక్ సినిమాల వైఫల్యం:

ఇక కేవలం 'ఓం శాంతి శాంతి శాంతిః'' మాత్రమే కాదు, ఇటీవలి కాలంలో అన్య భాషల్లో హిట్ కొట్టి తెలుగులో రీమేక్ అయ్యి బోల్తా పడిన సినిమాలు చాలానే ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవి 'భోళా శంకర్' (వేదాళం రీమేక్), పవన్ కళ్యాణ్ 'బ్రో' (వినోదయ సీతం రీమేక్) వంటి పెద్ద సినిమాలు కూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. అలాగే బెల్లంకొండ శ్రీనివాస్ 'భైరవం' (గరుడన్ కు రీమేక్ )ముగ్గురు హీరోలను తీసుకొని చేసిన ప్రయత్నాలు కూడా నిరాశనే మిగిల్చాయి. భాషా పరిమితులు లేని ఈ రోజుల్లో, పక్క భాషలో హిట్ అయిన సినిమాను అలాగే దించేయడం వల్ల ప్రేక్షకులకు అందులో కొత్తదనం ఏమీ కనిపించడం లేదు, ఫలితంగా బాక్సాఫీస్ వద్ద పరాజయాలు తప్పడం లేదు.

OTTల యుగంలో రీమేక్‌లు అనవసరం:

మరోవైపు ప్రస్తుతం OTTల హవా నడుస్తోంది. ఏ భాషలో సినిమా హిట్ అయినా, అది వారాల వ్యవధిలోనే సబ్‌టైటిల్స్‌తో సహా మన మొబైల్‌లో ప్రత్యక్షమవుతోంది. ఇలాంటి సమయంలో సినిమాలను రీమేక్ చేయడం అనేది పూర్తిగా అర్థం లేని పని. ప్రేక్షకులు ఈ రీమేక్ మూవీ వచ్చేసరికి ఒరిజినల్ చూసేసి ఉండటం వల్ల రీమేక్‌ల పట్ల ఆసక్తి చూపడం లేదు. కళ అనేది నిరంతరం కొత్తదనాన్ని కోరుకుంటుంది. పాత చింతకాయ పచ్చడి లాంటి రీమేక్ కథలతో కాలక్షేపం చేయాలని చూస్తే ప్రేక్షకులు తిరస్కరిస్తారని ఈ తరం సినిమాలు నిరూపిస్తున్నాయి. ఇప్పటికైనా మేకర్స్ కళ్లు తెరిచి రీమేక్ కథల వెంట పడటం ఆపి, సొంతంగా కొత్త కథలను సిద్ధం చేసుకోవడం మంచిది. అనవసరంగా డబ్బు, సమయాన్ని వృథా చేయకుండా రీమేక్‌లను వదిలేయడమే చిత్ర పరిశ్రమకు శ్రేయస్కరం అన్నది ప్రస్తుతం సినీ వర్గాలలో జరుగుతున్న చర్చ.