సల్మాన్- కమల్ హాసన్ కాంబో మూవీ పాజిబులేనా?
కొన్ని కాంబినేషన్లు అరుదుగా మాత్రమే సాధ్యపడతాయి. అలాంటి ఒక కాంబినేషన్ ని సెట్ చేసేందుకు స్టార్ డైరెక్టర్ అట్లీ ప్రయత్నించిన సంగతి తెలిసిందే.
By: Sivaji Kontham | 3 Sept 2025 9:23 AM ISTకొన్ని కాంబినేషన్లు అరుదుగా మాత్రమే సాధ్యపడతాయి. అలాంటి ఒక కాంబినేషన్ ని సెట్ చేసేందుకు స్టార్ డైరెక్టర్ అట్లీ ప్రయత్నించిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్, దక్షిణాదికి చెందిన లెజెండరీ నటుడు కమల్ హాసన్ కాంబినేషన్‌లో అత్యంత భారీ మల్టీస్టారర్ ని తెరకెక్కించేందుకు అట్లీ సన్నాహకాల్లో ఉన్నాడని 2024 ఆరంభంలో కథనాలొచ్చాయి. జవాన్ లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తర్వాత అతడు ఇద్దరు అగ్ర తారల్ని కలిపి సినిమా చేసేందుకు ప్రయత్నించినా అది సాధ్యపడలేదు.
అన్నీ కుదిరితే ఈ ఏడాది జనవరిలో సినిమా ప్రారంభమయ్యేది. ఈ మల్టీస్టారర్ సినిమాలో సౌత్- నార్త్ నుంచి పేరున్న అగ్ర తారలు నటిస్తారని కథనాలొచ్చాయి. అక్టోబర్ లో ప్రీప్రొడక్షన్ ప్రారంభమవుందని కూడా గుసగుసలు వినిపించాయి. పక్కా మాస్ యాక్షన్ కమర్షియల్ చిత్రాలతో రాణిస్తున్న అట్లీ ఇద్దరు ప్రముఖ స్టార్లతో ఎలాంటి ప్రయోగం చేయబోతున్నాడో తెలుసుకోవాలని ఫ్యాన్స్ వేచి చూసారు. కమల్ హాసన్ లాంటి విలక్షణ హీరోతో భారీ మాస్ యాక్షన్ స్టార్ సల్మాన్ ని కలిపి సినిమా తీయాలనే ఆలోచనే క్రేజీగా ఉంది. కానీ ఎక్కడ పొరపాటు జరిగిందో అట్లీ ఈ కాంబినేషన్ ని వర్కవుట్ చేయడంలో విఫలమయ్యాడు.
ఇంతలోనే యువహీరో వరుణ్ ధావన్ తో బేబి జాన్ పూర్తి చేసి, తన తదుపరి ప్రాజెక్ట్ ని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో ప్రకటించాడు అట్లీ. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా పూర్తవుతోంది. సైన్స్ ఫిక్షన్ కథను ఎంపిక చేసుకుని, అల్లు అర్జున్ లాంటి మాస్ యాక్షన్ హీరోతో అట్లీ భారీ ప్రయోగం చేస్తున్నాడు. మరోవైపు సల్మాన్ ఖాన్ సికందర్ తర్వాత గాల్వాన్ లోయ - చైనా బార్డర్ నేపథ్యంలో సినిమా చేయాల్సి ఉన్నా, అది వాయిదా పడిందని కథనాలొచ్చాయి. లెజెండరీ కమల్ హాసన్ తదుపరి నాగ్ అశ్విన్ `కల్కి 2898 ఏడి` సీక్వెల్ లో నటించాల్సి ఉంది.
సల్మాన్ - కమల్ హాసన్ ప్రాజెక్ట్ అంటే అది కచ్ఛితంగా మోస్ట్ అవైటెడ్ సినిమాల జాబితాలో ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ ఇది భవిష్యత్ లో సెట్స్ పైకి వెళుతుందా? అల్లు అర్జున్‌తో ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత అయినా అట్లీ దీనిని సెట్స్ పైకి తీసుకెళ్లగలడా లేదా? అన్నది వేచి చూడాలి.
