Begin typing your search above and press return to search.

అట్లీ చుట్టూ బాలీవుడ్..అస‌లేం జ‌రుగుతోంది?

సౌత్ నుంచి వెళ్లి నార్త్ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించడం ఇప్పుడున్న ట్రెండ్‌లో సాధారణ విషయమే అయినా? అక్కడ సుస్థిరమైన స్థానాన్ని ఏర్పరచుకోవడం మాత్రం అంద‌రికీ సాధ్యం కాదు.

By:  Srikanth Kontham   |   10 Aug 2026 11:24 AM IST
అట్లీ చుట్టూ బాలీవుడ్..అస‌లేం జ‌రుగుతోంది?
X

సౌత్ నుంచి వెళ్లి నార్త్ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించడం ఇప్పుడున్న ట్రెండ్‌లో సాధారణ విషయమే అయినా? అక్కడ సుస్థిరమైన స్థానాన్ని ఏర్పరచుకోవడం మాత్రం అంద‌రికీ సాధ్యం కాదు. ఈ జాబితాలో సంచలన దర్శకుడు అట్లీ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. బాద్‌షా షారుఖ్ ఖాన్‌తో కలిసి తెరకెక్కించిన `జవాన్` చిత్రంతో బాలీవుడ్‌లో ఎలాంటి చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేశారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ ఒక్క చిత్రంతోనే అట్లీ రేంజ్ జాతీయ స్థాయికి చేరింది. ఇండస్ట్రీ మొత్తం ఆయన వైపు ఆశ్చర్యంగా చూసేలా చేసింది.

ప్రస్తుతం అట్లీ టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో కలిసి `రాకా` అనే భారీ పాన్-ఇండియా సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఒకవేళ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అనుకున్న విధంగా ఘన విజయం సాధిస్తే అట్లీ రేంజ్ ఊహకందనంత స్థాయికి దూసుకుపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ క్రేజ్‌ను ముందే గ్రహించిన బాలీవుడ్ ప్రముఖులు అప్రమత్తమై అట్లీ తో సినిమా చేయడానికి ఇప్పటి నుంచే ప్రణాళికలు రచిస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ ఇప్పటికే అట్లీతో టచ్‌లోకి వెళ్లారనే వార్తలు ఇండస్ట్రీలో జోరుగా చక్కర్లు కొడుతున్నాయి. వీరిద్దరి కలయికలో ఓ ఆసక్తికరమైన స్టోరీ లైన్ కూడా లాక్ అయినట్లు సమాచారం. అయితే కథకు సంబంధించిన ఫైనల్ వెర్షన్ తయారై పూర్తి స్థాయి రూపం సంతరించుకోవడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. అందుకు ఎలా లేద‌న్నా? ఏడాదిన్న‌ర స‌మ‌యం ప‌డుతుంది. మ‌రోవైపు అట్లీతో ప్రాజెక్ట్ చేసేందుకు బాలీవుడ్‌లోని మరికొందరు స్టార్ హీరోలు కూడా రేసులో వచ్చి చేరుతుండటం విశేషం.

ఒక వైపు సౌత్ స్టార్లతో సినిమాలు చేస్తూనే.. మరోవైపు బాలీవుడ్ టాప్ హీరోల నుంచి వరుస ఆఫర్లను దక్కించు కోవడం అట్లీ మేకింగ్ స్టైల్‌కు దక్కిన అతి పెద్ద గుర్తింపుగా చెప్పొచ్చు. కమర్షియల్ హంగులతో పాటు ప్రేక్షకులకు కావాల్సిన విజువల్ ట్రీట్‌ను ఇవ్వడంలో అట్లీ చూపించే ప్రతిభే హిందీ చిత్ర పరిశ్రమను ఆయ‌న‌ వైపు ఆకర్షిస్తోంది. ఒక్క విజయంతో ఆగిపోకుండా తదుపరి అడుగులను ఎంతో వ్యూహాత్మకంగా వేస్తూ అట్లీ తనకంటూ బలమైన బ్రాండ్‌ను క్రియేట్ చేసుకుంటున్నారు.

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఇప్పుడున్న మోస్ట్ వాంటెడ్ దర్శకులలో అట్లీ ముందు వరుసలో ఉన్నారు. నిర్మాతలు , హీరోలు కోట్లు పెట్టుబడి పెట్టడానికి ముందుకు వస్తున్నారంటే? అది అట్లీ బాక్సాఫీస్ స్టామినాపై ఉన్న నమ్మకమే. అట్లీ సినిమాల జోరు చూస్తుంటే టాలీవుడ్, బాలీవుడ్ అనే సరిహద్దులను చెరిపేస్తూ భారతదేశపు అగ్రశ్రేణి డైరెక్టర్ల జాబితాలో మరింత ఉన్నత స్థానానికి చేరుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.

మొత్తంగా చూస్తే అట్లీ చుట్టూ జరుగుతున్న పరిణామాలు ఆయన సినీ ప్రయాణానికే కాకుండా సౌత్-నార్త్ కల్చరల్ కొలాబరేషన్‌కు కూడా పెద్ద ఊపునిస్తున్నాయి. `రాకా` తర్వాత అట్లీ చేయబోయే ప్రాజెక్ట్‌లు ఇండియన్ సినిమా బాక్సాఫీస్ లెక్కలను పూర్తిగా మార్చేయడం తథ్యం. బాలీవుడ్ స్టార్ హీరోలు సైతం అట్లీ డేట్స్ కోసం పోటీ పడుతున్న తరుణంలో అట్లీ ఎలాంటి సంచలనాలకు తెరలేపుతారనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది.