బ్యాన్ చేసిన వారికే కృతజ్ఞతలంటూ సంచలన వ్యాఖ్యలు
సంగీత ప్రపంచంలో మధురమైన గాత్రంతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ప్రముఖ పాకిస్థాన్ గాయకుడు ఆతిఫ్ అస్లామ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు సంగీత పరిశ్రమలో పెద్ద ఎత్తున చర్చకు దారి తీస్తున్నాయి.
By: Srikanth Kontham | 12 Aug 2026 12:29 PM ISTసంగీత ప్రపంచంలో మధురమైన గాత్రంతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ప్రముఖ పాకిస్థాన్ గాయకుడు ఆతిఫ్ అస్లామ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు సంగీత పరిశ్రమలో పెద్ద ఎత్తున చర్చకు దారి తీస్తున్నాయి. భారతదేశం తనపై విధించిన నిషేధంపై అతిఫ్ మొదటిసారిగా బహిరంగంగా స్పందించారు. తనను ఇండియాలో బ్యాన్ చేసిన ప్రతి ఒక్కరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నానని సంచలన ప్రకటన చేశారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ..సినీ వర్గాలలో తీవ్ర దుమారం రేపుతున్నాయి.
భారతీయ చిత్ర పరిశ్రమలో ఎన్నో చార్ట్‌బస్టర్ పాటలను ఆలపించి బాలీవుడ్‌లో టాప్ సింగర్‌గా వెలుగొందిన ఆతిఫ్ అస్లామ్ గత కొన్ని సంవత్సరాలుగా ఇండో-పాక్ రాజకీయ ఉద్రిక్తతల కారణంగా అక్కడి ప్రాజెక్ట్‌లకు దూరంగా ఉంటున్నారు. భారతదేశంలో తనకు మళ్లీ ఎంట్రీ లభిస్తుందా లేదా అనే దానిపై స్పందిస్తూ తాను ప్రస్తుతం ఆ విషయాల గురించి అసలు ఆలోచించడం లేదని తేల్చి చెప్పారు. అంతేకాదు తాను భారతదేశంలో పనిచేయడాన్ని ఏమాత్రం మిస్ కావడం లేదని..మళ్లీ అవకాశాలు వస్తే పనిచేయడానికి మాత్కం ఎప్పుడూ సిద్దంగానే ఉంటానన్నారు.
ఒక ఆర్టిస్టుగా తన సంగీతం సరిహద్దులను దాటి ఎక్కడైనా శ్రోతలను చేరుకుంటుందని, తనకు ప్రశంసలు ఎక్కడి నుంచి వచ్చినా సంతోషమేనని ఆతిఫ్ పేర్కొన్నారు. అయితే గతంలో ఇక్కడ ఎదురైన కొన్ని పరిణామాలు, ఆపై ఎదురైన నిషేధం తనను వ్యక్తిగతంగా మరింత పరిణతి చెందేలా చేశాయని అతీఫ్ అభిప్రాయపడ్డారు. వివాదాలకు దూరంగా ఉంటూ సంగీతంపైనే దృష్టి పెట్టాలనేదే ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేశారు.
పాకిస్థాన్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా తన మ్యూజిక్ కన్సర్ట్‌లతో ఎంతో బిజీగా గడుపుతున్న ఆతిఫ్, అక్కడి ప్రేక్షకులనుంచి లభిస్తున్న అపూర్వ ఆదరణే తనకు శ్రీరామరక్ష అని తెలిపారు. భారతదేశంలో పని చేయడం లేదన్న బాధ తనలో లేదని.. కళాకారులకు దేశాల హద్దులు ఉండకూడదనే వాదన కంటే ప్రస్తుత తన ప్రశాంతమైన జీవన శైలినే తాను ఆస్వాదిస్తున్నానని వెల్లడించారు. ఈ వ్యాఖ్యలతో అతీఫ్ భారతీయ అభిమానులలో భిన్నమైన స్పందన వ్యక్తమవుతోంది.
ఒకప్పుడు బాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ సింగర్‌గా ఉన్న ఆతిఫ్ అస్లామ్ ఇలా నేరుగా భారత్‌లో పనిచేయడం మిస్ కావడం లేదని చెప్పడం ఆయన అభిమానులను కొంత నిరాశకు గురిచేస్తోంది. రాజకీయ పరిస్థితుల కారణంగా కళారంగం కూడా ఇలాంటి విభజనలను ఎదుర్కోవడం దురదృష్టకరమని కొందరు సంగీత ప్రియులు అభిప్రాయపడుతుంటే.. మరికొందరు మాత్రం ఆయన వ్యాఖ్యలను తప్పుపడుతున్నారు.
మొత్తంగా ఆతిఫ్ అస్లామ్ చేసిన వ్యాఖ్యలు ఇండో-పాక్ ఆర్టిస్ట్ కొలాబరేషన్ల అంశాన్ని మరోసారి చర్చలోకి తీసుకొస్తున్నాయి. భవిష్యత్తులో ఇరు దేశాల మధ్య పరిస్థితులు సాధారణ స్థితికి రాకపోతే ఇలాంటి పాకిస్థాన్ కళాకారులు పూర్తిగా తమ దేశీయ మార్కెట్లకే పరిమితం కావాల్సి వస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదన్నది అంతే వాప్తవం.
