2000 కోట్ల ఆస్తిపరుడైన భర్త తన భార్యకు ఇచ్చిన గౌరవం
రాహుల్ శర్మ తన పోస్ట్‌లో కవితాత్మకమైన సందేశం రాసారు. ``గడిచిన పదేళ్లు ఒక అందమైన ప్రయాణంలా సాగాయి. ఆమె కేవలం నా భార్య మాత్రమే కాదు.. నా జీవితానికి.. మా కుటుంబానికి ఒక అద్భుతమైన సహ వ్యవస్థాపకురాలు`` అని పేర్కొన్నారు.
By: Sivaji Kontham | 20 Jan 2026 8:41 AM ISTగజిని, అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించిన అశిన్ బాలీవుడ్ లో కెరీర్ సాగిస్తున్న క్రమంలోనే మైక్రోమ్యాక్స్ కంపెనీ అధినేత రాహుల్ శర్మతో ప్రేమలో పడటం, అతడిని పెళ్లాడటం అంతా సినిమాటిక్. యాథృచ్ఛికంగా `గజిని` చిత్రంలో అశిన్ ఓ సెల్ కంపెనీ ఓనర్ తో ప్రేమాయణం నడిపించినట్టే, నిజ జీవితంలో కూడా సెల్ కంపెనీ ఓనర్ తోనే ప్రేమలో పడింది. దీనిని ఇప్పటికీ అభిమానులు వింతగా మాట్లాడుకుంటారు.
ఈరోజుతో అశిన్ - `మైక్రోమ్యాక్స్` రాహుల్ శర్మల వివాహ బంధం పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రాహుల్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షించింది. ఒక బిజినెస్‌మేన్ అయిన రాహుల్.. తన భార్యను ఒక `కో-ఫౌండర్` (సహ వ్యవస్థాపకురాలు) తో పోల్చడం తనపై ఉన్న గౌరవానికి నిదర్శనం. దాదాపు 2000 కోట్ల నికర ఆస్తులున్న ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీస్ యజమాని ఈ వ్యాఖ్యలు చేయడం నిజంగా అందరి దృష్టిని ఆకర్షించింది.
రాహుల్ శర్మ తన పోస్ట్‌లో కవితాత్మకమైన సందేశం రాసారు. ``గడిచిన పదేళ్లు ఒక అందమైన ప్రయాణంలా సాగాయి. ఆమె కేవలం నా భార్య మాత్రమే కాదు.. నా జీవితానికి.. మా కుటుంబానికి ఒక అద్భుతమైన సహ వ్యవస్థాపకురాలు`` అని పేర్కొన్నారు. కోట్లాది రూపాయల వ్యాపార సామ్రాజ్యం ఉన్నప్పటికీ, అసిన్ తన జీవితాన్ని ఎంత నిరాడంబరంగా, కుటుంబం కోసం కేటాయించారో ఈ సందేశం ప్రతిబింబిస్తుంది.
ఆ ఇద్దరి కలయికకు కారకుడు:
అసిన్ - రాహుల్ కలవడానికి బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ప్రధాన కారణం. `ఖిలాడీ 786` షూటింగ్ సమయంలో అక్షయ్ వీరిని ఒకరికొకరిని పరిచయం చేశారు. ఆ తర్వాత ప్రేమలో పడ్డారు. అందుకే ఈ జంట అక్షయ్ కుమార్‌ను తమ `బెస్ట్ మ్యాన్`గా భావిస్తారు. ఈ అందమైన జోడీ కొన్నేళ్ల ప్రేమాయణం తర్వాత, 2016 జనవరిలో హిందూ - క్రిస్టియన్ పద్ధతుల్లో వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత అసిన్ తన కెరీర్‌కు పుల్‌స్టాప్ పెట్టేశారు.
ప్రస్తుతం కుమార్తె అరిన్ అభ్యున్నతిపై అశిన్ పూర్తిగా దృష్టి పెట్టారు. అరిన్ కూడా తన తల్లిలాగే డ్యాన్స్, స్పోర్ట్స్ లో చురుగ్గా ఉన్నట్లు అప్పుడప్పుడు అసిన్ షేర్ చేసే ఫోటోల ద్వారా తెలుస్తోంది. ఒక స్టార్ హీరోయిన్ గా ఉండి కూడా కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు సినిమాలను వదిలేసి ఇలా సంతోషకరమైన కుటుంబ జీవితాన్ని గడపడం అసిన్ ప్రత్యేకత అని చెప్పవచ్చు. ఇంకా చెప్పాలంటే ఎప్పుడు ఏం చేయాలో అది చేసిన హీరోయిన్ గా అశిన్ ని అందరూ గుర్తుంచుకుంటారు.
పారిశ్రామిక వేత్త:
అసిన్ భర్త రాహుల్ శర్మ భారతదేశంలోని విజయవంతమైన టెక్ పారిశ్రామికవేత్తలలో ఒకరు. ఆయన ఆస్తులు వ్యాపార సామ్రాజ్యం అపారమైనవి. 2025-26 నాటి అంచనాల ప్రకారం, రాహుల్ శర్మ నికర ఆస్తి విలువ సుమారు 1,600 కోట్లు - 2,000 కోట్ల మధ్య ఉంటుందని అంచనా.
మైక్రోమ్యాక్స్ ఇన్ఫర్మాటిక్స్ కి ఆయన సహ వ్యవస్థాపకుడు. ఒకానొక సమయంలో భారతదేశపు అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ కంపెనీగా ఇది నిలిచింది. ప్రస్తుతం ఈ కంపెనీ స్మార్ట్ టీవీలు, ఎయిర్ కండీషనర్ల విభాగంలో కూడా రాణిస్తోంది. రివోల్ట్ ఎలక్ట్రిక్ బైక్ ల కంపెనీని కూడా ప్రారంభించి జోరుగా వ్యాపారం చేస్తున్నారు.
