హాలీవుడ్ ఇండియన్ పరిశ్రమని అనుసరించేలా!
`మహావతార్ నరసింహ` సినిమాతో డైరెక్టర్ అశ్విన్ కుమార్ ఎంత సంచలనమయ్యాడో తెలిసిందే.
By: Srikanth Kontham | 29 Oct 2025 7:00 PM IST`మహావతార్ నరసింహ` సినిమాతో డైరెక్టర్ అశ్విన్ కుమార్ ఎంత సంచలనమయ్యాడో తెలిసిందే. యానిమేషన్ సినిమా తీసి 300 కోట్లు కొల్లగొట్టిన మొనగాడు అనిపించాడు. దేశంలో ఎంతో మంది డైరెక్టర్లు ఉన్నారు. మరెంతో మంది క్రియేటర్స్ ఉన్నారు. ఎవ్వరూ చేయలేని పనిని అశ్విన్ కుమార్ చేసి చూపించాడు. యానిమేషన్ సినిమాలతోనూ రికార్డు వసూళ్లు సాధించొచ్చని నిరూపించిన ఏకైక డైరెక్టర్ గా ప్రూవ్ చేసాడు. యానిమేషన్ సినిమాలంటే ఎవరు చూస్తారు? అనే చిన్న చూపు నుంచి యానిమేషన్ సినిమా అంటేనే ఓ వండర్ నిరూపించాడు.
వాళ్లకు కథలు లేవు..అదే మన బలం:
అతడి నుంచి భవిష్యత్ లో మరిన్ని యానిమేషన్ చిత్రాలు రాబోతున్నాయి. ఈనేపథ్యంలో భవిష్యత్ లో యానిమేషన్ పరిశ్రమ ఎలా ఉంటుందని ఓ అంచనా వేసారు ఆయన. `కొన్నాళ్లగా మార్కెట్ స్తబ్తుగా ఉన్నా? ఇప్పుడిప్పుడే సంచలనాలు సృష్టించడానికి సిద్దంగా ఉంది. రానున్న ఏడేళ్లలో భారత్ అతి పెద్ద యానిమేషన్ ఇండస్ట్రీగా మారబోతుందన్నారు. జపాన్ పరిశ్రమ, హాలీవుడ్ పరిశ్రమలు భారత్ ను చూసి నేర్చుకుంటాయన్నారు. ఎందుకంటే పాశ్చత్య దేశాల్లో చెప్పడానికి పెద్దగా కథలు లేవు. తీసిన సినిమాలే మళ్లీ తీస్తున్నారన్నారు.
యానిమేషన్ పరంగా వాటితో అద్భుతం:
`క్రియేటివ్ గా కొత్త కథలు చెప్పలేకపోతున్నారు. కానీ భారత్ లో చెప్పడానికి ఎన్నో కథలున్నాయి. మన దేశం కథల భాండాగారం.ఆథ్యాత్మిక, పౌరాణిక కథలు ఎన్నో ఉన్నాయి. సామాజిక పరమైన కథలు అనేకం ఉన్నాయి. రకరకాల దశల్లో మన కథల్ని చెప్పడానికి అవకాశం ఉంది. ఇప్పటికే కమర్శియల్ కోణంలో కొన్ని కథలు చెబుతున్నారు. వాటిని యానిమేషన్ పరంగా చెబితే ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించినట్లు అవుతుంది. ఏ కథలోనైనా దివ్యత్వాన్ని జోడించాలి. పిల్లలు మొదలు పెద్దల వరకూ అన్ని వయస్కుల వారిని ఆకట్టుకునే వినోద సాధనం ఏదైనా ఉందా? అంటే అది యానిమేషన్ మాత్రమే.
రెండున్నరేళ్లకు ఒక యానిమేషన్ చిత్రం:
భవిష్యత్లో యానిమేషన్ పరంగా అద్భుతాలు సృష్టించగలం అన్నారు. `మహావతార్ నరసింహ` చిత్రాన్ని తీయ డానికి నాలుగున్నరేళ్లు పట్టిందన్నారు. మొదలు పెట్టినప్పుడు ఎదురైన సవాళ్లు కారణంగా అంత సమయం తీసుకు న్నామన్నారు. మరో ఆరు కథలు సిద్దంగా ఉన్నాయి. ఒక్కదాన్ని పూర్తి చేసి రిలీజ్ చేయడానికి రెండున్నరేళ్లు సమయం పడుతుంది. `మహావతార్` బ్యానర్ పై గేమింగ్, కామిక్ లాంటివి కూడా రూపొందిస్తామన్నారు.
