Begin typing your search above and press return to search.

నిర్మాతల మండలిని సొంత అడ్డాగా మార్చుకోవద్దు: అశోక్ కుమార్ ఆగ్రహం

తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ (TFPC) ఎన్నికల నిర్వహణ, నామినేషన్ల ఆమోదంపై కోర్టు జారీ చేసిన ఆదేశాల అనంతరం పోటీ వాతావరణం వేడెక్కింది.

By:  Sivaji Kontham   |   2 Sept 2026 8:37 PM IST
నిర్మాతల మండలిని సొంత అడ్డాగా మార్చుకోవద్దు: అశోక్ కుమార్ ఆగ్రహం
X

తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ (TFPC) ప్రస్తుతం పబ్లిక్ సర్వీస్ ఆఫీస్‌లా కాకుండా కొందరి వ్యక్తిగత కార్యాలయంగా తయారైందని ప్రముఖ నిర్మాత అశోక్ కుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కౌన్సిల్‌లో ఇద్దరు సెక్రటరీలు ఉన్నప్పటికీ పారదర్శకత పూర్తిగా లోపించిందని... అధ్యక్షుడు అడిగినా సరైన పత్రాలు లేదా ముద్రలు కూడా ఇవ్వకుండా ఒకే సెక్రటరీ వ్యవస్థ మొత్తం వ్యవస్థను నడుపుతోందని ఆరోపించారు. ప్రతి నెలా జరగాల్సిన ఎగ్జిక్యూటివ్ కమిటీ (EC) సమావేశాలను పక్కనపెట్టి.. ఆరు నెలల లెక్కలను కేవలం వాట్సాప్‌లలో పంపి మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. సరియైన బిల్లులు, ఆడిటింగ్ లేకుండా కౌన్సిల్ నిధులను వినియోగిస్తున్నారని, చివరికి కోర్టు ఆర్డర్లను స్వీకరించిన ఆఫీస్ స్టాఫ్‌ను కూడా భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఓటర్ల జాబితాలో లోపాలు.. తనను అడ్డుకునేందుకు కుట్రలు

ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన ఓటర్ల జాబితాలో చనిపోయిన వారి పేర్లు.. తప్పుడు ఫోన్ నంబర్లు.. రాంగ్ అడ్రసులు ఉన్నాయని అశోక్ కుమార్ బయటపెట్టారు. కౌన్సిల్‌లో జరుగుతున్న ఈ అక్రమాలను, లోపాలను ప్రశ్నిస్తాననే భయంతోనే తనను ఎన్నికల పోటీ నుంచి తప్పించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని స్పష్టం చేశారు. తను పోటీలోకి వస్తే పారదర్శకత పెరుగుతుందని.. ఏదో దాచాలనే ఉద్దేశంతోనే తన నామినేషన్‌పై అడ్డంకులు సృష్టిస్తున్నారని తెలిపారు. ఈ క్రమంలోనే కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని... న్యాయస్థానం తన ఎలిజిబిలిటీపై స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందని ఆయన గుర్తుచేశారు.

చిన్న నిర్మాతలకు అండగా ఉచిత మెంబర్‌షిప్ హామీ

పరిశ్రమలో సినిమాలు తీసి ఆర్థికంగా నష్టపోతున్న చిన్న నిర్మాతలను కౌన్సిల్ వేధిస్తోందని అశోక్ కుమార్ ఆరోపించారు. చిన్న సినిమాలు విడుదలయ్యాక.. పబ్లిసిటీ ఇవ్వలేదనే నెపంతో రూ. 2 లక్షలు కడితేనే మెంబర్‌షిప్ ఇస్తామని ఇబ్బందులు పెట్టడం సరికాదన్నారు. కౌన్సిల్ వద్ద దాదాపు రూ. 12 కోట్లకు పైగా నిధులు.. 4 ఫ్లాట్లు ఉన్నాయని.. ఆ నిధులను నిర్మాతల సంక్షేమానికి వాడాలని సూచించారు. తమ ప్యానెల్ అధికారంలోకి వస్తే చిన్న నిర్మాతలకు ఉచితంగా మెంబర్‌షిప్ అందించడమే కాకుండా.. వారి ఆర్థిక ఇబ్బందులను తీర్చేలా పూర్తి పారదర్శకమైన నిర్ణయాలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లలో అక్రమాలు- వైద్య సాయంలో మార్పులు:

హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్‌ల పంపిణీలో పారదర్శకత లోపించిందని.. అర్జున్ రాజు గారి వంటి పెద్ద నిర్మాతలకు సకాలంలో ఫండ్స్ అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. క్యాష్‌లెస్ ఇన్సూరెన్స్ పేరుతో 24 గంటలు ఆసుపత్రిలో ఉండాలనే నిబంధనల వల్ల హాస్పిటల్స్ భారీగా బిల్లులు వేస్తూ కౌన్సిల్ నిధులను దుర్వినియోగం చేస్తున్నాయని తన స్వీయ‌ అనుభవంతో వివరించారు. ఈ విధానానికి స్వస్తి చెప్పి.. నిజంగా అత్యవసర పరిస్థితుల్లో ఉన్న పేద లేదా కష్టాల్లో ఉన్న నిర్మాతలకు ఆసుపత్రిలో చేరగానే ముందస్తుగా రూ. 1 లక్ష వరకు నేరుగా ఆర్థిక సాయం అందించే పద్ధతిని ప్రవేశపెడతామని పేర్కొన్నారు.

ట్రూత్, ట్రాన్స్పరెన్సీ, ట్రస్ట్.. విజ్ఞతతో ఓటు వేయాలని పిలుపు

తమ ప్యానెల్ ముఖ్యమైన నినాదం `ట్రూత్, ట్రాన్స్పరెన్సీ, ట్రస్ట్` (నిజాయితీ, పారదర్శకత, నమ్మకం) అని అశోక్ కుమార్ ప్రకటించారు. మండలికి ఎన్నుకోబడే వ్యక్తులు ఎవరికో గుడ్డిగా ``ఎస్ బాస్`` అని తలఊపేలా ఉండకూడదని.. ప్రతి అంశంపై స్వతంత్రంగా చర్చించి నిర్ణయాలు తీసుకునేలా ఉండాలని ఆకాంక్షించారు. ప్రచారానికి తనకు తక్కువ సమయం ఉన్నందున మీడియా ద్వారా నిర్మాతలందరికీ ఈ విషయాలను చేరవేస్తున్నానని చెబుతూ... నిర్మాతలందరూ తమ విజ్ఞతతో ఆలోచించి సరైన నాయకత్వాన్ని ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు.

తొంద‌ర్లోనే ఎల‌క్ష‌న్ డేట్ :

తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ (TFPC) ఎన్నికల నిర్వహణ, నామినేషన్ల ఆమోదంపై కోర్టు జారీ చేసిన ఆదేశాల అనంతరం పోటీ వాతావరణం వేడెక్కింది. ఈ ఎన్నికలలో నిర్మాత అశోక్ కుమార్ ప్యానెల్ ``ట్రూత్, ట్రాన్స్‌ఫ‌రెన్సీ, ట్రస్ట్`` అనే నినాదంతో, పారదర్శకత - చిన్న నిర్మాతల సంక్షేమమే ధ్యేయంగా బరిలోకి దిగుతోంది. ప్రస్తుత వివాదాలు.. కోర్టు స్టే పరిణామాలు .. లీగల్ ప్రాసెస్ ముగిసిన వెంటనే ఎలక్షన్ ఆఫీసర్ల సమక్షంలో అధికారిక ఎన్నికల తేదీని ఖరారు చేయనున్నారు. కౌన్సిల్‌లోని ప్రస్తుత వర్గం.. అశోక్ కుమార్ సారథ్యంలోని ప్రత్యర్థి ప్యానెళ్ల మధ్య ఈసారి తీవ్ర పోటీ నెలకొంది. నిజానికి సెప్టెంబ‌ర్ 6న జ‌ర‌గాల్సిన ఎన్నిక‌లు వాయిదా ప‌డ‌గా, బండ్ల గ‌ణేష్ పోటీ నుంచి త‌ప్పుకున్నార‌ని, సి.క‌ళ్యాణ్ కి మ‌ద్ధ‌తు ఇవ్వ‌డంతో అధ్య‌క్షుడి ఎన్నిక ఏక‌గ్రీవం అయింద‌ని క‌థ‌నాలొచ్చాయి. కానీ ఇప్పుడు అశోక్ కుమార్ పోటీబరిలోకి వ‌చ్చారు.