నేషనల్ అవార్డ్.. అప్పుడు పార్టీ ఇవ్వడానికి డబ్బులే లేవ్: సీనియర్ యాక్టర్
సీనియర్ కమ్ స్టార్ యాక్టర్ ఆశిష్ విద్యార్థికి ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే.
By: M Prashanth | 29 Aug 2025 10:07 AM ISTసీనియర్ కమ్ స్టార్ యాక్టర్ ఆశిష్ విద్యార్థికి ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. వైవిధ్యమైన యాక్టింగ్ తో ఎలాంటి పాత్ర అయినా ఇట్టే ఒదిగిపోతారు. ఆడియన్స్ ను తన నటనతో విపరీతంగా అలరిస్తారు. దాదాపు అన్ని భాషల్లో నటించిన ఆయన.. తన 30 ఏళ్ల కెరీర్ లో 300లకు పైగా సినిమాల్లో నటించి అందరినీ మెప్పించారు.
ముఖ్యంగా టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాల్లో విలన్ పాత్రలు పోషించి ఫేమస్ అయ్యారు. అయితే రీసెంట్ గా ఆయన మూవీస్ తగ్గించేశారని చెప్పాలి. కొంతకాలంగా ఆయన సిల్వర్ స్క్రీన్ పై అరుదుగా కనిపిస్తున్నారు. అయితే దాదాపు 20 ఏళ్ల క్రితం ఆయన.. తన యాక్టింగ్ కు గాను నేషనల్ అవార్డు అందుకున్న విషయం తెలిసిందే.
తెలుగుతోపాటు కన్నడ, తమిళం, మలయాళం, బెంగాలీ, ఒడియా, ఇంగ్లిష్ చిత్రాల్లో కూడా నటించిన ఆశిష్ విద్యార్థి.. కెరీర్ ప్రారంభంలోనే ద్రో కాల్ మూవీకి గాను 1995లో జాతీయ అవార్డు అందుకున్నారు. ఆ సమయంలో జరిగిన ఘటనను తాజాగా గుర్తు చేసుకున్నారు. అందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
ఒకప్పుడు బతుకుదెరువు కోసం చాలా కష్టపడినట్లు తెలిపారు. ఇంటి అద్దెను సకాలంలో చెల్లించడం కూడా కష్టమయ్యేదని చెప్పుకొచ్చారు. తనకు నేషనల్ అవార్డు వచ్చినప్పుడు ఇండస్ట్రీ ఫ్రెండ్స్ పార్టీ అడగ్గా.. తాను చాలా ఇబ్బంది పడ్డానని తెలిపారు. అప్పటి వరకు ఎప్పడూ వెళ్లని మెయిన్ ల్యాండ్ చైనా రెస్టారెంట్ కు వెళ్లానన్నారు.
అక్కడే తన ఫ్రెండ్స్ పార్టీ అడిగారని చెప్పారు. తీరా పార్టీకి వెళ్లాక.. అందరూ మద్యం సేవించారని, నాన్ వెజ్ ను ఫుల్ గా తిన్నారని తెలిపారు. ఆ సమయంలో బిల్లు తగ్గించడానికి తాను ఒక గ్లాస్ వాటర్ లో నిమ్మ రసం కలుపుకుని తాగినట్లు చెప్పారు. చివరకు బిల్లు కట్టే విషయంలో ఏం చేయాలో అర్థం కాలేదని తెలిపారు.
అప్పుడు దర్శకుడు గోవింద్ నిహలాని హెల్ప్ చేసి మొత్తం బిల్లు చెల్లించారని, తాను కృతజ్ఞతలు తెలిపినట్లు అప్పటి రోజులు గుర్తు చేశారు. అయితే ఇప్పుడు ఆశిష్.. ఆర్థికంగా మంచి పొజిషన్ లో ఉన్నారు. ఫుడ్ బ్లాగర్ గా సందడి చేస్తున్నారు. వివిధ రూపాల్లో ఆదాయం అందుకుంటున్నారు. సినిమాలు మాత్రం తగ్గించారు. రొటీన్ పాత్రలు చేయాలని అనుకోవట్లేదని, కొత్తగా చేసినప్పుడే ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు లభిస్తుందని ఇటీవల తెలిపారు.
