మొన్న నాగ్.. నిన్న చిరూ, ఇప్పుడు రవితేజతో..
ఇదిలా ఉంటే ఏ హీరోయిన్ అయినా సరే తమ వయసు హీరోలతోనే ఆడి పాడాలనుకుంటారు.
By: Sravani Lakshmi Srungarapu | 23 Aug 2025 1:00 AM ISTసినీ ఇండస్ట్రీలో హీరోలకు ఉన్నంత లైఫ్ టైమ్ హీరోయన్లకు ఉండదనేది వాస్తవం. అందుకే హీరోయిన్లు తమకు వచ్చిన ఛాన్సులను అందుకుంటూ చాలా వేగంగా సినిమాలు చేస్తూ కెరీర్లో ముందుకు దూసుకెళ్తుంటారు. అయితే కొందరు హీరోయిన్లు కెరీర్లో చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేసుకుంటూ వెళ్తే మరికొందరు మాత్రం దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలనే ఫార్ములాతో వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఉంటారు.
ఇదిలా ఉంటే ఏ హీరోయిన్ అయినా సరే తమ వయసు హీరోలతోనే ఆడి పాడాలనుకుంటారు. కొందరు మాత్రమే పరిస్థితులను అర్థం చేసుకుని, వాటిని వాడుకుంటూ ఉంటారు. అలాంటి వారిలో ఆషికా రంగనాథ్ కూడా ఒకరు. టాలీవుడ్ లో సీనియర్ హీరోల సరసన నటించే హీరోయిన్లకు భారీ కొరత ఉన్న నేపథ్యంలో ఆషికా ఆ అవకాశాలను చాలా తెలివిగా వాడుకుంటున్నారు.
అమిగోస్ తో టాలీవుడ్ ఎంట్రీ
కళ్యాణ్ రామ్ హీరోగా వచ్చిన అమిగోస్ సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన ఆషికా రంగనాథ్, ఆ సినిమాతో అనుకున్న స్థాయిలో ఆడియన్స్ ను ఇంప్రెస్ చేయలేక పోయారు. తర్వాత నాగార్జున హీరోగా వచ్చిన నా సామిరంగా సినిమాలో నటించి ఆ సినిమాలో తన నటనతో మంచి మార్కులు వేయించుకున్నారు. నా సామిరంగా తర్వాత ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో కలిసి ఆయన సరసన విశ్వంభర సినిమాలో నటిస్తున్నారు ఆషికా.
రవితేజ సినిమాలో ఛాన్స్
అయితే విశ్వంభర సినిమా ఇంకా రిలీజ్ కూడా కాకుండానే ఆషికాకు ఇప్పుడు మరో బంపరాఫర్ వచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పటికే నాగ్, చిరూతో కలిసి వర్క్ చేసిన ఆషికా ఇప్పుడు మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటిస్తున్న సినిమాలో ఛాన్స్ అందుకున్నట్టు సమాచారం. కిషోర్ తిరుమల దర్శకత్వంలో రవితేజ చేస్తున్న సినిమాలో ఆషికాను ఎంపిక చేశారని అంటున్నారు. ఈ విషయంలో మేకర్స్ నుంచి ఎలాంటి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ లేదు కానీ ఈ వార్త నిజమైతే మాత్రం ఆషికాకు బంపరాఫర్ దక్కినట్టే అని చెప్పాలి.
