సంగీతం సాక్షిగా చిగురించిన ప్రేమ!
భారతీయ సినీ సంగీత ప్రపంచంలో ఆశా భోంస్లే - ఆర్.డి. బర్మన్ (పంచమ్ దా)ల జోడీ ఓ అద్భుతం.
By: Srikanth Kontham | 13 April 2026 9:19 AM ISTభారతీయ సినీ సంగీత ప్రపంచంలో ఆశా భోంస్లే - ఆర్.డి. బర్మన్ (పంచమ్ దా)ల జోడీ ఓ అద్భుతం. వీరిద్దరి కలయికలో వచ్చిన పాటలు ఎంతటి సంచలనం సృష్టించాయో? వీరి వ్యక్తిగత జీవితంలోని ప్రేమకథ కూడా అంతే ఆసక్తికరం. జీవితం రెండోసారి ఇచ్చిన అవకాశాన్ని వారు ఎలా అందిపుచ్చుకున్నారో? సంగీతం వారిని ఎలా ఒకటి చేసిందో ? తెలిపే అపురూప గాథ ఇది. ఆశా భోంస్లే - ఆర్.డి. బర్మన్ ఇద్దరికీ ఇది రెండో వివాహం. ఆశా తన మొదటి వివాహ బంధం నుండి బయటపడి ముగ్గురు పిల్లలతో ఒంటరిగా జీవిస్తున్న సమయంలో ఆర్.డి. బర్మన్ కూడా తన మొదటి భార్య రీటా పటేల్‌తో విడిపోయారు.
ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో సంగీతమే వారి మధ్య వారధిగా మారింది. రికార్డింగ్ స్టూడియోలలో గంటల తరబడి గడపడం, ఒకరి సృజనాత్మకతను మరొకరు గౌరవించుకోవడం వారిని స్నేహితులుగా మార్చింది. ఆర్.డి. బర్మన్ తనకంటే ఆరేళ్లు పెద్దదైన ఆశాను అమితంగా ప్రేమించారు. వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిన అనంతరం ఆర్.డి. బర్మన్ ఆశాకు పెళ్లి ప్రతిపాదన చేశారు. అయితే గతంలోని చేదు అనుభవాల దృష్ట్యా ఆశా మొదట ఈ ప్రతిపాదనను అంగీకరించడానికి వెనుకాడారు. కానీ పంచమ్ దా పట్టుదల ఆమెపై ఆయనకు ఉన్న నిబద్ధత చూసి చివరకు ఆమె మనసు మార్చుకున్నారు.
1980లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఇద్దరి మధ్య ఉన్న బంధం కేవలం భార్యాభర్తల వరకే పరిమితం కాలేదు. ఒక సంగీత దర్శకుడిగా పంచమ్ దాకు, గాయనిగా ఆశా ఏమి ఇవ్వగలదో తెలుసు. అందుకే వారిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన `దమ్ మారో దమ్`, `చురా లియా హై తుమ్నే` వంటి పాటలు నేటికీ ఎవర్‌గ్రీన్ క్లాసిక్స్‌గా నిలిచిపోయాయి. ఇంట్లో కూడా వారు సంగీతం గురించే చర్చించుకునేవారని ఒకరికొకరు గొప్ప విమర్శకులుగా ఉండేవారని సన్నిహితులు చెబుతుంటారు. పంచమ్ దా చనిపోయే వరకు వారి బంధం ఎంతో అన్యోన్యంగా సాగింది. 1994లో ఆర్.డి. బర్మన్ మరణించిన తర్వాత ఆశా భోంస్లే తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు.
అయినా ఆయన సంగీతాన్ని ప్రపంచవ్యాప్తంగా సజీవంగా ఉంచడంలో ఆశా కీలక పాత్ర పోషించారు. `ఆయన నా జీవితంలో ఒక భాగం మాత్రమే కాదు. నా శ్వాసలో ఒక భాగం` అని ఆశా అనేక సందర్భాల్లో భావోద్వేగానికి గురయ్యారు. ఆశా - పంచమ్ దా ల ప్రేమ కథ నేటి యువతకు ఓ ముఖ్మైన విషయాన్ని తెలియజేస్తుంది. జీవితంలో ఎదురు దెబ్బలు తగిలినా కృంగిపోకుండా రెండోసారి దొరికిన ప్రేమని, ఆనందాన్ని గౌరవించడం ఎంత అవసరమో వారి జీవితం నిరూపించింది. సంగీతం ప్రాణంగా బతికిన ఈ జంట భారతీయ సినీ చరిత్రలో చెరగని సంతకంలా నిలిచిపోతుంది
