Begin typing your search above and press return to search.

షాకింగ్‌: నేప‌థ్య గాయ‌ని ఆస్తులు 250 కోట్లు?

ఇక రియల్ ఎస్టేట్ రంగంలోనూ భోంస్లేకు భారీగా పెట్టుబడులు ఉన్నాయి. ముంబై, పూణే వంటి నగరాల్లో ఖరీదైన ఆస్తులు ఉన్నాయి.

By:  Sivaji Kontham   |   14 April 2026 9:25 AM IST
షాకింగ్‌: నేప‌థ్య గాయ‌ని ఆస్తులు 250 కోట్లు?
X

భారతీయ సినీ సంగీత ప్రపంచంలో తన గాత్రంతో దశాబ్దాల పాటు ఓ వెలుగు వెలిగిన దిగ్గజ గాయని ఆశా భోంస్లే ఆస్తుల వివరాలు ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. 2026 నాటికి ఈ దివంగ‌త‌ నేప‌థ్య‌ గాయ‌ని నికర ఆస్తి విలువ సుమారు రూ.100 కోట్లుగా ఉంటుందని అంచనా. ఈ భారీ సంపదతో భారతదేశంలోని అత్యంత ధనవంతులైన మహిళా గాయనుల జాబితాలో మొదటి పది స్థానాల్లో నిలిచారు. అయితే కొన్ని వార్తా క‌థ‌నాల‌ ప్రకారం.. భోంస్లే మొత్తం ఆస్తి విలువ రూ. 200 నుండి 250 కోట్ల వరకు ఉండవచ్చని సమాచారం.

కేవలం గాయనిగానే కాకుండా ఆశా భోంస్లే ఒక విజయవంతమైన వ్యాపారవేత్తగా కూడా రాణించారు. ఈ వెట‌ర‌న్ కేవలం సంగీతంపైనే ఆధారపడకుండా `ఆశాస్` పేరుతో అంతర్జాతీయ స్థాయిలో రెస్టారెంట్ నెట్‌వర్క్‌ను నిర్మించారు. దుబాయ్, అబుదాబి, బహ్రెయిన్, కువైట్, యునైటెడ్ కింగ్‌డమ్ వంటి దేశాల్లో ఈ రెస్టారెంట్ బ్రాంచ్లు ఉన్నాయి. ప్రీమియం ఇండియన్ వంటకాలకు చిరునామాగా మారిన ఈ వ్యాపారం ద్వారా ఆశాజీకి భారీగా ఆదాయం సమకూరినట్లు తెలుస్తోంది.

ఇక రియల్ ఎస్టేట్ రంగంలోనూ భోంస్లేకు భారీగా పెట్టుబడులు ఉన్నాయి. ముంబై, పూణే వంటి నగరాల్లో ఖరీదైన ఆస్తులు ఉన్నాయి. ముఖ్యంగా ముంబైలోని పెద్దర్ రోడ్‌లో ఉన్న ఆశా భోంస్లే నివాసం `ప్రభు కుంజ్` ఎంతో ప్రసిద్ధి చెందింది. త‌న‌ వద్ద ఉన్న స్థిరాస్తుల విలువ మాత్రమే సుమారు 80 -100 కోట్ల రూపాయల వరకు ఉంటుందని మార్కెట్ వర్గాల అంచనా. ఒక కళాకారిణిగా ఉంటూనే తన బ్రాండ్ వాల్యూని వ్యాపార రంగంలోకి మళ్లించి ఇంతటి ఆర్థిక సామ్రాజ్యాన్ని నిర్మించడం నిజంగా గొప్ప స‌మ‌ర్థ‌త‌కు నిద‌ర్శ‌నంగా చూడాలి.

భారతీయ సంగీత ప్రపంచం ఒక ధ్రువతారను కోల్పోయిన వేళ‌..

దిగ్గజ గాయని ఆశా భోంస్లే (92) కన్నుమూయడంతో సంగీత లోకం మూగబోయిన సంగ‌తి విధిత‌మే. సోమవారం సాయంత్రం ముంబైలోని శివాజీ పార్క్ స్మశానవాటికలో ఆశాజీ పార్థీవ దేహానికి అంత్యక్రియలు పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించారు ఈ సందర్భంగా సినీ, రాజకీయ, క్రీడా రంగాలకు చెందిన అనేక మంది ప్రముఖులు హాజరై ఆమెకు కన్నీటి నివాళులర్పించారు. భౌతిక కాయానికి మహారాష్ట్ర ప్రభుత్వం తరపున గౌరవ వందనం సమర్పించిన అనంతరం కుటుంబ సభ్యులు అంతిమ సంస్కారాలను నిర్వహించారు.

ఎనిమిది దశాబ్దాలకు పైగా వేలాది పాటలతో కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్న ఆశా భోంస్లే నిష్క్రమణ భారతీయ కళారంగానికి తీరని లోటు. ఈ మేటి గాయ‌ని అంతిమ యాత్రలో వేలాది మంది అభిమానులు పాల్గొని..ఆమె పాడిన చిరస్మరణీయ గీతాలను స్మరించుకుంటూ వీడ్కోలు పలికారు. ఆశాజీ భౌతికంగా మ‌న మ‌ధ్య లేక‌పోయినా..ఆమె మధురమైన గాత్రం సంగీత ప్రియుల గుండెల్లో ఎప్పటికీ సజీవంగానే ఉంటుంది.