కోర్టులో ఆర్యన్ ఖాన్‌తో వాంఖడే అలుపెరగని పోరాటం!
కొంతకాలంగా బాలీవుడ్ కింగ్ ఖాన్ వారసుడు ఆర్యన్ ఖాన్ వర్సెస్ మాజీ ఎన్సీబీ అధికారి సమీర్ వాంఖడే మధ్య వార్ జరుగుతున్న సంగతి తెలిసిందే.
By: Sivaji Kontham | 2 Nov 2025 5:00 PM ISTకొంతకాలంగా బాలీవుడ్ కింగ్ ఖాన్ వారసుడు ఆర్యన్ ఖాన్ వర్సెస్ మాజీ ఎన్సీబీ అధికారి సమీర్ వాంఖడే మధ్య వార్ జరుగుతున్న సంగతి తెలిసిందే. కోర్టుల పరిధిలో ఆ ఇద్దరి మధ్యా పోరాటం పరాకాష్ఠకు చేరుకుంటోంది. ఆర్యన్ దర్శకత్వం వహించిన `ది బా....డ్స్ ఆఫ్ బాలీవుడ్` సిరీస్ లో తనను అవమానిస్తూ, ఒక పాత్రను సృష్టించారని సమీర్ వాంఖడే దిల్లీ కోర్టులో పరువు నష్టం దావా వేశారు.
ఇద్దరు హై ప్రొఫైల్స్ మధ్య పోరాటం ఇప్పుడు పరాకాష్ఠకు చేరుకుంది. ఆర్యన్ ఖాన్ ని చాలా చిన్న వయసులో ఇబ్బంది పెట్టిన సమీర్ వాంఖడే విషయంలో కింగ్ ఖాన్ ఎక్కడా తగ్గడం లేదు.
షారుఖ్ ఖాన్ కంపెనీ రెడ్ చిల్లీస్‌పై వాంఖడే దాఖలు చేసిన పరువు నష్టం కేసులో కోర్టు ప్రశ్నలకు అతడు సమాధానం ఇచ్చాడు. `ది బా***డ్స్ ఆఫ్ బాలీవుడ్`లో తన ఇమేజ్‌కు నష్టం కలిగించేలా చిత్రీకరించారని అతడు ఆరోపించారు. వెబ్ సిరీస్‌లో చూపించిన ఎన్సీబీ అధికారికి తనకు మధ్య నాలుగు స్పష్టమైన సారూప్యతలు ఉన్నాయని వాంఖడే వాదిస్తున్నారు.
శారీరక సారూప్యత, పెద్ద కుటుంబానికి చెందిన వ్యక్తి అరెస్ట్, జాతీయ నినాదాన్ని అపహాస్యం చేయడం, వ్యక్తిగత శైలి..వంటివి సారూప్యంగా ఉన్నాయి. ఆ పాత్ర.. వాంఖడే ముఖ, శారీరక లక్షణాలతో అద్భుతమైన పోలికను కలిగి ఉంది. పని శైలి, పాత్ర ప్రసంగం, ప్రవర్తన అచ్చం వాంఖడే మాదిరిగానే ఉంటాయని కోర్టులో వాదించారు. ఆ పాత్ర ఆర్యన్ ఖాన్ ను అరెస్టు చేసినట్టే, చిత్ర పరిశ్రమలో ప్రభావవంతమైన వ్యక్తిని అరెస్టు చేస్తుంది.
ఆ పాత్ర సత్యమేవ జయతే అంటూ నినదిస్తుంది. ఆర్యన్ ఖాన్ కేసు దర్యాప్తు సమయంలో మీడియాతో మాట్లాడేటప్పుడు తాను తరచుగా ఉపయోగించే పదబంధమిదేనని వాంఖడే వివరించాడు. ఈ జాతీయ నినాదాన్ని అవమానకరమైన రీతిలో ఉపయోగించడాన్ని ఎగతాళిగా లేదా జోక్‌గా తీసుకోలేమని వాంఖడే అన్నారు.
కొన్ని వాస్తవ సంఘటనల నుండి ప్రేరణ పొంది రూపొందిస్తున్నామని ఆర్యన్ ఖాన్ స్వయంగా ఒక ఇంటర్వ్యూలో అంగీకరించారని వాంఖడే బలంగా వాదించారు. ది బా***డ్స్ ఆఫ్ బోల్‌వ్యుడ్ `పూర్తిగా కల్పితం` అని రెడ్ చిల్లీస్ చేసిన వాదన అబద్ధమని కూడా వాంఖడే వాదిస్తున్నారు. ఈ పాత్ర ఉద్ధేశం కచ్ఛితంగా ప్రతీకార తీర్చుకోవడం, ప్రతిష్ఠను దెబ్బ తీయడం అని వాంఖడే అన్నారు. ఈ పాత్ర కారణంగా.. తనకు మాత్రమే కాకుండా తన భార్య, సోదరికి కూడా నిరంతరం ప్రజల నుండి అభ్యంతరకరమైన, అసభ్యకరమైన మెసేజ్ లు వస్తున్నాయని వాంఖడే పేర్కొన్నారు. తాను ప్రాథమిక రాజ్యాంగ హక్కులను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నానని వాంఖడే వ్యాఖ్యానించారు. పరువు నష్టం జరగడాన్ని అంగీకరించలేమని కూడా అన్నారు. దాదాపు 13000 కోట్ల నికర ఆస్తులతో ప్రపంచంలోనే సంపన్న నటుడిగా వెలుగొందుతున్న కింగ్ ఖాన్ ఫ్యామిలీతో ఒక ఆఫీసర్ పోరాటంగా దీనిని పరిగణించాలి.
