Begin typing your search above and press return to search.

ఆర్య‌న్ ఖాన్ 'క్రూయిజ్ పార్టీ' కేసును ఈయ‌న డీల్ చేయ‌క‌పోతే?

షారూఖ్ ఎంత తెలివైన‌వాడో ఇప్పుడు అడ్వొకేట్ ముకుల్ ఓ ఇంట‌ర్వ్యూలో చ‌ర్చించిన తీరు అంద‌రి హృద‌యాల‌ను గెలుచుకుంది. అత‌డు చాలా తెలివైన‌వాడు. ఎదుటివారిని త‌న తెలివితేట‌ల‌తో ఒప్పించ‌గ‌ల‌డు.

By:  Sivaji Kontham   |   20 Sept 2025 5:00 AM IST
ఆర్య‌న్ ఖాన్ క్రూయిజ్ పార్టీ కేసును ఈయ‌న డీల్ చేయ‌క‌పోతే?
X

కింగ్ ఖాన్ షారూఖ్ కుమారుడు ఆర్య‌న్ ఖాన్ `డ్ర‌గ్స్ ఆన్ క్రూయిజ్` కేసులో అరెస్ట్ అయిన సంగ‌తి తెలిసిందే. 2021లో క్రూయిజ్ పార్టీలో డ్ర‌గ్స్ సేవించారంటూ స‌మీర్ వాంఖ‌డే అనే నార్కోటిక్స్ అధికారి ఆర్య‌న్ ను, అత‌డి స్నేహితుల‌ను అరెస్ట్ చేయ‌డం సంచ‌ల‌న‌మైంది. త‌న‌యుడు అరెస్ట్ అయ్యాడు అని తెలియ‌గానే కింగ్ ఖాన్ షారూఖ్‌- గౌరీఖాన్ దంప‌తులు తీవ్ర‌మైన ఒత్తిడికి లోన‌య్యారు. ఖాన్ త‌న కుమారుడిని విడిపించుకునేందుకు చేయ‌ని ప్ర‌య‌త్నం లేదు. అత‌డు నిర్ధోషి అని నిరూపించేందుకు క‌చ్ఛిత‌త్వం ఉన్న అడ్వొకేట్ కోసం చాలా వెతికారు. ఆ స‌మ‌యంలోనే అత‌డికి ప్ర‌ముఖ అడ్వొకేట్, భారత మాజీ అటార్నీ జనరల్ అయిన ముకుల్ రోహిత్గిని సంప్ర‌దించాల‌ని స‌ల‌హా అందింది.

అయితే ఆయ‌న అప్ప‌టికే లండ‌న్ లో త‌న ఫ్యామిలీతో వెకేష‌న్ లో ఉన్నారు. అప్ప‌టిక‌ప్పుడు కింగ్ ఖాన్ షారూఖ్ అత‌డిని ఈ కేసును వాదించేందుకు రావాల్సిందిగా అభ్య‌ర్థించారు. అయితే తాను వెకేష‌న్ లో ఉన్నందున రాలేన‌ని అడ్వొకేట్ ముకుల్ సున్నితంగా తిర‌స్క‌రించారు. అయినా షారూఖ్ మొండివాడు. అత‌డి భార్య‌తో కాసేపు మాట్లాడారు. ఒక తండ్రి ఆవేద‌న‌ను అర్థం చేసుకోమ‌ని అభ్య‌ర్థించారు. అత‌డు ప్రాధేయ‌ప‌డిన తీరుకు ఆమె క‌న్విన్స్ అయ్యారు. వెంట‌నే త‌న భ‌ర్త‌ను ఈ కేసులో వాదించాల్సిందిగా ఒప్పించి ఆమె పంపించారు. అలా ముకుల్ నేరుగా ముంబైకి వ‌చ్చి ఆర్య‌న్ ఖాన్ కేసును టేక‌ప్ చేసారు. నిజానికి ఆ స‌మ‌యంలో లండ‌న్ నుంచి అడ్వొకేట్ ముకుల్ రోహిత్గీని ర‌ప్పించేందుకు కింగ్ ఖాన్ షారూఖ్ త‌న ప్ర‌యివేట్ జెట్ ను కూడా ఆఫ‌ర్ చేసార‌ట‌. కానీ దానిని అత‌డు తిర‌స్క‌రించాడు. అత‌డు ఫ్లైట్ లో బ‌య‌ల్దేరి వ‌చ్చాడు.

షారూఖ్ ఎంత తెలివైన‌వాడో ఇప్పుడు అడ్వొకేట్ ముకుల్ ఓ ఇంట‌ర్వ్యూలో చ‌ర్చించిన తీరు అంద‌రి హృద‌యాల‌ను గెలుచుకుంది. అత‌డు చాలా తెలివైన‌వాడు. ఎదుటివారిని త‌న తెలివితేట‌ల‌తో ఒప్పించ‌గ‌ల‌డు. ఈ కేసును వాదించేందుకు నేను త‌యారు చేసుకున్న ప్ర‌తి వివ‌రాన్ని(నోట్స్) నాతో పాటే రూమ్‌లో ఉండి తెలుసుకున్నాడు. అత‌డు ఆ స‌మ‌యంలో ఎంతో నిబ‌ద్ధ‌త‌తో ఉన్నాడు. ముంబైకి రాగానే స‌మ‌స్య ఏమిటో వివ‌రంగా తెలిపాడు.. అని ఖాన్ ని పొగిడేశారు రోహిత్గి.

ముకుల్ రోహిత్గి ఎవ‌రు? అంటే... ఆయ‌న భార‌త‌దేశం గ‌ర్వించ‌ద‌గిన ప్ర‌ముఖ అడ్వొకేట్. 1955 ఆగస్టు 17న జన్మించిన ఆయ‌న 1975లో ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి కామర్స్ (ఆనర్స్) పట్టా పొందారు. 1978లో బాంబే విశ్వవిద్యాలయం నుండి ఎల్ఎల్.బి. పట్టా పొందారు. అదే సంవత్సరం ఆయన ఢిల్లీ బార్ కౌన్సిల్‌లో చేరారు. 1994లో 39 సంవత్సరాల వయసులో ఢిల్లీ హైకోర్టు సీనియర్ అడ్వకేట్‌గా నియమితులయ్యారు. 1999లో రోహత్గి భారతదేశ అదనపు సొలిసిటర్ జనరల్‌గా నియమితులయ్యారు. 2004 వరకు ఆయన ఆ పదవిలో ఉన్నారు. 2014లో భారతదేశానికి 14వ అటార్నీ జనరల్‌గా నియమితులైనప్పుడు ఆయన కెరీర్ కొత్త శిఖరాగ్రానికి చేరుకుంది. 2017 వరకు ఆయన సేవలందించారు.

ఆయ‌న డీల్ చేయ‌ని క్రిమినల్ కేసు లేదు. కార్పొరేట్ వాణిజ్య వివాదాల‌ను డీల్ చేయ‌డంలో నిష్ణాతుడు. మేధో సంప‌త్తి, రాజ్యాంగ చ‌ట్టం, సేవా చ‌ట్టం టాపిక్ ఏదైనా కేసును ఛేజ్ చేసి గెల‌వ‌డంలో దిట్ట‌. కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన సంస్థల తరపున సుప్రీంకోర్టు -హైకోర్టులలో చాలా ల్యాండ్ మార్క్ కేసులలో ఆయన హాజరు బ‌లాన్ని పెంచింది. అత‌డికి సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, కార్పొరేట్ దిగ్గజాలు, ప్రభుత్వ అధికారులు క్ల‌యింట్లుగా ఉన్నారు. రోహిత్గి కేవ‌లం హై ప్రొఫైల్ కేసుల‌ను మాత్ర‌మే డీల్ చేస్తారు. భారీ రెమ్యున‌రేష‌న్ ని అత‌డికి చెల్లించుకోవాలి.

ఆర్య‌న్ ఖాన్ కేసును వాదించి చివ‌రికి గెలిచి చూపించారు. ఆర్య‌న్ ని నిర్ధోషిగా బ‌య‌ట‌కు తేవ‌డంలో ఆయ‌న నైపుణ్యం విస్మ‌రించ‌లేనిది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జె. జయలలిత, జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ వంటి వారికి లాయ‌ర్ గా సేవ‌లందించారు. ట్రిపుల్ తలాక్‌ను రాజ్యాంగ విరుద్ధమని కొట్టివేయడం, ఆధార్ గోప్యత , చెల్లుబాటు విచారణలలో వాదించడం, జాతీయ న్యాయ నియామకాల కమిషన్ (NJAC)పై వివాదాస్పద చర్చ, సినిమా హాళ్లలో జాతీయ గీతం ప్లే చేయడం చుట్టూ ఉన్న చట్టపరమైన విషయాలను ఆయ‌న కోర్టుల్లో డీల్ చేసారు. ఆయ‌న‌కు అంత‌ర్జాతీయంగాను గొప్ప గుర్తింపు ఉంది. భారత ప్రధానమంత్రి ప్రదానం చేసిన జాతీయ న్యాయ దినోత్సవ అవార్డు (2008), ఒడిశాలోని ఫకీర్ మోహన్ విశ్వవిద్యాలయం నుండి న్యాయశాస్త్రంలో డాక్టరేట్ (2011) అందుకున్నారు. భారత ప్రభుత్వం నియమించిన లోక్‌పాల్ - లోకాయుక్తల ఎంపిక కమిటీలో ప్రముఖ న్యాయశాస్త్ర సభ్యుడిగా కూడా ఆయన పనిచేస్తున్నారు. రాజ్యాంగ న్యాయశాస్త్రాన్ని రూపొందించిన దిగ్గ‌జ న్యాయ‌వాదిగా , భారతీయ న్యాయ రంగంలో అత్యంత ప్ర‌ముఖ వ్య‌క్తిగాను ఆయ‌న‌ గుర్తింపు తెచ్చుకున్నారు.