షారూఖ్ (X) ఆర్యన్ .. ఇది నిజమైతే సంచలనమే!
బాలీవుడ్ కింగ్ ఖాన్ షారూఖ్ తనయుడు ఆర్యన్ ఖాన్ నటనలోకి వెళ్లకుండా, దర్శకుడిగా ఆరంగేట్రం చేయడంపై చాలా చర్చ సాగింది.
By: Sivaji Kontham | 7 Nov 2025 6:15 AM ISTబాలీవుడ్ కింగ్ ఖాన్ షారూఖ్ తనయుడు ఆర్యన్ ఖాన్ నటనలోకి వెళ్లకుండా, దర్శకుడిగా ఆరంగేట్రం చేయడంపై చాలా చర్చ సాగింది. అతడు `ది బా***డ్స్ ఆఫ్ బాలీవుడ్` వెబ్ సిరీస్ తో తనలోని క్రియేటర్‌ని పరిచయం చేసాడు. బాలీవుడ్ సెలబ్రిటీ లైఫ్ పై వ్యంగ్యంగా విమర్శనాత్మకంగా సాగిన ఈ సిరీస్ పై క్రిటిక్స్ ప్రశంసలు కురిసాయి. ఆర్యన్ డేరింగ్ గా ఈ వెబ్ సిరీస్ ని రూపొందించాడని అందరూ మెచ్చుకున్నారు. కెరీర్ ఆరంగేట్రమే అతడు భారీ ప్రయోగం చేసాడు.
అందుకే అతడు తన తదుపరి ప్రయత్నంలో ఏం చేయబోతున్నాడో తెలుసుకోవాలన్న ఉత్సాహం అభిమానుల్లో అలానే ఉంది. ఆర్యన్ ఖాన్ ఈసారి తన సినిమాకి హీరోగా ఎవరిని ఎంపిక చేసుకోబోతున్నాడో తెలుసుకోవాలని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సరిగ్గా ఇలాంటి సమయంలో ఆర్యన్ తన తండ్రి, సూపర్ స్టార్ షారూఖ్ ని డైరెక్ట్ చేసేందుకు ఆస్కారం ఉందని అభిమానులు ఊహిస్తున్నారు. అయితే ఫ్యాన్స్ మనసులో ఏం ఉందో, అదే తన మనసులోను ఉందని నిరూపిస్తూ, ఇప్పుడు ఆర్యన్ ఖాన్ తన మూడో చిత్రంలో హీరోగా షారూఖ్ ఖాన్ ని ఎంపిక చేసుకున్నాడని కథనాలొస్తున్నాయి.
బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్‌తో సినిమా వచ్చే ఏడాది ప్రారంభమయ్యేందుకు ఆస్కారం ఉంది. ప్రస్తుతానికి వివరాల్ని రహస్యంగా ఉంచారు. ఇంకా ఏదీ అధికారికంగా ఖరారు కాలేదు.. ఇప్పటికి ఇవన్నీ ఊహాగానాలు మాత్రమేనా? ప్రాజెక్ట్ నిజమవుతుందా? అన్నదానికి సమాధానం వచ్చే ఏడాది ఆరంభంలో వస్తుందని తెలిసింది.
షారూఖ్ ఖాన్ ప్రస్తుతం సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో `కింగ్` అనే భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో సుహానా ఖాన్ ఒక కీలక పాత్రలో నటిస్తోంది. 2026లో రిలీజ్ చేయాలనేది ప్లాన్. ఖాన్ తదుపరి ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నాయి. అదే సమయంలో తన కుమారుడు ఆర్యన్ తో చేసే సినిమాపైనా షారూఖ్ ఎక్కువగా ఫోకస్ పెట్టేందుకు ఆస్కారం ఉందని తెలుస్తోంది. ఆర్యన్ సాంప్రదాయక ఆలోచనలకు భిన్నంగా ఏదైనా ప్రయోగం చేయడానికి కూడా ఆస్కారం లేకపోలేదు. ఇండస్ట్రీని ఏల్తున్న కింగ్ ఖాన్ వారసుడిగా అతడు నటనలోకి ప్రవేశించగలడు. కానీ దానిని కాదనుకుని దర్శకుడిగా తనలోని క్రియేటర్ కి పదును పెడుతున్నాడు. ఆర్యన్ తన తండ్రి షారూఖ్ కథానాయకుడిగా, ఒక వైవిధ్యమైన సినిమాని తెరకెక్కించి బ్లాక్ బస్టర్ కొట్టాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
