ఆర్యన్ సక్సెస్ అయ్యాడు.. సుహానా ప్రూవ్ చేస్తుందా?
అయితే ఇలాంటి వాళ్లందరికీ తన డెబ్యూ సినిమాతోనే కనువిప్పు కలిగించాడు ఆర్యన్ ఖాన్. కింగ్ ఖాన్ షారూఖ్ వారసుడి ఆరంగేట్రంపైనే అన్ని కళ్లు ఉన్నాయి.
By: Sivaji Kontham | 23 Sept 2025 6:00 PM ISTపూణే ఫిలింఇనిస్టిట్యూట్ లో చాలామంది సినిమా మేకింగ్‌పై శిక్షణ పొందారు. పిలింమేకర్స్ డి.ఎఫ్.టెక్ అంటూ టైటిల్ కార్డ్స్ లో పేర్లు వేసుకున్నారు. కానీ ఏం లాభం? ఒక్క హిట్టు కూడా కొట్టలేక చతికిలబడిన బాపతు చాలా మంది ఉన్నారు. బాలీవుడ్ లో చాలా మంది కాఫీ షాప్‌లో కూచుని పది హాలీవుడ్ సినిమాలు చూసి సినిమా తీసే బాపతు అన్న విమర్శల్ని కూడా ఎదుర్కొంటున్నారు. ఎమోషనల్ కంటెంట్ ని అందించడంలో హిందీ ఫిలింమేకర్స్ విఫలమవుతున్నారని తీవ్ర విమర్శలు ఉన్నాయి.
అయితే ఇలాంటి వాళ్లందరికీ తన డెబ్యూ సినిమాతోనే కనువిప్పు కలిగించాడు ఆర్యన్ ఖాన్. కింగ్ ఖాన్ షారూఖ్ వారసుడి ఆరంగేట్రంపైనే అన్ని కళ్లు ఉన్నాయి. అతడు తండ్రి బాటలో హీరో అవ్వకుండా, దర్శకత్వంలో ప్రయోగం చేస్తానంటే చాలా మంది నవ్వుకున్నారు. అతడు సరదాపడుతున్నాడులే అనుకున్నారు. కానీ ఇది సరదాకి కాదు.. ఇది ప్రత్యేకతను చాటుకునేందుకు అని నిరూపించాడు ఆర్యన్ ఖాన్. ఆహా ఓహో అనే రేంజులో కాకపోయినా అతడు బాలీవుడ్ సెలబ్రిటీల వ్యవహారాలపై సెటైరికల్ కామెడీని రూపొందించిన తీరుకు ప్రశంసలు కురుస్తున్నాయి. `బాడ్స్ ఆఫ్ బాలీవుడ్` వెబ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో ఉత్తమమైన వాటిలో ఒకటి అన్న పేరును తెచ్చుకుంది. తొలి ప్రయత్నమే ఆర్యన్ తన సత్తా చాటాడని ప్రశంసలు కురుస్తున్నాయి. టీజర్, ట్రైలర్ దశ నుంచి ఆకట్టుకున్న అతడు వేక్ గా చెత్త వెబ్‌సిరీస్ తీయలేదని నిరూపించాడు.
ఇక ఆర్యన్ నిరూపించాడు గనుక, తదుపరి కింగ్ ఖాన్ వారసురాలు సుహానా ఖాన్ నటిగా నిరూపించాల్సి ఉంటుంది. తన తండ్రి షారూఖ్ తో కలిసి కింగ్ అనే భారీ యాక్షన్ చిత్రంలో సుహానా నటిస్తోంది. సుహానా ఇప్పటికే జోయా అక్తర్ తెరకెక్కించిన వెబ్ సిరీస్ ది ఆర్చీస్ లో నటించింది. ఇప్పుడు సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలోని యాక్షన్ చిత్రంతో వెండితెరకు పరిచయమవుతోంది. ఈ నేపథ్యంలో ఖాన్ వారసురాలి నట ప్రతిభను చూడాలని అభిమానులు ఆసక్తిగా వేచి చూస్తున్నారు. స్వయంకృషితో వినోదప్రపంచంలో అసాధారణమైన సామ్రాజ్యాన్ని సృష్టించిన షారూఖ్ లెగసీని వారసులు ముందుకు తీసుకెళ్లడంలో ఏమేరకు విజయం సాధిస్తారో వేచి చూడాలి.
