స్టార్ కిడ్‌పై నెగిటివిటీ తగ్గినట్లేనా..?
ఇటీవల ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. ట్రైలర్ రిలీజ్ తర్వాత షారుఖ్ ఖాన్ తనయుడిగా కాకుండా ఆర్యన్ ఖాన్‌గానే ఆయన్ను చూడటం మొదలు పెట్టారు.
By: Ramesh Palla | 29 Aug 2025 5:00 PM ISTబాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ దర్శకుడిగా ఎంట్రీకి రెడీ అయ్యాడు. ఇప్పటికే ఆర్యన్ ఖాన్ వెబ్ సిరీస్‌ను తెరకెక్కించిన విషయం తెల్సిందే. సాధారణంగా స్టార్స్ యొక్క వారసులు హీరోలుగా మారాలి అనుకుంటారు. కానీ ఆర్యన్ ఖాన్ విభిన్నంగా దర్శకుడిగా మారాలి అనుకోవడం అందరినీ సర్‌ప్రైజ్‌కి గురి చేసింది. నిర్మాణంపై కూడా కాకుండా దర్శకత్వంపై ఆర్యన్ ఖాన్ కి ఆసక్తి కలగడం ఆశ్చర్యంగా ఉందని, అతడికి ఆ ప్రతిభ ఉందా అనే అనుమానాలు మొదట వ్యక్తం అయ్యాయి. కానీ ఆయన దర్శకత్వంలో వచ్చిన బాడ్స్ ఆఫ్ బాలీవుడ్ టీజర్ చూసిన తర్వాత ఒక్కసారిగా ఆయనపై ఒక అభిప్రాయం అనేది ఏర్పడింది. దర్శకుడిగా ఏదో కొత్తది చూపించేందుకు ప్రయత్నిస్తున్నాడు అని అంతా అనుకున్నారు.
ఆర్యన్ ఖాన్ అరంగేట్రం
ఇటీవల ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. ట్రైలర్ రిలీజ్ తర్వాత షారుఖ్ ఖాన్ తనయుడిగా కాకుండా ఆర్యన్ ఖాన్‌గానే ఆయన్ను చూడటం మొదలు పెట్టారు. సాధారణంగా మొదటి సినిమా లేదా వెబ్ సిరీస్ ను చేసే దర్శకుడు ఒక కమర్షియల్ పాయింట్‌ను, రిస్క్ లేకుండా ఎంపిక చేసుకుంటాడు. కానీ ఆర్యన్ ఖాన్ మాత్రం చాలా రిస్కీ ప్రాజెక్ట్ ను, కమర్షియల్ యాంగిల్ లో చేసే ఉద్దేశంతో ఈ వెబ్ సిరీస్‌ను మొదలు పెట్టాడు అనిపించింది. చాలా అంచనాలు పెంచే విధంగా ట్రైలర్ ఉంది. అంతే కాకుండా ఆయన వాయిస్ ఓవర్ ఇచ్చి విడుదల చేసిన వీడియో సైతం వైరల్ అయింది. దాంతో చాలా మంది ఆర్యన్ ఖాన్ దర్శకత్వంతో పాటు నటుడిగానూ ట్రై చేయాలని కోరుకుంటూ మెసేజ్ చేశారు. ఆర్యన్ ఖాన్ మెల్ల మెల్లగా జనాల్లోకి చేరి పోయాడు.
బాలీవుడ్ మీడియాలో ఆర్యన్ ఖాన్ గురించి...
కొన్నాళ్ల క్రితం ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యి చాలా వారాల పాటు జైల్లో ఉండటంతో అతడి గురించి మీడియా వారు మాత్రమే కాకుండా బాలీవుడ్ వర్గాల వారు సైతం చాలా నెగటివ్‌గా మాట్లాడటం జరిగింది. షారుఖ్ ఖాన్ తనయుడు కావడం వల్ల అతడు ఏం చేసినా నడుస్తుందని, ఏకంగా డ్రగ్స్ కు అలవాటు పడ్డాడు అంటూ సోషల్ మీడియాలో ఆర్యన్ ఖాన్ గురించి తీవ్రంగా మాట్లాడిన వారు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు అంతా ఆర్యన్ ఖాన్ అనగానే వెబ్ సిరీస్ వచ్చే విధంగా పబ్లిసిటీ చేస్తున్నారు. చాలా బలమైన పీఆర్ టీం ప్రస్తుతం ఆర్యన్ ఖాన్‌కి, ఆయన వెబ్ సిరీస్‌కి పని చేస్తుందని అంటున్నారు. అంతే కాకుండా ఆయనతో వర్క్ చేసిన చాలా మంది సైతం ఒక మంచి టెక్నీషియన్ అంటూ కామెంట్స్ చేస్తూ సోషల్ మీడియా ద్వారా ఆర్యన్ ఖాన్ గురించి మాట్లాడుతున్నారు.
నెట్‌ఫ్లిక్స్ ద్వారా బాడ్స్ ఆఫ్ బాలీవుడ్ వెబ్ సిరీస్
సాధారణంగానే స్టార్స్ వారసులు డ్రగ్స్ లేదా మరేదైనా కేసులో చిక్కుకుంటే ఖచ్చితంగా ఏళ్లకు ఏళ్లు ఆ నెగిటివిటీ నుంచి బయట పడటం కష్టం. ఒకవేళ నటుడిగా ఎంట్రీ ఇవ్వాలి అనుకుంటే చాలా మంది ఆ డ్రగ్స్ కేసును తెర ముందుకు మళ్లీ తీసుకు వచ్చే వారు. కానీ ఆర్యన్ ఖాన్ దర్శకత్వంతో ఇండస్ట్రీలో అడుగు పెట్టడం, అంతే కాకుండా ఇండస్ట్రీలో ఉన్న పరిస్థితులు, తద్వారా యూత్ ఎదుర్కొనే సమస్యల గురించి చెబుతున్న నేపథ్యంలో ఆర్యన్ ఖాన్ పై పాజిటివ్ అభిప్రాయం క్రియేట్ అవుతుంది. తాజాగా నటుడు మనీష్ చౌదరి మాట్లాడుతూ దర్శకుడిగా ఆర్యన్ ఖాన్ పర్‌ఫెక్ట్ పర్సన్ అన్నాడు. అంతే కాకుండా అతడితో పని చేయడం చాలా ఉత్సాహాన్ని కలిగిస్తుందని అన్నాడు. అతడితో వర్క్ చేసిన వారందరితోనూ సన్నిహిత సంబంధాలు పెంచుకున్నాడని పేర్కొన్నాడు.
సెప్టెంబర్ 18 నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతున్న బాడ్స్ ఆఫ్ బాలీవుడ్‌లో ప్రముఖ నటీనటులు ఎక్కువ మంది లేరు, ఎక్కువ శాతం కొత్త వారితో దర్శకుడు ఆర్యన్ ఖాన్ ఈ వెబ్ సిరీస్‌ను రూపొందించినట్లు తెలుస్తోంది. ట్రైలర్‌ను చూస్తూ ఉంటే బాలీవుడ్ చుట్టూ ఉన్న పరిస్థితులు, అక్కడికి వెళ్లిన తర్వాత ఎదుర్కొనే ఇబ్బందులు, ఇతర విషయాల గురించి చెప్పబోతున్నట్లు తెలుస్తోంది. బాబీ డియోల్ ఈ వెబ్ సిరీస్‌లో ముఖ్య పాత్రలో నటించిన విషయం తెల్సిందే.
